సంగంలో ముగిసిన ఏసీబీ సోదాలు

ABN , First Publish Date - 2021-05-17T06:00:21+05:30 IST

మండలంలోని వడ్లమూడి సంగం డెయిరీలో జరుగుతున్న ఏసీబీ సోదాలు ఆదివారంతో ముగిశాయి.

సంగంలో ముగిసిన ఏసీబీ సోదాలు

గత నెల 23 నుంచి కొనసాగిన తనిఖీలు


చేబ్రోలు, మే 16: మండలంలోని వడ్లమూడి సంగం డెయిరీలో జరుగుతున్న ఏసీబీ సోదాలు ఆదివారంతో ముగిశాయి. గత నెల 23న డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, ఎండీ గోపాలకృష్ణన్లపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు వారిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆధారాల కోసం అప్పటి నుంచి ఏసీబీ అధికారులు డెయిరీలోని పరిపాలనా భవనాన్ని స్వాధీనం చేసుకుని సోదాలు చేపట్టారు.  సెలవు దినాలలో సైతం ఉద్యోగులను కార్యాలయానికి పిలిపించి సోదాలు చేశారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం పరిపాలనా భవనాన్ని ఏరోజుకారోజు సీజ్‌ చేసేశారు. ఏసీబీ అధికారులు పరిపాలనా భవనాన్ని సీజ్‌ చేయడం వల్ల, రోజుల తరబడి సోదాల వల్ల డెయిరీ కార్యకలాపాలు కుంటుబడుతున్నాయని ఉద్యోగులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. దీంతో సోదాలను 16వ తేదీలోగా ముగించి 17న ఆ వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆదివారంతో డెయిరీలో సోదాలు ముగించినట్లు సమాచారం. ఆదివారం సోదాల అనంతరం పంచనామా నిర్వహించి పరిపాలన భవనాన్ని సంగం అధికారులకు అప్పగించినట్లు సమాచారం.  

Updated Date - 2021-05-17T06:00:21+05:30 IST