Abn logo
Sep 28 2020 @ 05:53AM

మానవులు చేయకూడని మహాపాపాలు

Kaakateeya

పరకాంత నెవ్వఁడేనిం,బురుషుండుండగ మొఱఁగి పొందిన యమకిం

కరులతనిఁ బట్టి వడిఁద

త్తరమునఁ బడవైతు రంధతామిస్రమునన్‌


సంస్కృత మహాభాగవతం పంచమ స్కంధంలో నరకాలను గురించి అనువదిస్తూ.. బమ్మెరపోతన రాసిన ఈ పద్యంలో పరదారాభిగమన పాప వాక్యాన్ని గురించి చెప్పారు. మానవ లోకంలో పాపకార్యాలు ప్రబలిపోతున్న వైనాన్ని పరీక్షిత మహారాజు మిక్కిలి వేదనతో.. అటువంటి పాపాత్ములందరికీ నరక లోకంలో ఎటువంటి శిక్షలు ఉంటాయో వివరించమని అడిగినప్పుడు.. స్వార్థంతో, దురాశతో, నిత్యం పాపకర్మలు చేసే వారనుభవించే వివిధ నరకాలను గురించి, వారనుభవించే నరకయాతనలను గురించి శుక మహర్షి విపులంగా చెప్పాడు. భాగవత కర్తయైున వ్యాసభగవానుడు ఈ కారణంతో ఏ మానవులూ, ఎటువంటి పాపకార్యాలకూ పాల్పడరాదన్న సందేశాన్ని అందించారు. భాగవతం వివరించిన మహాపాపాలు 27 ఉన్నాయి. ఈ పాపకర్మలు చేసిన వారు అనుభవించే నరక యాతనలు కూడా భయంకరరీతిలో ఉంటాయని భాగవతం వివరించింది. మానవ జీవితాన్ని ఫలప్రదం చేసుకునే మార్గాన్ని వదిలి.. పాపాత్ములై ఆచరించే కర్మలను గురించి తెలుసుకున్నప్పుడు.. ఎటువంటి పనులు పాపాలను కలుగజేస్తాయో తెలుసుకోవచ్చు. ఎటువంటి పనులు చేయరాదో కనువిప్పు కలిగించే సందర్భం ఈ స్కంధం చెబుతున్నది.


‘‘యస్తు వంచయిత్వా పురుషం దారానుపభుంక్తే...’’ అంటే ఇతరులను మోసగించి వారి భార్యలతో అక్రమ సంబంధం కలిగి ఉండడం మహాపాపం.

‘‘పరవిత్తావత్య కళత్రాణ్యపహరతి...’’ అనగా పరధనాన్ని, పరుల భార్యలను, పరుల పుత్రులను అపహరించడం ఘోరమైన పాపం.

‘‘ఉగ్రః పశూన్‌ పక్షిణోవా ప్రాణభృత ఉపరుంధయతి, తమవకరుణం పురుషాదైరపి గర్హితమ్‌..’’

ఎవరైనా కరుణాదూరులై, క్రూరులై తమ కడుపు నింపుకొను నిమిత్తం ప్రాణముతోనున్న పశుపక్ష్యాదులను ఘోరంగా వధించి, తినడం మిక్కిలి గర్హించదగిన పాపకార్యము.


అతిథి అభ్యాగతులను అగౌరవపరచుట, తాను ధనవంతుడినని అహంకరించుట, తన ధనమును మాత్రమే కాపాడుకొనవలెనన్న దుష్టమైన ఆలోచనలతో ఇతరులను బాధపెట్టుట, అమాయకులైన బాలల్ని, అంగవైకల్యం కలిగిన వారిని, బలహీనులను బంధించి బాధించుట, నిరపరాధులకు, అడవిలోని ప్రాణులను బాధపెట్టుట, నమ్మినవారిని మోసగించుట, సాక్ష్యం చెప్పవలసిన సందర్భాలలో, క్రయవిక్రయాది ద్రవ్య వినిమయ సందర్భాలలో తప్పుడు మార్గాలలో వెళ్లడం వంటి పలు పాపకార్యాలను, వాటి కారణంగా అనుభవించే నరకయాతనలను తెలుసుకుంటే మనిషిగా జన్మించినవారికి చేయకూడని మహాపాపములు ఏవో అర్థమౌతాయి. లోకనాశనకరములైన పాపకర్మలనాచరించరాదన్న సత్సందేశాన్ని మహాభాగవతం మానవలోకానికి అందించింది.


- గన్నమరాజు గిరిజా మనోహరబాబు

Advertisement
Advertisement
Advertisement