Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 6 2021 @ 14:53PM

జావెద్ అఖ్తర్‌పై సంజయ్ రౌత్ నిప్పులు..

ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ)లను తాలిబన్లతో  ప్రముఖ రచయిత జావెద్ అఖ్తర్‌ పోల్చడాన్ని శివనేత ఎంపీ సంజయ్ రౌత్ తప్పుపట్టారు. దేశంలోని ఏ సంస్థలనైనా తాలిబన్లతో పోల్చడం గర్హనీయమని అన్నారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇదే విషయాన్ని 'సామ్నా'లో ఇవాళ తాము పేర్కొన్నట్టు చెప్పారు. దేశంలోని ఏ సంస్థను తాలిబన్లతో పోల్చడం తగదని అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, తాలిబన్ల దుర్మార్గ ప్రవర్తన ఇక్కడ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ఇక్కడి విపక్ష పార్టీలు ఎమర్జెన్సీ కూడా చవిచూశాయని అన్నారు.

తాలిబన్లను హిందుత్వతో పోల్చడం హిందూ సంస్కృతిని అగౌరవపరచడమేనని శివసేన అధికర పత్రిక 'సామ్నా' సంపాదకీయం జావెద్ అఖ్తర్‌పై మండిపడింది. ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ సిద్ధాంతాలను తాలిబన్ విధానాలతో పోల్చే ప్రజలు పునరాలోచించుకోవాలని సూచించింది. దేశంలోని అత్యధిక జనాభా సెక్యులర్ వాదులని, ఇతర మతాల అభిప్రాయాలను కూడా గౌరవిస్తుంటారని, తాలిబన్ల ఐడియాలజీని ఏమాత్రం అంగీకరించరని పేర్కొంది. ''హిందూ మెజారిటీ దేశం భారతదేశం. ఎంతో గర్వించదగిన సెక్యులర్ దేశం ఇది'' అని సామ్నా సంపాదకీయం పేర్కొంది. కాగా, అఖ్తర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ముంబైలోని ఆయన నివాసం బయట బీజేపీ ఆదివారంనాడు నిరసన ప్రదర్శన జరిపింది.

Advertisement
Advertisement