యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

ABN , First Publish Date - 2021-05-05T06:57:29+05:30 IST

దర్శి ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. ప్రభుత్వ రీచ్‌లు లేకపోయినప్పటికీ వాగుల్లో ఇసుకను అడ్డగోలుగా తరలించి అధికార పార్టీకి చెందిన కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
పోలీసు స్టేషన్‌ వద్ద ఉంచిన ఇసుక తరలిస్తున్న వాహనాలు

దర్శి, మే 4 : దర్శి ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. ప్రభుత్వ రీచ్‌లు లేకపోయినప్పటికీ వాగుల్లో ఇసుకను అడ్డగోలుగా తరలించి అధికార పార్టీకి చెందిన కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. నియంత్రించాల్సిన స్థానిక అధికారులు మామూళ్లు తీసుకుంటూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

నియోజకవర్గంలోని గండ్లకమ్మ, చిలకలేరు, మూసి నదులు ఉన్నాయి. గుండ్లకమ్మ పరివాహ ప్రాంతంలో నిర్ధిష్ట ప్రదేశంలో మాత్రమే ప్రభుత్వ రీచ్‌లు ఉన్నాయి. మిగిలిన వాగులలో ఎలాంటి రీచ్‌లు లేవు. చిలకలేరు, గుండ్లకమ్మ నదుల పరివాహక ప్రాంతాల్లో కొందరు పట్టాభూములను లీజుకు తీసుకొని ఇసుక తవ్వుకునేందుకు అనుమతులు తీసుకున్నారు. ఆ అనుమతులను అడ్డంపెట్టుకొని నదులలోని ఇసుకను అడ్డగోలుగా తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి పొదిలి, మార్కాపురం, దోర్నాల, తదితర ప్రాంతాలకు ఇసుకను అడ్డగోలుగా తరలిస్తున్నారు. 

పర్మిట్‌ ఒకటి.. ట్రిప్పులు వందలు

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న సమయాల్లో అధికారులు తనిఖీలు చేసినప్పుడు పొలాలకు అనుమతులు తీసుకున్న పర్మిట్లు చూపుతున్నారు. ఒక పర్మిట్‌తో అనేక పర్యాయాలు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న విషయం స్ధానిక అధికారులకు స్పష్టంగా తెలుసు. యథేచ్చగా ఇసుకను తరలిస్తున్నప్పటికీ పట్టించుకోవటం లేదు. ఉన్నతాధికారులు ప్రత్యేకంగా వచ్చి తనిఖీలు చేసినప్పుడు భారీ సంఖ్యలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు, ఇసుక తోడుతున్న ఎక్సకవేటర్లు పట్టుబడుతున్నాయి. 

స్థానిక అధికారులకు పుష్కలంగా మామూళ్లు

ఇసుక అక్రమ రవాణా మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతుండడంతో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. స్థానిక అధికారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున మాముళ్లు ముట్టచెబుతున్నారు. దీంతో వారు తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారు. జిల్లా నుంచి ఉన్నతాధికారులు ఆకస్మికంగా దాడులు చేస్తే భారీ ఎత్తున ఇసుక డంప్‌లు, టిప్పర్లు, ఎక్స్‌కవేటర్లు దొరుకుతున్నాయి. అందుకు నిదర్శనమే ఇటీవలే తాళ్లూరు మండలంలోని విఠలాపురం-పోలవరం మధ్య ఉన్న చిలకలేరులో ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఏడు టిప్పర్లను, ఎక్స్‌కవేటర్‌ను ఒంగోలు ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. 

మూసిలోనూ...

దర్శి-పొదిలి మధ్యన ఉన్న మూసి నదిలో కూడా ఇసుకను కొన్నిచోట్ల అడ్డగోలుగా తరలిస్తున్నారు. ఎక్కడా రీచ్‌లు లేనప్పటికీ ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దర్శి మండల పరిధిలో ఎర్రోబనపల్లి, గణేశ్వరపురం, పొదిలి మండల పరిధిలో ఉన్నగురువాయపాలెం, అగ్రహరం తదితర ప్రాంతాల నుంచి మూసి నదిలో ఇసుకను యథేచ్చగా తరలిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టకుంటే నదులు, వాగులు సహజత్వం కోల్పోయి కోసుకుపోతున్నారు. అంతేగాక ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతున్నారు. 

రెండు టిప్పర్లు స్వాదీనం

దర్శి, మే 4 : అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను దర్శి పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. మండలంలోని తూర్పువీరాయపాలెం చెరువు నుంచి మట్టి ఎత్తుకొని రెండు టిప్పర్లు వస్తుండగా పోలీసులు అటకాయించి పట్టుకున్నారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైనుకు మట్టిని తరలిస్తున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకోటయ్య తెలిపారు.

Updated Date - 2021-05-05T06:57:29+05:30 IST