Advertisement
Advertisement
Abn logo
Advertisement

సంక్రాంతి స్ఫూర్తి

తెలుగువాళ్ళ పెద్ద పండుగ సంక్రాంతి. ఇది రైతుల పండుగ, ముగ్గుల పండుగ, ముచ్చట్ల పండుగ. ధనుర్మాసం ఆరంభంతోనే తెలుగులోగిళ్ళలో ముగ్గులు మెరుస్తాయి. రంగురంగుల రంగవల్లులూ మధ్యన గొబ్బిళ్ళు, కళకళలాడుతున్న ముంగిళ్ళతో ఊరూవాడా సంక్రాంతి పురుషుడిగా ఏతెంచే కాలపురుషుడిని స్వాగతిస్తున్నట్టు తీర్చిదిద్దుకుంటాయి. ఆధ్యాత్మికాంశాలతో పాటు, కుటుంబ అనుబంధాలకూ, సమాజవిలువలకూ పెద్దపీటవేసే ప్రశస్తమైన పండుగ ఇది. ఆత్మీయతలను పెంచి, బంధాలను కలిపే పర్వమిది. కర్షకులనుంచి కవుల వరకూ అందరినీ ఆనందింపచేసే, పరమాత్మతో పాటు ప్రకృతినీ ఆరాధించమనే సంప్రదాయ సంరంభమిది. 


సూర్యుడి మకరరాశి ప్రవేశంతో మకర సంక్రమణం, ఆరుమాసాల ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అవుతుంది. ఆధ్యాత్మిక ప్రాధాన్యం రీత్యా పూర్వీకులకు తర్పణాలతో కృతజ్ఞతలు అర్పించవచ్చు, స్థితిమంతులు పేదలకు ఈ రోజే కాదు, ఉత్తరాయణ పుణ్యకాలమంతా దానధర్మాలు చేసి పుణ్యం కూడగట్టుకోవచ్చు. విశ్వంలో పరిణామాల వల్ల తమ జీవితాల్లో సానుకూల మార్పులు సిద్ధిస్తాయని విశ్వసించేవారికి ఒక కొత్త ప్రయాణాన్ని ఆరంభించగలిగే శుభదినం.


ఉత్తరాయణం ఆరంభానికి ముందు వచ్చే వైకుంఠ ఏకాదశి అప్పటివరకూ చలిలో వొణుకుతున్న దేహాన్ని తట్టిలేపి కోవెలలవైపు పరుగులు తీయిస్తుంది. పంట చేతికంది, ధాన్యరాశులు ఇళ్ళకు చేరిన వేళ జరుపుకొనే కృషీవలుర కడుపునిండే పండుగ ఇది. పగటి సమయం తక్కువగా, రాత్రివేళలు ఎక్కువగా ఉంటూ హేమంతపు చలి గడగడా వొణికిస్తుంటే, చలిమంటలతో దానికి విరుగుడుమంత్రం వేసేందుకు జనం భోగినాడు వీధుల్లోకి వస్తారు. చలికివీడ్కోలు చెప్పి, ఇకపై సూర్యుడి తేజస్సులోనూ, కాలంలోనూ రాబోయే వృద్ధిని స్వాగతించే రోజు ఇది. వీధివీధినా ఉవ్వెత్తున్న లేచే ఆ మంటల చుట్టూ ఊరంతా చేరి చలికాచుకోవడం ఓ చూడముచ్చటైన దృశ్యం.


ఆ మంటలు  చలిని మాత్రమే కాదు, మనలోని అన్ని  అవలక్షణాలనూ దగ్ధం చేయాలన్న సందేశం ఈ ఘట్టంలో ఉన్నదట. ఇంట్లో ఎంతోకాలంగా పోగుబడి, పురుగూపుట్రా పెరిగేందుకు ఉపకరించే పాతవస్తువులతో పాటు మనలోని అజ్ఞానాన్ని, రాగద్వేషాలను కూడా ఇక్కడ దగ్ధంతో చేయాలట. భోగినాడు పిల్లలకు పోసే భోగిపళ్ళలో ఉపయోగించే వివిధద్రవ్యాలు, ఆ ప్రక్రియ దిష్టిని తొలగించడంతోపాటు, సద్బుద్ధినీ, ఉచ్ఛస్థితినీ ప్రసాదిస్తాయని నమ్మకం. కృష్ణుడే సర్వస్వమని సంపూర్ణంగా నమ్మి, ఇంతటిచలిలోనూ ధనుర్మాసవ్రతంతో ఆయనను అలరించిన గోదాదేవి ఎట్టకేలకు ఆయనను చేరువైన రోజు ఇది.


కుటుంబీకులే కాదు, బంధుజనంతో కలసి సంతోషంగా జరుపుకొనే సంబురాల పండుగ సంక్రాంతి. ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళూ తమ సొంతూళ్ళకు వెళ్ళి ఒక చోట చేరి వేడుకచేసుకొనేంత సావకాశం దీనిలో ఉంది. ఎంతోకాలంగా విడివడిన పెద్దలూ పిన్నలూ ఆప్యాయతలను పంచుకుంటారు. ఇక, కోడిపందేలమీద ఎన్ని ఆంక్షలు ఉన్నా, కాళ్ళకు కత్తులు కట్టవలసిందే, కుత్తుకలు తెగవలసిందే. వాటి వీరవిహారాన్ని ప్రభుత్వాలు ఎలా అడ్డలేవో, పేకాట రాయుళ్ళ అత్యుత్సాహాన్ని కూడా ఎవరూ నిలువరించని రోజులివి. సంక్రాంతి లక్ష్మి సిరులతో పాటు, అల్లుళ్ళను కూడా వెంటబెట్టుకొస్తుంది. కొత్తజంటల కులుకులను ఆనందించాలి, అల్లుళ్ళ అలకలను తీర్చాలి. అందుబాటులో ధనధాన్యరాశులు, సరసాలకూ, సరదాలకూ విహారాలకు, పరవశాలకూ తోడ్పాటునిచ్చే ఆహ్లాదభరితమైన కాలం ఇది.


సంక్రాంతి మరుసటిరోజు వచ్చే కనుమనాడు గోవులనూ, వ్యవసాయంలో తనకు చేదోడువాదోడుగా ఉంటూ ధాన్యరాశులను తనకు అందించిన పశువులనూ పూజించి, గౌరవిస్తాడు రైతన్న. వాటిని అలంకరించి, కొమ్ములను తీర్చిదిద్ది, కడుపునిండా తిండి పెట్టి, విశ్రాంతినిస్తాడు. కవులనూ కుదిపేసి, కలాన్ని కదిపేట్టు చేయగలిగే శక్తి ఈ మూడురోజుల పండుగది. ప్రాచీన కవులనుంచి ఆధునిక కవులవరకూ అందరూ ఈ శోభను అద్భుతంగా వర్ణించినవారే. రంగవల్లుల అందాలనుంచి కొత్త జంటల సరసాల వరకూ కవనానికి అనర్హమైనవేమీ లేవంటారు కవులు. 


ఈ ఆధునిక కాలంలో పండుగ తన అసలు స్వరూపంలో ఇంకా ఎక్కడ మిగిలివుందని నిట్టూర్చవచ్చును. అంతా ఆన్ లైన్, అన్నీ ప్లాస్టిక్  అయిపోయాయని బాధపడవచ్చు. పిండిముగ్గుపోయి సింథటిక్ రంగులు వచ్చినందుకూ, పేడ రంగు నీళ్ళతో కళ్ళాపి చల్లుకుంటున్నందుకూ వేదనపడవచ్చు. కాలానుగుణంగా ఎన్నిమార్పులు వచ్చినా, ఎంత రాజీపడవలసివచ్చినా, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పండుగ స్ఫూర్తిని  పరిరక్షించుకోవడం, సంప్రదాయాలను నిలబెట్టుకోవడం ముఖ్యం.

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...