Abn logo
Jan 21 2021 @ 01:43AM

అభివృద్ధి పనులకు మంత్రుల శంకుస్థాపన

నర్సాపూర్‌ చౌరస్తా వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌రావు తదితరులు

కూకట్‌పల్లి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి నియోకవర్గంలో రూ.18.88 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు సీహెచ్‌.మల్లారెడ్డి, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌, ఎమ్మెల్యే మాధవరరం కృష్ణారావు శంకుస్థాపనలు చేశారు.  బాలాజీనగర్‌ డివిజన్‌లోని ధనలక్ష్మి సెంటర్‌ వద్ద రూ.1.55 కోట్లతో నాలా విస్తరణ, కేపీహెచ్‌బీకాలనీ భువన విజయం మైదానంలో రూ. కోటితో ఇండోర్‌ షటిల్‌ కోర్టు నిర్మాణ పనులు, కేపీహెచ్‌బీకాలనీ డివిజన్‌ పరిధిలోని పాత రైతుబజార్‌ వద్ద రూ.48 లక్షల వ్యయంతో పార్కు, 9వ ఫేజ్‌లో రూ.కోటితో ఇండోర్‌ షటిల్‌ కోర్టు నిర్మాణం, 6వ ఫేజ్‌లో రూ.1.41 కోట్లతో నాలా విస్తరణ పనులు చేపట్టనున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు శిరీష, మందడి శ్రీనివాసరావు, జెడ్సీ వి.మమత, జీహెచ్‌ఎంసీ అధికారులు రవికుమార్‌, ఈఈ నాగేందర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

న్యూ రామారావు నగర్‌లో..
అల్లాపూర్‌: అల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలోని న్యూ రామారావునగర్‌లో నాలా పనులకు మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జీహెచ్‌ఎంసీ అధికారులు, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, కార్పొరేటర్‌లు సబీహా బేగం, తూము శ్రావణ్‌కుమార్‌, పి. సతీ్‌షగౌడ్‌ పాల్గొన్నారు.

ఫతేనగర్‌ డివిజన్‌లో..
బాలానగర్‌: ఫతేనగర్‌ డివిజన్‌ పరిధిలో రూ.270.50 లక్షల నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ శంకుస్థాపన చేశారు. నర్సాపూర్‌ చౌరస్తా నుంచి దీనదయాళ్‌నగర్‌, ఐలా నుంచి ఖేతాన్‌ బ్రిడ్జి, గూడ్స్‌ షెడ్‌రోడ్డు, భరత్‌నగర్‌ మార్కెట్‌ వరకు డ్రైనేజీ పనులను చేపట్టనున్నట్లు కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత, మూసాపేట సర్కిల్‌ ఉప కమిషనర్‌ రవీందర్‌గౌడ్‌ తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సతీ్‌షబాబు, ముద్దం నర్సింహయాదవ్‌, తాజా కార్పొరేటర్‌ ఆవుల రవీందర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ జి. వెంగళ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్‌ రాలేదని టీఆర్‌ఎస్‌ శ్రేణుల నిరాశ

కూకట్‌పల్లి నియోజకవర్గంలో అభివృద్ధిపనుల శంకుస్థాపనకు మంత్రి కేటీఆర్‌ వస్తున్నారని ఘన స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. ఒక్కో డివిజన్‌ నుంచి సుమారు 200 బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించి బతుకమ్మ, బోనాలతో స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేశారు. ఉదయం 9గంటలకు బాలానగర్‌ వస్తారని నేతలంతా ఫతేనగర్‌, బాలానగర్‌ ప్రాంతాల్లో వేచి చూశారు. చివరి నిమిషంలో కేటీఆర్‌ రావడం లేదని తెలిసే లోపే మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నర్సాపూర్‌ చౌరస్తాకు వచ్చి శిలాఫలకాన్ని ఆవిష్కరించడంతో టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. శిలాపలకం వద్ద బెలూన్లు ఎగురవేసి ఫొటోలు దిగారు.

Advertisement
Advertisement