Abn logo
Sep 20 2021 @ 00:36AM

సంవేదన

1. 

నువ్వు నడిచిన దారుల్లో

నన్ను నేను వెదికాను.

నీ కోసం నడిచొచ్చిన

సూరీడు- చీకటెక్కడిది?

చల్లగా చుట్టేసిన

పొగమంచు- దుఃఖమెందులకు.

ఓ మనిషి కంటే ఎక్కువ కాదూ-

ఇవన్నీ

మనసు కూడగట్టు కుందుకు.


2.

రావి చెట్టు కడిమి చెట్టు

గువ్వ పిట్ట వడ్రంగి పిట్ట

కీచురాళ్ళు మిణుగురు పురుగు

రాత్రి చుక్కలు

పొద్దుటి పువ్వులు

నిన్నటి నుండి నేటికి- 

రెండు సంధ్యల మధ్య 

ఎంత పెద్ద ప్రపంచం-

కళ్ళు విప్పి చూస్తే!


3.

నీటి చుక్క

గడ్డి పరకా

ఆకు చివర

పిల్ల తెమ్మెర

దృష్టిలో పడి

చాన్నాళ్ళయింది.


4.

మధ్యాహ్నపు చంద్రుడు

సాయంత్రపు సూరీడు.

గమనించేంత సమయం

నీకెక్కడిది?

ఎప్పుడైనా ఆగి చూడు

అక్షరం మళ్లీ 

ప్రాణం పోసుకుంటుంది

నీలో


5.

ప్రేమ భారం దిగితే

సముద్రమంత శూన్యం

ఆకాశమంత ప్రశాంతత

కొత్తగా నేర్చుకునే

ప్రతి పాఠం...

Law of Conservation of Love!


6.

రెండు ఏక కేంద్ర వృత్తాల మధ్య

ప్రదేశం

కంకణం - లెక్కల్లో

జీవితంలో కూడా.

ఒదిగి, దగ్గరగా

అదే దూరంలో

ఒకే కేంద్రంతో.


7.

ఒక కప్పు కాఫీ

చల్లారేదాకా తాగుదామంటాను నేను.

చల్లార్చుకుని తాగేసెయ్యమని నువ్వు

పొద్దుటి పది నిమిషాలు 

అంత వేగంగా సాగితే...

జీవితం ఆగిపోదూ!


8.

నీడలా వెంటాడిన కళ్ళని కాదని

నీవెంట వచ్చాను కదా!

నువ్వు వదిలే క్షణాలను

ఏరుకోవడంలో మునిగి

అస్తిత్వం అంటే మర్చిపోయాను


9.

నా పనులన్నీ పక్కనపెట్టి

నీకోసం వేచి ఉంటాను

ఒక్క క్షణంలో 

ఏదో పని ఉన్నట్టు

మాయమౌతావు

అలాంటి కొన్ని కోట్ల

క్షణాలు 

నాలో నింపిన శూన్యం

ఇది

-

నువ్వూ

శూన్యం

నేను-

మూడు సమాంతర రేఖలం


10.

ఒక మధ్యాహ్నం ఎండవేళ

చెట్టు నీడలో

సేదతీరుతున్న రెండు సిమెంట్‌ బెంచీలు

నింగి - నేలా

ఎండుటాకులు - పచ్చదనం

ఎండా - నీడ

నీలి మబ్బు ఇసుక మైదానం

రాతి మెట్లూ - దూరంగా కొండలు

Agony and Ecstacy!


11.

వయసు పెరగడం

మనసుకి

తెలియడం లేదు

జీవితంలో మూడొంతులు

నిన్ను ప్రేమించడంలో

గడిచిపోయింది.

మిగతా సమయం

వెండి వెంట్రుకల్ని లెక్కించడానికే

మిగిలిపోయిందా?

శ్రీరంగవల్లి కోన

98498 10100