నేటి నుంచి నగరంలో పారిశుధ్య వారోత్సవాలు

ABN , First Publish Date - 2020-06-01T10:24:33+05:30 IST

నగరపాలక సంస్థ పరిధిలో సోమవారం నుంచి జూన్‌ 8వరకు వారంరోజులపాటు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మేయర్‌

నేటి నుంచి నగరంలో పారిశుధ్య వారోత్సవాలు

మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ క్రాంతి 


కరీంనగర్‌ టౌన్‌, మే 31: నగరపాలక సంస్థ పరిధిలో సోమవారం నుంచి జూన్‌ 8వరకు వారంరోజులపాటు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, కమిషనర్‌ వల్లూరి క్రాంతి తెలిపారు. ఆదివారం మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వారంరోజులపాటు చేపట్టే ఈ కార్యక్రమంలో వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు, దోమల నిర్మూలన, డ్రెయినేజీలు, ఖాళీ స్థలాలను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.


అలాగే హరితహారం కార్యక్రమంలో కార్పొరేటర్లను భాగస్వాములను చేస్తూ మొక్కలను ఎక్కడ, ఎన్ని నాటాలి, నాటిన వాటిని సంరక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇంకుడుగుంతల నిర్మాణాలను కూడా చేపడతామని చెప్పారు. నగరపాలక సంస్తలో నిధులకు కొరత లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా నేపథ్యంలో మూడు నెలల్లో నగరానికి 11కోట్ల రూపాయలను మంజూరు చేశారని, వాటితో అభివృద్ధి పనులు చేపడతామని మేయర్‌ సునీల్‌రావు తెలిపారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో, హరితహరంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.

Updated Date - 2020-06-01T10:24:33+05:30 IST