Abn logo
Jan 14 2021 @ 10:03AM

కనుమరుగవుతున్న గంగిరెద్దుల ఆటపాటలు

హైదరాబాద్: సంక్రాంతి పండుగ పూట ఇళ్ల ఎదుట సందడి చేసే గంగిరెద్దులు డూడూ బసవన్నల ఆటపాటల సందడి ఇక కనిపించదా? అంటే అవుననే చెప్పాలి. నెమ్మదిగా వారి ఆటా.. పాటా కనుమరుగవుతోంది. తమ అద్భుత సంస్కృతిక కళానైపుణ్యంతో గ్రామీణులను రంజింపచేస్తూ ప్రతిఫలంగా వారిచ్చేది స్వీకరిస్తూ జీవనం కొనసాగించే గంగిరెద్దుల వారి బతుకులు ఆగమవుతున్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని గంగిరెద్దుల కులస్థులు కోరుతున్నారు. 


తెలుగింటి పండుగలకు గంగిరెద్దులతో విడదీయలేని అనుబంధం ఉంది. సంక్రాంతికి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పేర్చిన.. ఆ ముగ్గుపై ఆడేందుకు గంగిరెద్దు రాకపోతే సంక్రాంతికి కళ ఉండదని భావిస్తారు. గంగిరెద్దులు డూడూ బసవన్నల రూపంలో ఇంటిముందుకొస్తేనే పండుగ మొదలవుతుంది. పీపీలు ఊదుతూ.. పాటలు పాడుతూ గంగిరెద్దుల ఘల్ ఘల్ మనే గజ్జెల చప్పుడు మధ్య బసవన్న తలాడిస్తే తమ ఇంటికి లక్ష్మీ కళ రాబోతోందని ప్రజలు ఆనందపడతారు. హిందూ సమాజంలో సాంస్కృతిక కులాల పాత్ర కీలకమైంది. ఒక వైపు కుల వ్యవస్థ ద్వారా దారుణమైన అణచివేతను, అవమానాలను ఎదుర్కొంటూ.. మరోవైపు సమాజాన్ని తమ కళల ద్వారా సేదతీర్చిన సాంస్కృతిక కులాల్లో ఒకటైన గంగిరెద్దుల కులం పరిస్థితి అత్యంత దీనావస్థలో ఉంది.

Advertisement
Advertisement
Advertisement