నీలకంఠుడి జాతర

ABN , First Publish Date - 2022-01-17T05:38:30+05:30 IST

చేనేతపురి ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వర స్వామి జాతర సోమవారం నుంచి ఆరంభం కానుంది.

నీలకంఠుడి జాతర
నీలకంఠేశ్వరస్వామి ఆలయం

నేటి నుంచి ఆరంభం
19న మహా రథోత్సవం
చేనేతపురిలో వైభవంగా ఏర్పాట్లు


ఎమ్మిగనూరు, జనవరి 16: చేనేతపురి ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వర స్వామి జాతర సోమవారం నుంచి ఆరంభం కానుంది. ఏటా అంగరంగ వైభవంగా ఈ జాతరను నిర్వహిస్తారు. ఐదు రోజులపాటు జరిగే ఈ వేడుకల వాతావరణం స్థానికంగా దాదాపు నెల రోజులపాటు ఉంటుంది. స్వామి వారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.   ఈ ఉత్సవాల్లో రాష్ట్ర నలమూలల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు పాల్గొంటారు. 21వ తేదీ శుక్రవారం ఈ వేడుకలు ముగుస్తాయి.

మూడు శతాబ్దాల క్రితం..

ఎమ్మిగనూరులోని నీలకంఠేశ్వర స్వామి లింగాన్ని 300 ఏళ్ల కింద కాశీ నుంచి ఎద్దుల బండిపై తీసుకొచ్చి ప్రతిష్ఠించారని అంటారు. అప్పటి నుంచి ప్రతి ఏటా పుష్యమాసంలో ఆది దంపతుల కల్యాణం  నిర్వహిస్తారు. పరమేశ్వరుడి పక్షాన బండ కుటుంబసభ్యులు, పార్వతిదేవి పక్షాన గడిగె కుటుంబసభ్యులు, పెళ్లి పెద్దగా మాచాని కుటుంబసభ్యులు కలిసి స్వామివారి వివాహం నిర్వహిస్తారు. అట్లాగే ఈ ఆలయంలోని రథాన్ని విరూపన్న అనే శిల్పి తయారు చేశాడు. దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు లోని శివాలయాల్లో ఉన్న రథాలను పరిశీలించి కర్ణాటకకు చెందిన ఈ శిల్పి దీన్ని రూపొందించాడని అంటారు.  

ఉత్సవం ఇలా..

వందల ఏళ్ల నుంచి నీలకంఠేశ్వరస్వామి మహా రథోత్సవం ప్రతి సంవత్సరం జనవరి (పుష్య మాసం)లో నిర్వహించడం ఆనవాయితీ. బ్రిటీష్‌ హయాంలో చెన్నై నుంచి ఇనుప గొలుసులు తెచ్చి రథానికి ఏర్పాటు చేశారు. తేరు బజారులోని రథశాల నుంచి బసవేశ్వర స్వామి ఆలయం వరకు రథాన్ని లాగి తిరిగి యఽథాస్థానానికి తీసుకొస్తారు. ఏటా ఈ రథోత్సవానికి లక్షకు పైగా జనం వస్తారు. తరలి రావడం విశేషం.

19న మహా రథోత్సవం

సోమవారం  పౌర్ణమిరోజు రాత్రి 9 గంటల నుంచి 12గంటల వరకు పుష్ప రథారోహణ, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నిర్వహిస్తారు. 18వతేది మంగళవారం రాత్రి 9గంటల నుంచి 12 గంటల వరకు ప్రభావళి, 19వతేది సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు మహా రథోత్సవం తేరుబ జారులో అశేష భక్తజనం మధ్య నిర్వహిస్తారు. 20వతేదీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు స్వామి వారి వాహ్యావళి, 21 సాయంత్రం 5గంటల నుంచి 9గంటల వరకు తీర్థావళి వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే మహేశ్వర బ్రాహ్మణ సన్మాన మహోత్సవం చేస్తారు.

ఘనంగా ఏర్పాట్లు

జాతర సందర్భంగా ఆలయా నికి రంగులు వేసి విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. మున్సిపా లిటీ అధికారులు రథోత్సవం జరిగే  తేరు బజారులో గరుసు వేసి చదును చేశారు.  ప్రధాన రహదారులను శుభ్రం చేశారు. సోమప్ప సర్కిల్‌, ఓం సర్కిల్‌, అన్నమయ్య సర్కిల్‌, శివసర్కిల్‌, సోమేశ్వర సర్కిళ్లతో పాటు ప్రధాన రహదారిలో విద్యుత్‌ దీపాలు ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు జాతర నిర్వహించనున్నారు.

 సంప్రదాయ క్రీడలు

నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బల ప్రదర్శన పేరుతో రైతు సంబరాలు నిర్వహించ నున్నారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ బల ప్రదర్శన పోటీలకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అంతర్‌ రాష్ట్ర క్రికెట్‌ పోటీలతోపాటు అంతర్‌ రాష్ట్ర ఫుట్‌బాల్‌, కబడ్డీ పోటీలకు  నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 రథోత్సవంపై సందిగ్ధత

కొవిడ్‌ కారణంగా మహారథోత్సంపై సందిగ్ధత నెలకొంది. అధికారులు, ఆలయ కమిటీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. రథోత్సవానికి స్థానిక ప్రజా ప్రతినిధి సానుకూ లంగా ఉన్నారు. ఉన్నతా ధికారుల అనుమతి రావాల్సి ఉన్నదని అధికారులు అంటున్నారు.

Updated Date - 2022-01-17T05:38:30+05:30 IST