జన జాతర!

ABN , First Publish Date - 2022-01-17T05:05:05+05:30 IST

ఇంటి ముంగిట ఆహ్లాదాన్ని పంచే రంగవల్లులు.. నూతన వస్త్రాలు.. పిండివంటలు.. బంధువుల రాకపోకలు... కొత్త అల్లుళ్లతో అత్తావారింట కళకళలు... ఇలా సంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. వలస కూలీలు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన జిల్లావాసులు ముందుగానే గ్రామాలకు చేరడంతో పట్టణాలు, పల్లెసీమలు కళకళలాడాయి. సంక్రాంతి, కనుమ పర్వదినాలు పురస్కరించుకుని.. డేకురుకొండ ఉత్సవాలు, ఏకశిలాపర్వతం యాత్ర, పద్మనాభుడు, సంగమేశ్వరుల జాతరలు ఘనంగా సాగాయి.

జన జాతర!
సంగమేశ్వరకొండపై భక్తుల సందడి

- సందడిగా సంక్రాంతి

- కన్నులపండువగా ఉత్సవాలు

(పలాస/జి.సిగడాం/జలుమూరు/ఆమదాలవలస/ఆమదాలవలస రూరల్‌, జనవరి 16)

ఇంటి ముంగిట ఆహ్లాదాన్ని పంచే రంగవల్లులు.. నూతన వస్త్రాలు.. పిండివంటలు.. బంధువుల రాకపోకలు... కొత్త అల్లుళ్లతో అత్తావారింట కళకళలు... ఇలా సంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. వలస కూలీలు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన జిల్లావాసులు ముందుగానే గ్రామాలకు చేరడంతో పట్టణాలు, పల్లెసీమలు కళకళలాడాయి. సంక్రాంతి, కనుమ పర్వదినాలు పురస్కరించుకుని.. డేకురుకొండ ఉత్సవాలు, ఏకశిలాపర్వతం యాత్ర,  పద్మనాభుడు, సంగమేశ్వరుల జాతరలు ఘనంగా సాగాయి. పలాసలోని హడ్కోకాలనీ సమీపంలో ఉన్న డేకురుకొండ ఉత్సవం కన్నులపండువగా సాగింది. శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. అక్కడి దేవతామూర్తుల ఆలయాలను దర్శించుకున్నారు. సంక్రాంతి నాడు డేకురుకొండ వద్ద జారుడు ప్రదేశాల్లో నూతన వధూవరులు జారితే పిల్లలు పుడతారని నమ్మకం. ఈ నేపథ్యంలో తర్లాకోట రాజుల కాలం నుంచి ఏటా సంక్రాంతి రోజున డేకురుకొండపై ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాలు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ భక్తులు తరలివచ్చి సంబరాలు చేసుకున్నారు. 


భక్తజనసంద్రం.. ఏకశిలాపర్వతం

జి.సిగడాం మండలం మెట్టవలసలో ఏకశిలాపర్వతం భక్తజన సంద్రంగా మారింది. శనివారం నిర్వహించిన యాత్రకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. మల్లిఖార్జున స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 


పద్మనాభుని కొండపై కిటకిట

జలుమూరు మండలం కరకవలస వద్ద పద్మనాభుని కొండపై ఘనంగా కనుమ జాతర నిర్వహించారు. శ్రీముఖలింగేశ్వర క్షేత్రపాలకుడైన పద్మనాభుడు ఇక్కడి కొండపై కొలువుదీరారు. పాండవులు కూడా ఇక్కడ కొంతకాలం వనవాసం చేశారు. ఏటా కనుమ నాడు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆదివారం జాతర నిర్వహించగా భక్తులు పోటెత్తారు. శ్రీముఖలింగం, కరకవలస, నగిరికటకం, మెట్టపేట పరిసర గ్రామాలతో పాటు హిరమండలం, సారవకోట మండలాలకు చెందిన  భక్తులు తరలివచ్చారు. దీంతో పద్మనాభుని కొండ భక్తులతో కిటకిట లాడింది. 


సంగమేశ్వర జాతరలో సందడి

ఆమదాలవలస మండలం గాజులకొల్లివలసలో సంగమేశ్వర జాతర సందడిగా సాగింది. సంక్రాంతి, కనుమ రోజు భారీగా భక్తులు తరలివచ్చారు.  సోమవారం కూడా జాతర జరగనుంది. స్వచ్ఛందంగా యువత సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలుగుకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.  అలాగే ఆమదాలవలస మండలం తొగరాంలో వల్లభనారాయణ స్వామి, లక్ష్మీనర్సింహా స్వామి ఆలయాల వద్ద కనుమ సందర్భంగా ఆదివారం ఘనంగా జాతర నిర్వహించారు. ఏటా ఇక్కడ సంక్రాంతి నుంచి ముక్కనుమ వరకు జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఆదివారం జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. పూజలు చేశారు. 


కలెక్టరేట్‌ బంగ్లాలో సంబరంగా..

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి : జిల్లాప్రజలు సంక్రాంతి, కనుమ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. కలెక్టరేట్‌ బంగ్లాలో కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌.. కుటుంబ సభ్యులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. డూడూ బసవన్నల సందడి, హరిదాసు కీర్తనలతో బంగ్లాలో హడావుడి నెలకొంది. ఈ ఏడాది మకర సంక్రాంతి తీయని అనుభూతి ఇచ్చిందని ఈ సందర్భంగా కలెక్టర్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-17T05:05:05+05:30 IST