జిన్నాను హత్య చేసి ఉంటే... : సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2021-08-22T22:02:41+05:30 IST

ఓ దేశ ఉనికి, సార్వభౌమాధికారాల విధ్వంసం తాలూకు బాధ

జిన్నాను హత్య చేసి ఉంటే... : సంజయ్ రౌత్

ముంబై : ఓ దేశ ఉనికి, సార్వభౌమాధికారాల విధ్వంసం తాలూకు బాధ గుర్తుకొస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఆఫ్ఘనిస్థాన్ ప్రస్తుత పరిస్థితులను మన దేశ విభజన నాటి పరిస్థితులతో పోల్చుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేన పత్రిక ‘సామ్నా’లో ‘రోఖ్‌ఠోక్’ పేరుతో ప్రతి వారం ఆయన రాసే వ్యాసంలో, నాధూరాం గాడ్సే మహాత్మా గాంధీని కాకుండా మహమ్మద్ అలీ జిన్నాను హత్య చేసి ఉంటే దేశ విభజన జరిగి ఉండేది కాదన్నారు. అటువంటపుడు ‘‘దేశ విభజన ఘోరాలు గుర్తుకొచ్చే రోజు’’ అవసరమే ఉండేది కాదన్నారు. 


ఓ దేశ అస్తిత్వం, సార్వభౌమాధికారాల విధ్వంసం తాలూకు బాధ ఎలా ఉంటుందో నేటి ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితులు గుర్తు చేస్తున్నాయన్నారు. ఆఫ్ఘనిస్థాన్ సైన్యం తోక ముడిచిందన్నారు. విభజన గాయం ఎలా మానుతుందని ప్రశ్నిస్తూ, విడిపోయిన ముక్కను మళ్ళీ కలుపుకోకపోతే విభజన బాధ నుంచి ఉపశమనం ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. మనశ్శాంతి ఉండదన్నారు. అఖండ హిందుస్థాన్ ఏర్పడాలని మనం అనుకున్నప్పటికీ, అది సాధ్యమయ్యేలా లేదన్నారు. అయితే ఆశావాదం శాశ్వతంగా ఉంటుందన్నారు. ఒక వేళ పీఎం నరేంద్ర మోదీ అఖండ హిందుస్థాన్‌ను కోరుకుంటే, స్వాగతిస్తానన్నారు. అప్పుడు పాకిస్థాన్‌ నుంచి వచ్చే 11 కోట్ల మంది ముస్లింల కోసం తన వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటో మోదీ చెప్పాలన్నారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఆగస్టు 14ను దేశ విభజన ఘోరాలు గుర్తుకొచ్చే రోజుగా పేర్కొన్న సంగతి తెలిసిందే.


Updated Date - 2021-08-22T22:02:41+05:30 IST