శానిటేషన్‌ నిధుల్లో కోత

ABN , First Publish Date - 2021-06-23T05:17:54+05:30 IST

ఏటా వర్షాకాల సీజన్‌లో ప్రభుత్వం విడుదల చేసే పారిశుధ్యం నిధుల్లో కోత విధించడంతో గ్రామాల్లో శానిటేషన్‌ అస్తవ్యస్తంగా మారుతోంది. చిన్నపాటి వర్షాలకే చిత్తడిగా మారే గ్రామీణ రోడ్డు బురదమయంగా మారి మురుగునీటి కాలువల్లో చెత్తాచెదారం పేరుకు పోతోంది.

శానిటేషన్‌ నిధుల్లో కోత

అరకొర నిధులతో కరువవుతున్న పర్యవేక్షణ

గ్రామాల్లో అస్తవ్యస్తంగా మారుతున్న పారిశుధ్యం

ముప్పు ముంచుకొస్తున్నా అప్రమత్తం కాని అధికారులు

జిల్లాలో సవాలుగా మారుతున్న పల్లె ప్రగతి పనులు

ఆదిలాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఏటా వర్షాకాల సీజన్‌లో ప్రభుత్వం విడుదల చేసే పారిశుధ్యం నిధుల్లో కోత విధించడంతో గ్రామాల్లో శానిటేషన్‌ అస్తవ్యస్తంగా మారుతోంది. చిన్నపాటి వర్షాలకే చిత్తడిగా మారే గ్రామీణ రోడ్డు బురదమయంగా మారి మురుగునీటి కాలువల్లో చెత్తాచెదారం పేరుకు పోతోంది. దీంతో దోమలు, ఈగల బెడద పెరిగిపోయి ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్నారు. వర్షాకాలం ప్రారంభంకాగానే పారిశుధ్యం నిధులను విడుదల చేసి సీజనల్‌ వ్యాధుల ముప్పునుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంటుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్‌ నుంచి ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.10వేల చొప్పున పారిశుధ్యం నిధుల కింద రూ.46లక్షల 80వేలను విడుదల చేయాల్సి ఉంది. కానీ ఈ సారి నిధుల్లో కోత విధించి ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.5వేల చొప్పున రూ.23లక్షల 40వేలను మాత్రమే విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఈ నిధులను ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్‌ ఆఫీసర్‌, గ్రామ ఏఎన్‌ఎంల పేరిట జాయింట్‌ అకౌంట్‌లో జమ చేశారు. అయితే ఇప్పటికే వర్షాకాల సీజన్‌ ప్రారంభమైనా.. ఇప్పటి వరకు ఈ నిధులను వినియోగించక పోవడంతో సీజనల్‌ వ్యాధుల ముప్పు పొంచి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుబాటులో ఉన్న అరకొర నిధులతో పారిశుధ్యం పనులను చేపట్టలేమని ఆయా గ్రామాల సర్పంచ్‌లు చేతులెత్తేస్తున్నారు. దీంతో పల్లె ప్రగతిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారిస్తున్నా నిధుల కొరతతో పారిశుధ్యం పనులను చేపట్టడం సవాలుగానే మారుతుందంటున్నారు.

నిధుల వినియోగంపై అనుమానాలు..

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు వైద్య సిబ్బందికి శానిటేషన్‌ పేరిట ప్రత్యేక నిధులను అందిస్తున్న వాటి వినియోగంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెజార్టీ గ్రామాల్లో ఎలాంటి పనులను చేపట్టకుండానే సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నిధులపై ప్రజల్లో పెద్దగా అవగాహన లేక పోవడంతో నిధులను పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సంబంధిత మెడికల్‌ ఆఫీసర్‌, ఏఎన్‌ఎంలు కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు గతంలో ఫిర్యాదులు వచ్చినా జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నట్లు కనిపించ లేదు. ఏటా పారిశుధ్యం నిధులను పక్కదారి పట్టించడంతో పాటు అరకొర నిధులతో గ్రామాల్లో పారిశుధ్య పనులపై పర్యవేక్షణ కరువుతూనే ఉంది. 

అవగాహన కరువు..

ప్రభుత్వం గ్రామాల్లో పారిశుధ్యం కోసం లక్షల రూ పాయలను ఖర్చు చేస్తున్నా ప్రజల్లో మాత్రం అవగాహన కరువవుతోంది. గ్రామ పంచాయతీలకు అంద జేసే శానిటేషన్‌ నిధులను తాగునీటి పైపులైన్ల మరమ్మతులు, బ్లీచింగ్‌ పౌడర్‌ కొనుగోలు, దోమల మందును పిచికారీ చేయడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లాంటి పనులకు ఈ నిధులను ఉప యోగించాల్సి ఉంటుంది. కానీ ఈ నిధుల వినియోగంపై ఇప్పటి వరకు కొందరు సర్పంచ్‌లకే అవగాహ న లేక పోవడం గమనార్హాం. కొన్ని గ్రామాల్లో ఏ ఎన్‌ ఎంలు సర్పంచ్‌లతో కుమ్మకై పనులు చేపట్టకుండా దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఏటా నిధుల మంజూరులో జాప్యం జరగడంతో ఈ నిధులపై పట్టింపే లేకుండా పోతోంది. అసలు ఈ నిధుల ను ఎలాంటి పనులకు ఉపయోగించాలో తెలియడం లేదని స్వయంగా కొందరు ప్రజా ప్రతినిధులే పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది. వైద్య సిబ్బంది నకిలీ బిల్లులతో నిధులను ఖర్చు చేసినట్లు చూపుతు జేబులో వేసుకుంటున్నట్లు ఆరోపణలు లేక పోలేదు. ఈ నిధులపై మరింత అవగాహన కల్పిస్తే గ్రామ స్థాయిలో సద్వినియోగమయ్యే అవకాశం ఉందంటున్నా రు. కనీసం మండల స్థాయిలోనైనా నిధుల విడుదల వాటి వినియోగంపై సర్పంచ్‌లు, కార్యదర్శులకు అవగాహన కల్పిస్తే నిధుల వినియోగం సక్రమంగా జరిగే అవకాశాలుంటాయి.

అప్రమత్తం కాని అధికార యంత్రాంగం..

సీజనల్‌ వ్యాధుల ముప్పు ముంచుకొస్తున్న అధికార యంత్రాంగం అప్రమత్తమైనట్లు కనిపించడం లేదు. వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు పారిశుధ్యం చర్యలను తప్పని సరిగా చేపట్టాల్సి ఉంటుంది. ఏదైనా జరగకూడని సంఘటన జరిగితే హడావిడి చేయడం పరిపాటిగానే మారిపోతుంది. ప్రధానంగా వర్షాకాల సీజన్‌లో కలుషిత నీరు, మురికి నీటి కాలువల్లో చెత్తా చెదారం పేరుకపోయి దోమల బెడద విపరీతంగా పెరిగి పోతోంది. ఈదురు గాలులకు కరెంట్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే రాత్రిళ్లు దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంటి మీద కునుకు లేకుండా పోతోందని వాపోతున్నారు. అయినా అధికారులు శానిటేషన్‌ చర్యలు సక్రమంగా చేపట్టక పోవడంతో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. జిల్లాలో డయేరియా, మలేరియా, టైఫాయిడ్‌ విషజ్వరాల బారిన పడి వందలాది మంది మంచం పడుతున్న గ్రామాల్లో పారిశుధ్య చర్యలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ఏదో జిల్లా ఉన్నతాధికారులు పర్యటనల సందర్భంగానే గ్రామ పంచాయతీ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది హడావిడి చేస్తున్నా ఆ తర్వాత అంతా మామూలుగానే మారిపోతోంది. 


నిధులను సక్రమంగా వినియోగించాలి..

ఫ రాథోడ్‌ నరేందర్‌ (డీఎంఅండ్‌హెచ్‌వో)

పారిశుధ్యం పేరిట గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులను సక్రమంగా వినియోగించాలి. చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులతోనే నిధులను డ్రా చేయాల్సి ఉంటుంది. ఎక్కడైనా అవకతవకలు జరిగినటట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. మొదటి విడతలో గ్రామ పంచాయతీలకు రూ.5వేల చొప్పున నిధులను మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే మరిన్ని నిధులను అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. సీజనల్‌ వ్యాధుల ముప్పు పొంచి ఉండడంతో గ్రామాల్లో క్రమం తప్పకుండా పారిశుధ్యం పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటాం. వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకే ఈ నిధులను వినియోగించాల్సి ఉంటుంది.

Updated Date - 2021-06-23T05:17:54+05:30 IST