Abn logo
Jan 14 2021 @ 01:14AM

సంక్రాంతి కానుక ఏదీ?

ఫిట్‌మెంట్‌పై స్పష్టత వస్తుందనుకున్నాం
సుదీర్ఘకాలం నిరీక్షించాం.. పండుగకు ఇస్తారనుకున్నాం
పీఆర్సీ నివేదిక ఇచ్చి 13 రోజులైనా బహిర్గతపరచరా!
ఎప్పుడైనా ఇచ్చేదే.. ప్రకటించడంలో జాప్యమెందుకు?
త్రిసభ్య కమిటీతో భేటీ కల్లే... కమిటీ వేయడమే వృథా
సర్కారు తీరుపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల మండిపాటు

హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ వేళ.. వేతనాలు పెరిగి ఇంటిల్లిపాదీ సంతోషంగా ఉంటామనుకుంటే.. ప్రభుత్వం తమ ఆశలపై నీళ్లు చల్లిందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉసూరుమంటున్నారు. ఎంతో కొంత ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తుందని ఆశ పడ్డామని, కానీ.. ఫిట్‌మెంట్‌, పీఆర్సీ ఏదీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడిస్తుందో, ఎంత ఇస్తుందో తెలియడంలేదని, అసలు ఇస్తుందో లేదో కూడా స్పష్టత లేదని మండిపడుతున్నారు. 11వ వేతన సవరణ సంఘం తమ నివేదికను డిసెంబరు 31నే ప్రభుత్వానికి సమర్పించడంతో సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ప్రకటన వస్తుందన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.అయితే ప్రభుత్వం ఐఏఎ్‌సలతో త్రిసభ్య కమిటీని వేసి.. ఉద్యోగ సంఘాలతో ఆ కమిటీ ఈ నెల 6, 7 తేదీల్లో సమావేశమవుతుందని ప్రకటించింది. కానీ, ఇప్పటివరకూ అటువంటి సమావేశమేదీ జరగకపోగా, పీఆర్సీ నివేదికనూ తెరవలేదు. నివేదికపై అధ్యయనం చేసేందుకు కాపీని ఇవ్వాల్సిందిగా సంఘాలు కోరినా ఇవ్వడంలేదు. ముఖ్యమంత్రి సమక్షంలోనే నివేదికను తెరుస్తామని ప్రకటించింది. కానీ, పీఆర్సీ నివేదిక ఇచ్చి 13 రోజులవుతున్నా.. చడీ చప్పుడు లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కమిటీతో ఒరిగేదేమీ లేదు..
‘‘త్రిసభ్య కమిటీ సమావేశం కాదుగదా.. ఉద్యోగులను కమిటీ ఛాయలకు కూడా రానివ్వలేదు. అసలు ఆ కమిటీతో ఒరిగేదేమైనా ఉందా?’’ అని ఓ ఉపాధ్యాయ సంఘం నేత మండిపడ్డారు. అదో వృథా కమిటీ అని తేల్చేశారు. కాగా, ఉద్యోగులను పస్తులుంచి ప్రభుత్వం ఏం సాధిస్తుందని నాలుగో తరగతి ఉద్యోగి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. పదోన్నతుల విషయంలో ప్రభుత్వం చేస్తున్న హడావుడితో పీఆర్సీ అంశం కూడా తేలిపోతుందని ఆశించామని కానీ, ఇప్పుడు ఫిట్‌మెంట్‌ ఇస్తారో లేదోనన్న సందిగ్ధతను ఎదుర్కొంటున్నామని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. నిజానికి ఈ నెల 20 తర్వాత ఫిట్‌మెంట్‌ను ప్రకటించే అవకాశాలున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఇదివరకే వెల్లడించింది.

దానికి ముందు పీఆర్సీ నివేదికను ఓపెన్‌ చేసి, ఉద్యోగ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించాలని త్రిసభ్య కమిటీని ఆదేశించింది. ఆ సమావేశం జరిగినా, నివేదిక కాపీ ఇచ్చినా.. ఫిట్‌మెంట్‌పై కొంత స్పష్టత వచ్చేదని సంఘాల నేతలు చెబుతున్నారు. పీఆర్సీ సిఫారసు చేసిన ఫిట్‌మెంట్‌ తమకు నచ్చకపోతే.. ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మరింత పెంచాలని కోరేవారమని అంటున్నారు. ‘‘13 రోజులైనా నివేదికను బహిర్గతం చేయరా? ఎప్పటికైనా తెరిచేదే కదా ? అందులో రహస్యం ఏమైనా ఉందా?’’ అంటూ ఆగ్రహించాడో గెజిటెడ్‌ అధికారుల సంఘం నేత. పైగా నివేదికపై చర్చించాలంటూ కమిటీలను వేసిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవని అన్నారు.   

ఇంత జాప్యం ఎప్పుడూ లేదు
గతంలో పీఆర్సీ ఫిట్‌మెంట్‌లను సాధ్యమైనంత త్వరగా ప్రకటించేవారని, కానీ.. ఈసారి ఏకంగా 30 నెలలు గడిచిపోయినా ప్రకటించడం లేదని ఉద్యోగులు తప్పుబడుతున్నారు. 2018 జూలై 1 నుంచే పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తే తమకు ప్రయోజనకరంగా ఉండేదని, అప్పటి నుంచి వేతనాలు పెరగకపోవడంతో తమకు రావాల్సిన పెంపు వ్యత్యాసపు సొమ్ము రాకుండాపోయిందని చెప్పారు. కనీసం వీటి బకాయిలు ఇస్తారో లేదో తెలియడం లేదన్నారు. కొత్త పీఆర్సీ వేతనాలు ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వస్తాయన్న ప్రచారం జరుగుతోందని, అదే జరిగితే తాము 30 నెలల పెంపు వ్యత్యాసాన్ని కోల్పోయినట్లేనని ఉపాధ్యాయ సంఘం నేత ఒకరు అన్నారు.

పీఆర్సీ ఆలస్యమయ్యే అవకాశాలుంటే ఏ ప్రభుత్వమైనా మధ్యంతర భృతి(ఐఆర్‌)ని ప్రకటిస్తుందని, కానీ... ఈసారి ఐఆర్‌ను కూడా ప్రకటించలేదని గుర్తు చేస్తున్నారు. కాగా, ఫిట్‌మెంట్‌ ఇస్తుందో లేదో ప్రభుత్వం ధైర్యంగా ప్రకటించాలని టీపీఆర్‌టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అన్ని సంఘాలను పిలిచి ఫిట్‌మెంట్‌ను ఫైనల్‌ చేయాలన్నారు. త్వరలో కార్పొరేషన్లు, ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక జరిగే అవకాశమున్నందున.. కోడ్‌ రాకముందే ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సీహెచ్‌ సంపత్‌కుమారస్వామి అన్నారు.

Advertisement
Advertisement
Advertisement