మకర సంక్రాంతి ప్రకృతితో ప్రయాణిద్దాం!

ABN , First Publish Date - 2021-01-10T17:41:25+05:30 IST

‘ఆధునికుడు ప్రకృతిని నాశనం చేయడం వల్లే ఈ వైపరీత్యం...’ కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరి నోటా ఇదే మాట వినిపిస్తోంది.

మకర సంక్రాంతి  ప్రకృతితో ప్రయాణిద్దాం!

‘ఆధునికుడు ప్రకృతిని నాశనం చేయడం వల్లే ఈ వైపరీత్యం...’ కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరి నోటా ఇదే మాట వినిపిస్తోంది. కానీ, అందరం కలిసే ప్రకృతికి హాని తలపెడుతున్నాం. ఆ పచ్చటి ప్రకృతితో కలిసి జీవించమని మన పండగలన్నీ ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాయి. సంక్రాంతి సందేశం కూడా అదే ... 


మానవ పరిణామ ప్రస్థానంలో మనిషి జట్టు కట్టింది ప్రకృతితోనే! ఆ ప్రయాణం మనిషికి పాఠాలు చెప్పింది. గుణ పాఠాలు నేర్పింది. ఒడిని చేర్చుకుని ఓదార్చింది. తిండి పెట్టింది. దాహం తీర్చింది. వాతావరణంతో సహజీవనాన్ని మప్పింది. వలపుల  మొలకల కోసం పులకలు వర్షించింది. ఆ కృతజ్ఞతతోనే తొలినాటి మనిషి - ప్రకృతిలో  దైవాన్ని దర్శించాడు.. తొలి వందనాలు సమర్పించుకున్నాడు. స్నేహాన్ని పంచుకున్నాడు... వేడుకలు చేసుకున్నాడు. కాలగమనంలో అవి పర్వదినాలయ్యాయి. దేశ, కాల పరిస్థితుల్ని అనుసరించి భిన్న సంస్కృతులలో భాగాలయ్యాయి. అలాంటి ప్రకృతి మీద పెత్తనం చెలాయించే ప్రయత్నంలో మనిషి ఉపద్రవాలకు తెర తీశాడు. ఓ సునామీనీ, ఓ కరోనానూ పిలిచి, పీట వేశాడు. కళ్ళెర్ర చేస్తూనే ప్రకృతి  కనికరిస్తోంది. మాటి మాటికీ మనిషికో అవకాశం ఇస్తోంది. మానవ నిర్లక్ష్యం వల్ల రైతూ, పొలమూ నానా హింసల పాలైనా తిండి గింజల్ని పంపిస్తోంది. రంగవల్లుల నడుమ గొబ్బి పాటలు వినిపిస్తోంది. భోగి మంటల వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ చిరు గంటలూ, సన్నాయీ కలగలిసిన బసవన్న అడుగుల సవ్వడిని వినమంటోంది...


హేమంతంలో సీమంతం 

ఒకప్పటి మనిషి జీవన శైలిలో ప్రకృతి ఓ భాగంగా ఉండేది. ప్రకృతినీ పండగనూ విడిగా కాకుండా, కలివిడిగా చూసినంత కాలం - మనిషి వాటిని మొక్కుబడి తంతులాగా కాకుండా ప్రేమతో చూశాడు. భక్తితో ఆచరించాడు. ఆ దృక్పథంతో రుతువుల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా విభిన్న దేశాల్లో, ప్రాంతాల్లో, అనేక రకాల పర్వదినాలు రూపుదిద్దుకున్నాయి. అవి సంప్రదాయాలుగా మారి, సంస్కృతుల్లో భాగాలయ్యాయి. పంచభూతాలూ ఆరాధనీయాలుగా మారి, వాటి నేపథ్యంలో ఎన్నో ఉత్సవాలు, పండగలు పంచాంగాలలో చోటుచేసుకున్నాయి. ప్రకృతిని సానుకూల దృష్టితో అధ్యయనం చేస్తున్న కొద్దీ వీటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా సూర్య, చంద్రులతో నక్షత్రాలతో పెనవేసుకున్న పండగలే దీనికి ఉదాహరణలు. అలా సూర్యుడితో ముడిపడిందే మకర సంక్రాంతి! చెప్పాలంటే ప్రకృతిలో ప్రతీ నెలా ఓ సంక్రాంతే! కానీ, హేమంతం బంతిపూలతో సీమంతం జరుపుకునే పుష్యమాసంలోని సంక్రాంతికి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది.


ముఖ్యంగా వింధ్య పర్వతాల దిగువ ప్రాంతాల్లో ఇది పెద్ద పండగ. ఆరు గాలం పడ్డ కష్టానికి ప్రతిఫలాన్ని ప్రసాదించే సందర్భం. మట్టిని నమ్ముకున్న మనుషులు నేలతల్లికి కృతజ్ఞతలు చెప్పుకునే సంబరం! ఇది అనేక రూపాల్లో ప్రకటితమవుతుంది. సస్య లక్ష్మికి స్వాగతాలు పలికే మూడు రోజుల పండగై ప్రతీ గడపలోనూ కొలువుంటుంది. ఇందులో భౌతికమైన శ్రమ ఫలించిన ఆనందంతో పాటు, ఆధ్యాత్మిక నేపథ్యమూ ఉంది. తెలుగు జీవితంలో భాగమైన తెలుగింటి పండగను కళ్ళకు కట్టించే తెలుగు పద్యం ఇదిగో!


సీ.పాడేను జియ్యరు పద్మనాభుని పాట

వేకువ పూబంతి విచ్చుకొనగ,

దిద్దేను విరిబోణి తీరైన ముగ్గులు

కులుకుల ముత్యాలు కొలువుదీర,

ఆడేను బసవన్న పాడిపంటల సీమ

మెడలోన మువ్వలు మిడిసి పడగ,

నింపేను గాదులు నెనరైన చేతులు

రాజనాల సిరులు పూజలంద,

ఆ.వె. చలికి బోగి మంట, జంగమయ్యని గంట

పేద గుడిసె లోన పిండి వంట

పశుల పూజ వేళ పల్లె పరవశింప

మిసిమి జిలుగులాయె పసుపు గడప! 


అందరూ బాగుండాలి..

ఈ తరానికి కథలుగా, కల్పనలుగా అనిపిస్తాయేమో గానీ, ఒకప్పుడు మూడు రోజుల పండగకు ముప్పై రోజుల ముందే సందడి మొదలయ్యేది. కచేరీ ఆరంభానికి ముందు పాడేవారూ, వాయిద్యకారులూ శ్రుతులు చూసుకున్నట్లుగా ధనుర్మాసంలో  ప్రకృతి వేదికను సిద్ధం చేసేది! మంచు దుప్పటి కప్పుకున్న సూరీడు లేవాలా? వద్దా? అని బద్ధకిస్తూ కొండల మాటు నుంచి తొంగి చూసే వేళ - వీధులు తొలి కిరణాల కోసం తొందర చేసేవి. కల్లాపి జల్లిన వాకిళ్లలో, నాజూకైన వేళ్ళ కదలికల మధ్య పిండి ముగ్గులు ఊపిరి పోసుకునేవి. వాటిలో కదలని రథాలు కళ్ళకు విందులు చేసేవి. వాటి నడుమ తంబురా మీటుకుంటూ-

‘శ్రీరంగ రంగ రంగా 

మాయన్న కావేటి రంగ రంగా... 

నవనీత చోరుడమ్మా - ఈబిడ్డ - 

నందగోపాలుడమ్మా -

సితపత్రనేత్రుడమ్మా - ఈబిడ్డ -

శ్రీరామ చంద్రుడమ్మా - 

శిరమున చింతామణీ - నాతండ్రి -

నాలుకను నక్షత్రమూ -

పండ్లను పరుసవేదీ - భుజమున -  

శంఖుచక్రాలు గలవూ’ 

అంటూ గడపకు వచ్చిన హరిదాసు నెత్తి మీద గుమ్మడి పండు లాంటి రాగి చెంబులో అరుణోదయం తన ప్రతిబింబాన్ని చూసుకునేది. అందులో గృహిణి వేసిన బియ్యపు జల్లులు లయబద్ధమైన సవ్వడికి హరిదాసు గళం నుంచి ‘కృష్ణార్పణం’ అంటూ ముక్తాయింపు పలకగానే - 


‘‘పూవు పూవు పూసిందంట .. ఏమీ పువ్వు పూసిందంట

రాజావారి తోటలోన జామ పువ్వూ పూసిందంటా

అవునా...ఓ అక్కల్లారా... చంద్రగిరి భామల్లారా..’’

అంటూ గొబ్బి పాటలు మొదలయ్యేవి. వాటికి తాళం వేస్తూ-

‘అంబ పలుకు జగదంబ పలుకు, 

కంచి లోని కామాక్షి పలుకు’ 

అంటూ రంగుల తలపాగాలతో బుడబుక్కల వారూ, శంఖా నాదాలతో జంగమ దేవరాలూ, డోలు, సన్నాయిలతో గంగిరెద్దుల ఆటగాళ్ళూ గడపలకు విచ్చేసేవారు. విత్తు నాటింది మొదలు పంట చేతికి వచ్చేవరకు పరిశ్రమించిన రైతులు తమ గాదేలలోని ధాన్యాల్ని జానపద కళాకారులకు పంచి ఇచ్చి, సమాజంలో అన్ని వర్గాల వారూ ఆనందంగా జీవించాలనే విశాల దృక్పథాన్ని ఆచరణలో చేసి చూపించేవారు.


ఇంటింటా సందడి.. 

మరోవైపు రానున్న మూన్నాళ్ళ పండగలో పందెం కోసం కోడిపుంజులూ, పూజలందుకోడానికి బసవన్నలూ సిద్ధమవుతుంటే - కంపా, కర్రా పోగుచేసి, భగ్గున వెలిగే భోగి మంటల కోసం గోడ మీద భోగి పిడకలు తడి ఆరబోసుకునేవి. గొబ్బెమ్మల కోసం ముద్దబంతులు విచ్చుకుంటే, పసివాళ్ళకు దిష్టి తీయడం కోసం చెరుకు  ముక్కలూ, రేగు పళ్ళూ, చిల్లర పైసలూ సిద్ధమయ్యేవి. అత్తవారింట్లో పెట్టు పోతలకు రాబోయే కొత్త అల్లుళ్ళ కోసం ఒకవైపు గృహిణులు చిరుతిళ్ళ తయారీల కోసం పొయ్యికి అంకితమైపోతే, బావల్ని అల్లరి చేయడానికీ, ఆట పట్టించడానికీ మరుదులూ, మరదళ్ళూ పథకాలు వేసుకునేవారు. బట్టల మూటలను సైకిళ్ళ మీద పెట్టుకుని, గాజుల మలారాలను కావిళ్ళకు తగిలించుకుని, పెద్దగా అరుస్తూ వచ్చే విక్రేతలతో   వీధులు సందడి చేసేవి. వెల్ల వేసిన గోడలూ, పసుపులూ, చుక్కలతో గడపలూ ఊళ్ళో సానుకూలమైన పండగ వాతావరణాన్ని సృష్టించేవి. సంక్రాంతి గొబ్బి పాటల్లో గాజుల వర్తకుడు కంచికి వెళ్లి కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న ముచ్చట్లూ, బాల కృష్ణుడి లీలలూ విశేషంగా ఉంటాయి. బతుకమ్మ పాటల్లాగే జానపద గీతాల్లో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. ‘కొలను దోపిరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికి గొబ్బిళ్ళో’ అంటూ పదకవితా పితామహుడు అన్నమయ్య సైతం ధనుర్మాస వాతావరణాన్ని ఆవిష్కరించాడు.


వీధుల్లో సందడి ఇలా ఉంటే - ఊళ్ళోని వైష్ణవాలయాలలో తెల్లవారగట్లే  గోదాదేవి అమ్మవారి ధనుర్మాసం పాశురాలతో పాటు దద్ద్యోజనం, పులిహోర, చక్రపొంగలి గుబాళించేవి. తెలుగు భాషకి వన్నె తెచ్చిన ‘పాడి-పంట’ జంటపదాల్ని కళ్ళకు అడ్డుకునే పర్వదినం సంక్రాంతి. భోగి నాడు చెత్తా చెదారాన్ని తగలబెట్టిన తర్వతా మకర సంక్రాంతి నాడు కొత్త బియ్యంతో పొంగలి నైవేద్యాన్ని చేసి దేవుడికి నివేదించడం, గతించిన పెద్దలని తలచుకుని దాన ధర్మాలు చేయడం పంటల పరమైనవి కాగా, మూడో దినం కనుమ-పాడినీ, పంటనూ అందించడంలో మౌనంగా సేవలనందించే గోగణాలకు కృతజ్ఞతలు వెల్లడించే సందర్భం. దీన్ని దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గారు- ‘పాలిచ్చే గోవులకూ పసుపూ - కుంకం, పనిచేసే బసవడికీ పత్రీ-పుష్పం’ అని పశుసంపదకు పట్టం కట్టడంతో పాటు - వాటి నుంచి సత్ఫలితాలు రాబట్టేందుకు ‘కష్టించే కాపులకు కలకాలం సౌఖ్యం’ అంటూ ‘గాదుల్లో ధాన్యం - కావిళ్ళ భాగ్యం’ సిద్ధించాలని శ్రమ సంస్కృతికి శుభం పలికారు. శ్రమానంతర సుఖం గొప్పదన్నారు. పంట చేతికి అందిన తర్వాత పెద్ద పండగలో పొందే ఆనందం కూడా అలాంటిదే మరి. తుమ్మల సీతారామమూర్తి గారి ఈ పద్యం చూస్తే సంక్రాంతి పండగ మూడు రోజులూ తెలుగింటి భోజనంలోని తృప్తీ, ఆనందం ఎలా ఉంటాయో తెలిసొస్తుంది.


సీ. లేగటి పాలలో గ్రాగి మాగిన తీయ

తీయ కప్పురభోగిపాయసంబు

చవులూరు కరివేప చివురాకుతో గమ

గమలాడు పైరవంకాయ కూర

తరుణ కుస్తుంబరీ దళమైత్రిమై నాల్క

త్రుప్పు డుల్చెడు నక్కదోస బజ్జి

క్రొత్తబెల్లపు తోడికోడలై మరిగిన

మదురు గుమ్మడిపండు ముదురుపులుసు

ఆ.వె. జిడ్డుదేఱిన వెన్నెల గడ్డపెరుగు

గరగరిక జాటు ముంగారు జెఱుకురసము

సంతరించితి విందుభోజనము సేయ

రండు రండని పిలిచె సంక్రమణలక్ష్మి


గంగిరెద్దులు

ప్రకృతితో ప్రయాణం సాగించిన మనిషి... పశువులను, జంతువులను మచ్చిక చేసుకుని... వ్యవసాయం మొదలెట్టి... నాగరికతకు పాదులు తీశాడు. ‘పెటా’ లాంటి అంతర్జాతీయ జంతు పరిరక్షణ సంస్థలు ఇప్పుడు మాట్లాడుతున్నాయి కానీ... భారతీయ పండగలు, సంస్కృతిలో జంతు ఆరాధన ఎప్పటి నుంచో ఉంది. సంక్రాంతికి పశువులను పూజించడంలో భాగంగానే గంగిరెద్దులను కొలుస్తారు. ఆటపాటలతో ఆనందిస్తారు. పండగ పాఠంతో జంతువుల్ని  సంరక్షిద్దాం. 


పండగలో ఆధ్యాత్మికత   

సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ పుణ్యకాలం ఆధ్యాత్మిక సాధనకు మేలైన సమయంగా భావిస్తారు. ఈ శుభఘడియల కోసమే భీష్ముడు అంపశయ్య మీద నిరీక్షించాడు. విశ్వానికి మేలు చేసే విష్ణు సహస్రానామాల్ని అందించాడు. పోతనగారి భాగవతం ప్రథమ స్కంధంలో ‘కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి..’, ‘ఒక సూర్యుండు సమస్త జీవులకు..’ వంటి ‘భీష్మస్తుతి’ పద్యాల్ని ధార్మికులూ, తెలుగు పద్యప్రియులూ, సాహిత్యాభిమానులూ ఎంతగానో గౌరవిస్తారు. ఉత్తరాయణంలో వచ్చే  మాఘమాసానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. వివాహాది శుభాకార్యాలకు అనువైన ఈ నెలలో సూర్యారాధన ప్రముఖమైంది. ‘రథ సప్తమి’, ‘భీష్మ ఏకాదశి’లాంటి పర్వదినాలకు విశేష ప్రాముఖ్యం ఉంది.  


నవశకానికి నాంది గీతిక 

రమణి వేసిన రంగ వల్లిక 

తుహినకణముల తెరను చీల్చుక 

తొంగి చూసేను అరుణ దీపిక 

స్వేద జలమును ధారవోసిన 

హాలికుని సంతోష సూచిక 

కాంతులీనే దాన్యరాశుల

కనిన ఆనందాశ్రుమాలిక

రేయి కురిసిన మంచుబిందుల

జలకమాడిన ముద్దబంతులు 

ఇంతి కురులను చిక్కినంతనె

విచ్చుకున్నవి కన్నులింతలు 

అంటూ హేమంతం తోడ్కొని వచ్చిన దృశ్యాల్ని భావుకతతో దర్శిస్తూ, వాటి నేపథ్యంలో పండగ చేసుకుంటూ ప్రకృతిని ప్రేమతో గౌరవిస్తూ, భయంతోనో, భక్తితోనో పరోక్షంగా ప్రాకృతిక సమతౌల్యాన్ని పరిరక్షిస్తూ మానవ ప్రస్థానం సాగినప్పటి కథ వేరు! మనిషి అధ్యయన ఫలాల్ని పెడతోవలో వినియోగిస్తూ, ప్రకృతికి ఎడంగా వెళ్ళినప్పటి నుంచే తగువు మొదలయింది. దారులు వేరయ్యాయి. పట్టు సాధించాలని  మనిషి సాగించిన ధ్వంసానికి ప్రకృతి విధ్వంసం బాటపట్టిందనే చెప్పాలి. అందుకే ప్రకృతితో చేతులు కలిపి, దాని నుంచి పొందిన మేలును గుర్తుంచుకునేలా పండగలు చేసుకుందాం. సునామీల్నీ, కరోనాల్నీ దూరంగా పొమ్మందాం!. ప్రకృతిని ప్రేమించి, సంరక్షించినప్పుడే మానవ మనుగడకు ఢోకా ఉండదు. 

- ఓలేటి శ్రీనివాసభాను, 70324 80233.


గాలిపటం

నేటి కరోనా కాలంలో కలలు, ఆశలు ఆవిరయ్యాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాం. గాలిపటం... ఒక సానుకూల దృక్పథానికి సంకేతం. గత ఏడాది మహమ్మారి వల్ల మనమంతా ఎంతోకొంత మానసిక కుంగుబాటుకు గురయ్యాం. వాక్సిన్‌ రాకతో తేరుకున్నాం. ముందున్నది మంచికాలమే! ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ఆగిపోకుండా ... రేపటి ఆశ కోసం ఎదురుచూద్దాం... గాలిపటంలా స్వేచ్ఛగా జీవిద్దాం.  గాలిపటాన్ని ఆకాశంలోకి వదిలినప్పుడు... ఆశల రెక్కలతో విహరిస్తున్నంత ఆనందం కలుగుతుంది.


భోగిమంట

చెడును తొలగించుకోవాలంటే అప్పుడప్పుడు మనసును శుభ్రం చేసుకోవాలి. కొత్తను స్వాగతించాలంటే పాతను వదిలించుకోవాలి. ఇంట్లో మూలన పడిన పాత వస్తువుల్లా మారితే మనసు ఉత్సాహం కోల్పోతుంది. జడ పదార్థంలా తయారవుతాం. మానసిక, శారీరక అనారోగ్యం ఆవహిస్తుంది. జీవితంలో మార్పు ఉండదు. ఇంట్లోని పాత వస్తువులతో వేసే భోగి మంట... మనలోని ఆ చెడును, అహాన్ని, పాతను తొలగించుకోమంటుంది. అప్పుడే నిత్యకొత్తదనంతో కళకళలాడతాం. 


హరిదాసు

సంక్రాంతి పండగప్పుడు మాత్రమే కనిపించే హరిదాసు...మనకెన్నో జీవనపాఠాలు చెబుతాడు. ఆయన కీర్తనల్లోని ఆధ్యాత్మికత సమాజ శ్రేయస్సును ఆకాంక్షిస్తుంది. మనలోని దానగుణాన్ని పెంపొందిస్తుంది. సంక్రాంతికి గంగిరెద్దుల వాళ్లు, హరిదాసు వంటి వాళ్లతో ఊరికి పండగ కళ వస్తుంది. ఇతరులకు సాయం చేసే మనస్తత్వాన్ని కొత్తతరం పిల్లలకూ అలవడేలా చేస్తుంది. భూలోకంలోని సుఖాలలో పడిపోయి... ఆధ్యాత్మికతను మరిచిపోవద్దు అని చెప్పే హరిదాసు కీర్తనలు కొన్ని వందల ఏళ్ల నుంచీ మనల్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి.


ముగ్గులు

 సృజనాత్మక ఆవిష్కరణల కాలం ఇది. మిగిలిన వాళ్లకంటే ఎంత కొత్తగా ఆలోచిస్తున్నావు అనేదే... మన ప్రత్యేకతను నిలుపుతుంది. అందుకే సృజనాత్మకత ముఖ్యం. ఇంటి ముందు కళ్లాపిచల్లి... ముగ్గులు వేయడం, రంగులు అద్దడం, గొబ్బెమ్మలపై గుమ్మడిపూలు తురమడం... ఇవన్నీ సంస్కృతిని కొనసాగించే సృజనాత్మక సంప్రదాయాలు. మన జీవితం కూడా వర్ణరంజితం కావాలంటే... క్రియేటివ్‌ ఆలోచనల దిశగా అడుగులు వేయాలి. పోటీ ప్రపంచంలో తప్పదు.


పిండివంటలు

కరోనా మహమ్మారి వ్యాపించాక... అందరిలో ఆరోగ్య చైతన్యం వచ్చింది. మారుతున్న రుతువులను బట్టి మన భారతీయ ఆహారాన్ని నిర్ధారించారు మన పెద్దలు. ముఖ్యంగా పండుగలు వచ్చినప్పుడు సీజనల్‌ఫుడ్‌ను ప్రత్యేకంగా వండుకుని తినడం సంప్రదాయంగా వస్తోంది. సంక్రాంతికి చేసే పిండివంటలు అలాంటివే!. ఇలా ఇంటి వంటల్లోని ప్రాముఖ్యతను తెలుసుకున్నప్పుడే మంచి తిండి తినగలుగుతాం.

Updated Date - 2021-01-10T17:41:25+05:30 IST