పండుగ తర్వాత కోఢీపైకి.. ఖాకీ

ABN , First Publish Date - 2022-01-18T06:21:27+05:30 IST

సంక్రాంతి సంప్రదాయ ముసుగులో మూడు రోజుల పాటు తీర ప్రాంత గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి.

పండుగ తర్వాత కోఢీపైకి.. ఖాకీ
పల్లెకోనలోని బరుల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న స్పెషల్‌ పార్టీ పోలీసులు

మూడు రోజుల తర్వాత మేలుకొన్న పోలీసులు  

ఎట్టకేలకు నిజాంపట్నం, పల్లెకోనల్లో నిలిచిన  పందేలు

పందేలపై ప్రచారంతో భారీగా తరలివచ్చిన పందెంరాయుళ్లు

బరుల వద్ద పోలీసుల బందోబస్తుతో వెనుతిరిగిన వైనం

గుంటూరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సంప్రదాయ ముసుగులో మూడు రోజుల పాటు తీర ప్రాంత గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి. భారీగా బరులు ఏర్పాటు చేసిన నిర్వాహకులు తిరునాళ్ల వాతావరణంలో పందేలు జరిగినా అటువైపు చూడని పోలీసులు తీరిగ్గా సోమవారం స్పందించారు. మొదట్లో బరులపై దాడులు చేసి ఏర్పాట్లపై పోలీసు అధికారులు కన్నెర్ర చేశారు. పందేలు నిర్వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరికలు చేశారు. అయితే తగ్గేదేలేదన్నట్లుగా నిర్వాహకులు అధికారపార్టీ నాయకుల అండతో తిరిగి అదే ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేసి భారీగా పందేలు నిర్వహించారు. ఈ పరిస్థితుల్లో సంక్రాంతి కోడి పందేలపై జోరుగా ప్రచారం.. మీడియాలో వరుస కథనాలు వచ్చినా పండుగ మూడు రోజులు స్పందించలేదు. రూ.కోట్లలో పందేలు జరగడం.. జూదం, మద్యం ఏరులై పారడం.. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమవడంతో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో పోలీసు అధికారులు నిజాంపట్నం, పల్లెకోనల్లో పర్యటించి పందేలను నిలుపుదల చేశారు. పండుగ మూడు రోజులు భారీగా జరిగినా పందెంరాయుళ్లు మరింతగా పోటీ పడటంతో ఆయా ప్రాంతాల్లో సోమవారం కూడా పందేలు జరుగుతాయని నిర్వాహకులు బహిరంగంగా ప్రకటనలు చేశారు. దీంతో జిల్లావాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భారీగా పందెంరాయుళ్లు తరలివచ్చారు. అయితే కోడి పందేలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని నిజాంపట్నం బరుల నిర్వాహకులను పోలీసు అధికారులు హెచ్చరించినట్లు సమాచారం.  ఇక భట్టిప్రోలు మండలం పల్లెకోన బరులను ఆదివారం రాత్రే ఎస్‌ఐ శామ్యూల్‌రాజీవ్‌కుమార్‌ స్వాధీనంలోకి తీసుకున్నారు. అంతేగాకుండా గుంటూరు నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో బరుల వద్ద మోహరించిన పోలీసులను చూసి నిరుత్సాహంతో వెనుతిరిగారు. 


Updated Date - 2022-01-18T06:21:27+05:30 IST