Abn logo
Sep 24 2021 @ 23:32PM

సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్‌ పనులకు త్వరలోనే శ్రీకారం

కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న ఎమ్మెల్యేలు

పనులు పూర్తిచేయించే బాధ్యత హరీశ్‌దే

ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి: అందోలు, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటిని అందించే సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను త్వరలోనే మొదలుపెడతామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్‌, మాణిక్‌రావు, ఎం.భూపాల్‌రెడ్డి శుక్రవారం శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఆధర్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్న కేసీఆర్‌కు ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. వేల ఎకరాల సాగుకు నీరందించే కార్యక్రమంలో భాగస్వాములవుతున్నందుకు ఎమ్మెల్యేలను కేసీఆర్‌ అభినందించారు. ఆయా లిఫ్ట్‌ఇరిగేషన్‌ పనులను త్వరలోనే మొదలు పెడతామన్న కేసీఆర్‌... ఆ పనులు త్వరగా పూర్తయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదని సూచించారు. మంత్రి హరీశ్‌రావుకు ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకుంటూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసుకుంటూ పనులు పూర్తిచేయాలన్నారు. ఆయా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను దగ్గరుండి పూర్తిచేయించే బాధ్యత మంత్రి హరీశ్‌రావుదేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. 

సీఎంను కలిసిన ప్రొటెం చైర్మన్‌

శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి శుక్రవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. భూపాల్‌రెడ్డితో పాటు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు భానుప్రసాద్‌రావు, రాజేశ్వర్‌రెడ్డి, ఫారూఖ్‌ హుస్సేన్‌ తదితరులున్నారు.