Aug 4 2021 @ 01:29AM

క్రిస్మస్‌ బరిలోనూ సందడి!

కరోనా రెండో దశ తర్వాత తెలుగునాట థియేటర్లలో సినిమా ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. తమిళనాట, ఉత్తరాదిలో ఇంకా తెరుచుకోలేదు. కానీ, త్వరలో తెరుచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకని, భారీ సినిమాలు చేస్తున్న హీరోలు, తీస్తున్న దర్శక-నిర్మాతలు ఒకొక్కరుగా విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప - ద రైజ్‌’ను ఈ ఏడాది క్రిస్మ్‌సకు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తాజాగా ప్రకటించారు. తెలుగు సహా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్‌ తొలి పాన్‌ ఇండియా చిత్రమిది. ఆల్రెడీ క్రిస్మ్‌సకు ‘లాల్‌ సింగ్‌ చద్దా’ను విడుదల చేయనున్నట్టు  ఆమిర్‌ఖాన్‌ గతంలోనే వెల్లడించారు. దాంతో ఈ రెండు చిత్రాలు క్రిస్మ్‌సకు సందడి చేయనున్నాయి. ఓ విధంగా పోటీ పడనున్నాయి. ఇప్పటికే సంక్రాంతి బరిలో తెలుగునాట భారీ పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 12న పవన్‌కల్యాణ్‌-రానా సినిమా, 13న మహేశ్‌ బాబు ‘సర్కారు వారి పాట’, 14న ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ థియేటర్లలోకి రానున్నాయి. ప్రస్తుతానికి అధికారికంగా విడుదల తేదీలు ప్రకటించిన చిత్రాలివే. ‘ఎఫ్‌ 3’ను సంక్రాంతికి విడుదల చేస్తామని వెంకటేశ్‌ ప్రకటించారు. ‘బంగార్రాజు’ను సైతం సంక్రాంతికి సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.