కొత్తకాంతుల సంకాంత్రి

ABN , First Publish Date - 2021-01-14T05:45:39+05:30 IST

తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల సంబురాల్లో భాగంగా తొలిరోజున బుధవారం భోగి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

కొత్తకాంతుల సంకాంత్రి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భోగి మంటలు వేస్తున్న స్థానికులు

ఆకాశంలో ఉన్న రంగులు వాకిటవాలి సింగిడైన వేళ. ఆడపడుచుల సందడికి ప్రకృతి పులకించిన సమయాన. చిన్నా పెద్ద అంతా సంబురమే. కొత్త అల్లుళ్ల రాక, కోడి పందేల సందడి. డూడూ బసవన్నల సంచారం, హరిదాసుల కీర్తనలతో సరదాల సంక్రాంతి సంబురాలు తెచ్చింది. మూడు రోజుల ముచ్చటైన పండుగను అంతా ఘనంగా జరుపుకుంటున్నారు. బుధవారం తెల్లవారుజామునుంచే మొదలైన భోగి వేడుకలు కన్నుల పండువగా జరగగా, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గోదాదేవి, రంగనాయకుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. నేడు జరిగే సంబురాల సంక్రాంతికి అంతా సిద్ధమయ్యారు. 

యాదాద్రి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి):  తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల సంబురాల్లో భాగంగా తొలిరోజున బుధవారం భోగి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభానికి ముందు రోజు కష్టాలు తొలగిపోయి, అన్నీ శుభాలు సంప్రాప్తించాలని కోరుతూ భోగి మంటలు వేశారు. ఈ మంటల్లో చెడును వదిలించుకోవడానికి పాత సామగ్రిని దహనం చేయడం సంప్రదాయం. ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లో బుధవారం తెల్లవారుజాము నుంచే భోగి వేడుకల సందడి మొదలైంది. ఊరు, వాడల్లో భోగి మంటలు వేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ ఏడాది అన్ని రంగాలను అతలాకుతలం చేసిన కరోనా పీడ వీడాలని కాంక్షించారు. ఇళ్ల ముంగిట రంగురంగుల ముగ్గులు వేసి, ఆవుపేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించారు. మహిళలు ఆకర్షణీయమైన ముగ్గులతో ఇంటి ప్రాంగణాలను తీర్చిదిద్దారు.  


ఘనంగా బోనాలు

మోత్కూరు మునిసిపాలిటీ కేంద్రంలో భోగి పండుగ సందర్భంగా గౌడ కులస్తులు కంఠ్లమహేశ్వరస్వామికి, ముదిరాజ్‌ కులస్తులు పెద్దమ్మతల్లికి బోనాలు వండి డప్పు చప్పుళ్లతో ప్రదర్శనగా తీసుకెళ్లి దేవతలకు నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో గౌడ కుల సంఘం అధ్యక్షుడు బుర్ర యాదయ్య, శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌ గుండగోని రామచంద్రు, సోమయ్య, మొరిగాల రాజయ్య పాల్గొన్నారు. 


కల్యాణం.. కమనీయం 

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం రాత్రి గోదాదేవి, రంగనాథుల కల్యాణమహోత్సవం వైభవంగా సాగింది. విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి అవతారమూర్తి శ్రీరంగనాఽథుడిని పరిణయమాడిన పర్వాలు పాంచారాత్ర ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. తొలుత ఆండాళ్‌ అమ్మవారిని, దివ్యమనోహరంగా అలంకరించి లక్ష్మీనృసింహుడిని శ్రీపాండు రంగనాఽథుడిగా పట్టువస్ర్తాలు, బంగారు, ముత్యాల ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో దివ్యమనోహరంగా అలంకరించిన అర్చక స్వాములు బాలాలయ కల్యాణమండపంలో సేవోత్సవంలో తీర్చిదిద్దారు. గోదారంగనాయకస్వాముల సేవోత్సవాలను వేదమంత్రాల నడుమ బాలాలయంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో అధిష్ఠింపజేసి కల్యాణ వేడుకలను ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. అదే విధంగా ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని వైష్ణవ ఆలయాల్లో బుధవారం గోదాదేవి, రంగనాథస్వామి కల్యాణోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించారు. వలిగొండ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, ఆలేరు రంగనాథస్వామి ఆలయం, సుంకిశాల వేంకటేశ్వర ఆలయం, సూర్యాపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయం, నల్లగొండలోని రామాలయంతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణ వేడకలు వైభవంగా నిర్వహించారు. సూర్యాపేటలో జరిగిన వేడుకల్లో మంత్రి జగదీష్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T05:45:39+05:30 IST