Abn logo
Jun 10 2021 @ 17:37PM

మోదీయే టాప్ లీడర్... రౌత్ వ్యాఖ్యలతో దుమారం

ముంబై :  సీఎం ఉద్ధవ్ థాకరే ప్రధాని మోదీతో భేటీ కావడం మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమే రేపుతోంది. తాము వ్యక్తిగత సంబంధాలకు అత్యంత విలువ ఇస్తామని, రాజకీయంగా సంబంధాలను చూడమని  శివసేన తేల్చి చెప్పింది. అయినా... ఆ ఇద్దరి భేటీ మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపుతోంది.  మోదీపై ఎప్పుడూ ఒంటికాలుతో లేచే శివసేన ఎంపీ సంజయ్ రౌత్... తాజాగా మోదీని ఆకాశానికెత్తేశారు. మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ దేశంలో టాప్ లీడర్ అని, బీజేపీలో కూడా టాప్ లీడర్ అని ప్రశంసించారు. 

ఆయా రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర నేతలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు, మోదీ ఛరిష్మా తగ్గినట్లేనా? అని మీడియా ప్రశ్నించింది. దీనికి రౌత్ సమాధానమిస్తూ... ‘‘దీనిపై వ్యాఖ్యానించడానికి నేను ఇష్టపడను. మీడియాలో వస్తున్న వార్తలను నేను చూడలేదు. అధికారికంగా కూడా ఎక్కడా ఇలాంటి నిర్ణయం వెలువడలేదు. మోదీ దేశంలోనే టాప్ లీడర్. బీజేపీలో కూడా’’ అంటూ రౌత్ వ్యాఖ్యానించారు. గత 7 సంవత్సరాల్లో బీజేపీ సాధించిన ఘన విజయాల వెనుక మోదీ కృషి ఉందని, బీజేపీలోనే మోదీ టాప్ అని రౌత్ పేర్కొన్నారు. ప్రధాని అన్న హోదా మొత్తం దేశానికి సంబంధించినదని, ఒక పార్టీకి సంబంధించింది కాదని తాము నమ్ముతామని అన్నారు. ప్రధాని మోదీ తలచుకుంటే శివసేనతో కలిసి పోటీ చేస్తారని ప్రకటించిన బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలపై రౌత్ ఆసక్తికరంగా స్పందించారు. ‘‘పులితో (శివసేన గుర్తు) ఎవరూ స్నేహం చేయలేరు. ఎవరితో స్నేహం చేయాలో పులే నిర్ణయించుకుంటుంది’’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. 

జాతీయంమరిన్ని...

Advertisement