అన్నమయ్య సంకీర్తనలతో పులకించిన సప్తగిరులు

ABN , First Publish Date - 2021-04-09T08:26:29+05:30 IST

అన్నమయ్య 518వ వర్ధంతి సందర్భంగా గురువారం సాయంత్రం తిరుమలలో నిర్వహించిన సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానంతో ఏడుకొండలు పులకించాయి.

అన్నమయ్య సంకీర్తనలతో పులకించిన సప్తగిరులు
అనుగ్రహభాషణం చేస్తున్న రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌స్వామి, స్వామి, అమ్మవార్లకు ఊంజల్‌సేవ, అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తున్న కళాకారులు

తిరుమల, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య 518వ వర్ధంతి సందర్భంగా గురువారం సాయంత్రం తిరుమలలో నిర్వహించిన సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానంతో ఏడుకొండలు పులకించాయి. తొలుతగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి తీసుకొచ్చారు. ఊంజల్‌ సేవ నిర్వహించారు. ఉత్సవంలో తొలిగా నిర్వహించిన సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం సుమధురంగా సాగింది. ‘దినము ద్వాదశి నేడు.. భావములోన బాహ్యము నందును.. బ్రహ్మకడిగిన పాదము.. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా.. కొండలలో నెలకొన్న కోనేటిరాయుడువాడు..’ తదితర కీర్తనలను టీటీడీ ఆస్థాన విద్యాంసుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పి.రంగనాఽథ్‌, బి.రఘునాథ్‌, బుల్లెమ్మ, విశాలాక్ష్మితో పాటు హైదరాబాదుకు చెందిన టి.శ్రీనిధి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భజన బృందాల సభ్యులు గానం చేశారు. ఈ సందర్భంగా అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌స్వామి అనుగ్రహభాషణం చేశారు. అనేక భాషల్లో శ్రీవారిపై వేలాది సంకీర్తనలున్నా తేట తెలుగులో అన్నమయ్య రచించిన సంకీర్తనలు అద్భుతమన్నారు. వీటిని వినేందుకే ప్రతి ఏడాది ఇక్కడికి వస్తున్నట్టు చెప్పారు. కరోనా వంటి విపత్కర కాలంలో పారాయణం, అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలను టీటీడీ నిర్వహించడం అభినందనీయమన్నారు. రాబోవు రోజుల్లో అన్నమయ్య వర్ధంతి, జయంతి ఉత్సవాలను మరింత వేడుకగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి చెప్పారు. అనంతరం అహోబిలం పీఠాధిపతికి టీటీడీ ఈవో, అదనపు ఈవో ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాధ్‌జెట్టి శాలువ, శ్రీవారి ప్రసాదాలు అందజేసి సన్మానించారు. అహోబిలం మఠం తరపున టీటీడీ ఈవో, అదనపు ఈవోను సత్కరించారు. చివరగా టీటీడీ తరపున తాళ్లపాక వంశీయులను ఘనంగా సన్మానించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ఈ ఉత్సవం నిర్వహించారు. అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకుడు ఆచార్య దక్షిణామూర్తిశర్మ, ఆలయ డిప్యూటీఈవో హరీంద్రనాధ్‌, వీజీవో బాలిరెడ్డి, పేష్కార్‌ శ్రీహరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-09T08:26:29+05:30 IST