పల్లె వాతావరణానికి ఏమాత్రం తీసి పోకుండా భాగ్యనగరంలో సంక్రాంతి..!

ABN , First Publish Date - 2022-01-15T13:22:56+05:30 IST

సంక్రాంతి సంబరాలకు చాలామంది పల్లెలకు వెళ్లిపోయారు. గొబ్బెమ్మలు, కోడిపందాలు, చెరకు గడలు..

పల్లె వాతావరణానికి ఏమాత్రం తీసి పోకుండా భాగ్యనగరంలో సంక్రాంతి..!

  • ఎక్కడ బాగుంటుందంటే..


హైదరాబాద్‌ సిటీ : సంక్రాంతి సంబరాలకు చాలామంది పల్లెలకు వెళ్లిపోయారు. గొబ్బెమ్మలు, కోడిపందాలు, చెరకు గడలు.. సందడంతా ఊళ్లలోనే. స్వగ్రామాలకు వెళ్లలేని వారు పండగ స్ఫూర్తిని ఇక్కడ కూడా ఆస్వాదించవచ్చునని అంటున్నారు ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ప్రతినిధి నాయుడు. కొవిడ్‌ విజృంభణ వేళ కాస్త జాగ్రత్త తీసుకుంటేనే అది సాధ్యమవుతుందని అన్నారు. ఏవేవో కారణాలతో ఊళ్లకు వెళ్లలేని వారు సంక్రాంతి రోజున నగరంలో ఏం చేయవచ్చంటే..


అచ్చతెలుగు వాతావరణం కోసం..

సంక్రాంతి స్ఫూర్తి మిస్‌ అవుతున్నామేమో అని మధన పడేవారు శిల్పారామం చేరిపోవచ్చు. గంగిరెద్దులు, హరిదాసులు, భోగిపళ్ల సంబరాలు.. సమస్త గ్రామీణ వాతావరణం.. సంప్రదాయ వైభవాన్ని కళ్లముందుంచే ప్ర యత్నం చేస్తున్నారక్కడ. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు రుచి చూపిస్తూనే, పండగ వైభవాన్నీ ఆస్వాదించవచ్చు.


రుచులను ఆస్వాదించాలి.. 

పండగలు వస్తే అరిసెలు మొదలు మురుకులు, కజ్జికాయలు, గవ్వలు.. లిస్ట్‌ వెళ్తూనే ఉంటుంది. నగర వాతావరణంలో పిండి వంటలు ఇంట్లో తయారుచేసుకునే వీలు గతంలో ఉండేది కాదు కానీ.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఈసారి ఆ బెంగ లేదు. కాబట్టి ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు హోమ్లీ ఫుడ్‌ను మించిన ఆనందం ఏముంటుంది. అరిసెలు లాంటి వాటి తయారీకి అందరూ ఓ చెయ్యేస్తే ఆ టేస్టే వేరప్పా..!!


కైట్‌ ఫెస్టివల్‌ లేదు కానీ..

గతంలో పర్యాటక శాఖ భారీ స్థాయిలో కైట్‌ ఫెస్టివల్‌ నిర్వహించేది. కొవిడ్‌ రాకతో ఈసారి కూడా రద్దు చేశారు. గాలి పటాలను ఎగరేయడంతో ఆనందం పొందాలనుకునే వారు నెక్లెస్‌ రోడ్‌, కాలనీ కమ్యూనిటీ హాల్స్‌ దగ్గరకు చేరిపోవచ్చు. 


ఇదో మార్గం..

కరోనా విజృంభణ వేళ ఖర్చులెందుకు అనుకుంటే జూమ్‌లో బంధువులతో మీటింగ్‌ పెట్టేయడం ఓ మార్గం. సుదూరాన ఉన్నా.. దగ్గరగా ఉన్న అనుభూతులను పొందే మార్గాలలో ఇది ఒకటి. ఆన్‌లైన్‌లోనే వారితో కలిసి గేమ్స్‌నూ ఆడొచ్చు.


రంగుల హరివిల్లులు, గొబ్బెమ్మలు.. రేగు పళ్లు, భోగి మంటలు.. డూడు బసవన్నల ప్రదర్శనలు.. బొమ్మల కొలువులు.. పతంగుల విహారంతో శుక్రవారం మహానగరంలో సంక్రాంతి పండుగ వేడుకగా జరిగింది. భోగభాగ్యాలు ప్రసాదించమంటూ ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీ హాళ్లలో భోగి మంటలు.. యువతుల ఆటపాటలతో ఆహ్లాద వాతావరణం నెలకొంది. పట్నం పల్లెకు తరలడంతో రణగొణ ధ్వనులతో బిజీగా ఉండే నగర రహదారులు బోసిపోయాయి.


పల్లె వాతావరణం తీసిపోకుండా..

పల్లె వాతావరణానికి ఏ మాత్రం తీసి పోకుండా నగరం ముస్తాబవుతోంది. ముఖ్యంగా బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, శ్రీనగర్‌కాలనీ, మాదాపూర్‌ ప్రాంతాల్లో సంక్రాంతి సందర్భంగా అనేక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. ఫిలింనగర్‌ బస్తీలతో పాటు బంజారాహిల్స్‌లోని కొన్నిప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు వారం రోజుల పాటు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాయి. బస్తీల్లో  గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల ఆటపాటలు ఏర్పాటు చేస్తున్నారు. వంటల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12లో అపార్ట్‌మెంట్‌  నివాసుతులంతా కలిసి పతంగుల పండుగను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సాయంత్రం వేళ ఈ సందడి చూసేందుకు చాలా మంది అక్కడకు చేరుకుంటారు. 


ఆ బస్తీల్లో..

ఫిలింనగర్‌లోని 18 బస్తీల్లో సంక్రాంతి రోజున హరిదాసులు, గంగిరెద్దుల సందడి జోరందుకుంటుంది. బంజారాహిల్స్‌ ఎన్‌బీటీనగర్‌, నందినగర్‌, ఉదయ్‌నగర్‌లో కూడా పల్లె వాతావరణం కనిపిస్తుంది. సంబరాల్లో మునిగి కరోనా జాగ్రత్తలను మరవకపోవడం ఉత్తమం.

Updated Date - 2022-01-15T13:22:56+05:30 IST