సంక్రాంతి సంబరాలు

ABN , First Publish Date - 2022-01-17T05:22:24+05:30 IST

నగరంలోని వివిధ ఆలయాల్లో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

సంక్రాంతి సంబరాలు
కె.మార్కాపురంలో బహుమతులను ప్రదానం చేస్తున్న గౌరు చరిత

కర్నూలు (కల్చరల్‌), జనవరి 16: నగరంలోని వివిధ ఆలయాల్లో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పాతబస్టాండు  సమీపంలోని దక్షిణ షిరిడీ సాయిబాబా దేవస్థానంలో సంక్రాంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. మకర సంక్రాంతి పర్వదినం రోజున బాబా విగ్రహానికి భక్తులు స్వహస్తాలతో పవిత్ర  గోదావరి జలాలతో మంగళస్నానం చేసే అవకాశం కల్పించారు. ఉదయం 9 గంటలకు గాలిపటాల పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. సాయంత్రం గంగిరెద్దుల ప్రదర్శన, రాత్రి మహిళలతో కోలాటాలు, జానపద నృత్య ప్రదర్శనలు, భోగి మంటలు వేయడం, పిల్లలకు రేగుపండ్లు పోయడం వంటి కార్యక్రమాల్లో వందలాది భక్తులు పాల్గొన్నారు. సాయిబాబా భక్త మండలి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. భక్తమండలి అధ్యక్షుడు ఆర్‌ రామ్మోహన్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌జీ మహాబలేష్‌, సభ్యులు కృష్ణ, అచ్చికుమార్‌, సతీష్‌, రాజు, శ్రీనివాసులు తదితరులు సహకారం అందించారు.


 నగర శివారు, కల్లూరులోని అవదూతరామిరెడ్డి తాత 29వ ఆరాధనా మహోత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన తాత భక్తులు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. ఉదయం 5 గంటల నుంచీ సాయంత్రం వరకు వివిధ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. మేలుకొలుపు, సుప్రభాతం, పంచామృతాభిషేకం, అర్చన, మహామంగళ హారతి తాత మూల విగ్రహానికి నిర్వహించారు. అనంతరం రామిరెడ్డి తాత కాంస్య విగ్రహంతో కల్లూరు వీధుల్లో శోభాయాత్ర  నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. రామిరెడ్డి తాత సేవా సంస్థాన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి హాజరై ప్రముఖ భజన కళాకారుడు దాదిపోగు తిరుపాలుకు సంగీత కళానిథి పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమాల్లో సేవాసంస్థాన్‌ అధ్యక్షుడు డి. రామచంద్రారెడ్డి, సభ్యులు, స్థానిక కార్పొరేటర్లు, ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.   

కర్నూలు(న్యూసిటీ): సీపీఎం, డీవైఎఫ్‌ఐ, ఐద్వా, సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఆదివారం ముగిశాయి. నగరంలోని పలు కాలనీల్లో క్రికెట్‌, ముగ్గు, మ్యూజికల్‌, డాన్స్‌, తదితర పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి అతిథులు బహుమతులు అందజేశారు. ఇందిరాగాంధినగర్‌లో జరిగిన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.ప్రభాకర్‌రెడ్డి, జీవనజ్యోతి, ఐద్వా నగర కార్యదర్శి కె.అరుణ, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నగేష్‌, తదితరులు పాల్గొన్నారు.

 బుధవారపేటలో మాదరపు సురేష్‌, లక్ష్మయ్య, బంగి మద్దిలేటి ఆధ్వర్యంలో శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. 17వ వార్డు కార్పొరేటర్‌ కైప పద్మలతారెడ్డి హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

కల్లూరు:  కల్లూరు మండలంలో ప్రజలు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ముఖ్యఅతిథిగా హాజరై పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. ఉలిందకొండ గ్రామంలో టీడీపీ ముఖ్యనాయకుడు ఈవీ రమణ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, యువతకు స్లో సైక్లింగ్‌, గాలి పటాల పోటీలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. కె.మార్కాపురం గ్రామంలో టీడీపీ మండల కన్వీనర్‌ రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎద్దుల పోటీలు, ముగ్గుల పోటీలకు మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత హాజరై విజేతలకు ఆమె బహుమతుల ప్రదానం చేశారు. పాతకల్లూరులోని శ్రీరామిరెడ్డి తాత 29వ ఆరాధనోత్సవ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత పాల్గొన్నారు. రామిరెడ్డి తాత సేవా సంస్థాన్‌ సబ్యులు గౌరు దంపతులను సన్మానించారు.

 టీడీపీ నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కె.పార్వతమ్మ ఆధ్వర్యంలో వీకర్‌ సెక్షన్‌ కాలనీలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఆదివారం మహిళలకు ముగ్గుల పోటీలు, మ్యూజికల్‌ చైర్స్‌ చేపట్టిన కార్యక్రమానికి  మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు.

 నగరంలోని 29వ వార్డు కార్పొరేటర్‌  సుదర్శన్‌ రెడ్డి ఆధ్వర్యంలో శరీన్‌నగర్‌లో, 34వ వార్డు కార్పొరేటర్‌ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, 33వ వార్డు చెన్నమ్మ సర్కిల్‌లో వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి మిడ్తూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు  ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు ప్రదానం చేశారు.

కోడుమూరు(రూరల్‌):
మండలంలోని అన్ని గ్రామాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. పులకుర్తి గ్రామంలో వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. పోటీలను గ్రామ సర్పంచ్‌ ప్రవీణ్‌ ప్రారంభించి, విజేతలకు నగదు బహుమతులు అందించారు. ప్యాలకుర్తిలో యువజన సంఘం అధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

డోన్‌(రూరల్‌): మండలంలో సంక్రాంతి, కనుమ వేడుకలను ప్రజలు సంప్రదాయబద్దంగా నిర్వహించుకున్నారు. మండలంలోని చిన్న మల్కాపురం, కమలాపురం, కనపకుంట, ఎర్రగుంట్ల, గోసానిపల్లె, తదితర గ్రామాల్లో ఆదివారం ఉదయం నుంచే కనుమ పండుగ సందడి కనిపించింది.



Updated Date - 2022-01-17T05:22:24+05:30 IST