అధ్వాన పారిశుధ్యంతో భయం.. భయం..

ABN , First Publish Date - 2021-10-28T05:01:40+05:30 IST

పట్టణంలో అనారోగ్య పరిస్థితులపై మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

అధ్వాన పారిశుధ్యంతో భయం.. భయం..
సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌

తాగునీరు కలుషితం, దోమల విజృంభణ : కౌన్సిలర్లు

సూపర్‌ శానిటేషన్‌ చేయిస్తున్నాం : చైర్‌పర్సన్‌


కొవ్వూరు, అక్టోబరు 27: పట్టణంలో అనారోగ్య పరిస్థితులపై మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిణామాలు పట్టణ ప్రజలకు భయాన్ని కలిగిస్తున్నాయన్నారు. ప్రధానంగా పారిశుధ్యం అధ్వానం కావడం, తాగునీరు కలుషితం, దోమల వ్యాప్తి అనారోగ్య పరిస్థితికి దారి తీసిందన్నారు. కాగా పట్టణంలో సూపర్‌ శానిటేషన్‌ చేయించి పారిశుధ్యం పూర్తిగా మెరుగుపరుస్తామని చైర్‌పర్సన్‌ భరోసా ఇచ్చారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి అధ్యక్షతన బుధవారం జరిగింది. 1వ వార్డు కౌన్సిలర్‌ బొండాడ సత్యనారాయణ మాట్లాడుతూ 20 రోజులుగా పట్టణంలోని శ్రీరామకాలనీ, రాజీవ్‌కాలని ప్రజలు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. వారం రోజులుగా విషజ్వరాలు, కీళ్ల నొప్పులతో నడవలేని పరిస్థితిలో ఉన్నార న్నారు. కుటుంబంలో ఒకరు అనారోగ్యానికి గురైతే మిగిలిన వారందరికి వ్యాధి సోకుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుధ్యం మెరుగుపరచ డంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందజేయాలన్నారు. శ్రీరామకాలని, రాజీవ్‌కాలనీలకు శాశ్వతంగా 8 మంది పారిశుధ్య సిబ్బందిని కేటాయించాలని, డ్రెయినేజి వ్యవస్థను యుద్ధప్రాతిపదికన మెరుగుపర్చాలన్నారు. టీడీపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్‌ (చిన్ని) మాట్లాడుతూ తాగునీరు కలుషితం, దోమల వ్యాప్తితో వ్యాధులు విజృంభిస్తున్నాయన్నారు. వర్షాకాలం లేఅవుట్‌లు, నాన్‌ లేఅవుట్‌ భూముల లో నీరు నిలచి దోమలు విపరీతంగా పెరిగాయన్నారు. గతంలో ఏలూరులో అంతుచిక్కని వ్యాధి వచ్చిందని, కొవ్వూరులో కూడా అదే పరిస్థితి వస్తుందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని సమావేశం దృష్టికి తెచ్చారు. పట్టణమంతా వ్యాధి వ్యాపించక ముందే తగిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఉన్న పారిశుద్య సిబ్బందితో పాటు అదనంగా సిబ్బందిని తీసుకుని పట్టణంలోని 23 వార్డులలో సూపర్‌ శానిటేషన్‌ చేయించాలన్నారు. కౌన్సిల్‌ సమావేశానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యేవిధంగా చర్య లు తీసుకోవాలన్నారు. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదన్నారు. పట్టణంలో అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌జీవోల సహకారం తీసుకుని తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కౌన్సిలర్‌ కంఠమని రమేష్‌బాబు మాట్లాడుతూ కార్యాలయంలో, ఇళ్లలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య సిబ్బందిని వారికి కేటాయించిన వార్డులలో పారిశుధ్య నిర్వహణకు వినియోగించాలన్నారు.


ప్రత్యేక పారిశుధ్య పనులు : చైర్‌ పర్సన్‌


చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి మాట్లాడుతూ శ్రీరామకాలనీలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టామని, కాలనీ వాసుల రక్త నమూనాలతో పాటు, తాగునీరు, పాలు, కూరగాయల నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించినట్లు తెలిపారు. పట్టణమంతా సూపర్‌ శానిటేషన్‌ చేయించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

సమావేశంలో అజెండాలోని 9,10 అంశాలను వాయిదా వేసి మిగిలిన అన్ని అంశాలను ఆమోదించారు. రైల్వేస్టేషన్‌ టుబాకో కంపెనీ పక్కన ఉన్న మున్సిపల్‌ బిల్డింగ్‌ను నాయిబ్రాహ్మణుల కమ్యూనిటీ హాలుగా వినియోగించుకోవడానికి, రూరల్‌ పోలీస్టేషన్‌ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారుల భవనం లీజును రద్దుచేసి, ఉచితంగా అందించాలని కౌన్సిల్‌లో ప్రవేశపెట్టిన తీర్మానాలను వాయిదా వేశారు. కౌన్సిల్‌కు తీసుకువచ్చే అంశాలను ముందు గా పూర్తిగా పరిశీలించాలని, ఆమోదయోగ్యమైన అంశాలను కౌన్సిల్‌ అజెండాలో చేర్చాలని సభ్యులు సూచించారు. అమలు చేయడానికి అవకాశం లేని అంశాలను అజెండాల్లో చేర్చడం ద్వారా సభ్యులను ఇరకాటంలో పెట్టడం, సమయాన్ని వృథాచేయవద్దని కోరారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌లు మన్నె పద్మ, గండ్రోతు అంజలీదేవి, కమిషనర్‌ టి.రవికుమార్‌, కౌన్సిలర్లు, కో–ఆప్షన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-28T05:01:40+05:30 IST