సారా సవాల్‌ ..!

ABN , First Publish Date - 2021-10-13T05:08:40+05:30 IST

ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు 27 నాటికి జిల్లాలో 3,989 కేసులు నమోదవగా, 3,394 మందిని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

సారా సవాల్‌ ..!

ఏజెన్సీలో ప్రతి గ్రామంలో సారా

మైదాన ప్రాంతాల్లోనూ యథేచ్ఛగా దందా

ధరాభారంతో నాటుకే మందుబాబులు మొగ్గు


సారా మహమ్మారి జిల్లాపై విరుచుకుపడుతోంది. ఒకప్పుడు మారుమూల ప్రాంతాలకే పరిమితమైన సారా నేడు జిల్లాలో ఏమూల చూసినా కనిపిస్తోంది. గతంలో నవోదయం పేరుతో జిల్లా నుంచి పారిపోయిన మహమ్మారి ప్రస్తుత ప్రభుత్వ విధానంతో మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఏటా వేల సంఖ్యలో  కేసులు నమోదవుతున్నా సారా విస్తరణ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఎస్‌ఈబీ, పోలీస్‌ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. 


ఏలూరు, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) 

ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు 27 నాటికి జిల్లాలో 3,989  కేసులు నమోదవగా, 3,394 మందిని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 20,100 లీటర్ల నాటుసారా అధికారులు స్వాధీనం చేసుకోగా, 7,14,000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. మరో 9,091 కిలోల నల్లబెల్లం, 468 వాహనాలను స్వాధీనం చేసు కున్నారు. అధికారుల కన్నుగప్పి జిల్లాలో చలామణి అవుతున్న నాటుసారా శాతం కూడా భారీ గానే ఉంది. ఒకప్పుడు జనసంచారం, అధికారుల హడావుడి లేని మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో మాత్రమే సారా తయారయ్యేది. కానీ ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో సారా తయారవుతోంది. ఏజెన్సీ లోని బుట్టాయగూడెం మండలం ముద్దప్పగూడెం, పరిసర ప్రాంతాలు ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా ఉండగా, మైదాన ప్రాంతాల్లోని నదీ తీర ప్రాంతాలు, చిన్నచిన్న దీవులు, వాగులు, వంకలు, కాలువగట్లు అక్రమార్కులకు అడ్డాగా మారుతున్నాయి. చింతలపూడి మండలం నాగి రెడ్డిగూడెంలో కూడా పెద్ద మొత్తంలో నాటుసారా తయారవుతోంది. నరసాపురం, మొగల్తూరు, నలజర్ల, ద్వారకాతిరుమల, కొయ్యలగూడెం, కుక్కునూరు, పోలవరం సహా అనేక మండలాల్లో దందా యథేచ్ఛగా సాగుతోంది. 


ధరల ధాటికి.. సారా దరికి

రాష్ట్ర ప్రభుత్వం మద్యనిషేధ పథకం పేరుతో లిక్కర్‌ ధరలను భారీగా పెంచింది. ఒక్క క్వార్టర్‌ మందు కావాలన్నా మందుబాబులు 2 నుంచి 3 వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో మెజారిటీ మందుబాబులు తక్కువ రేటుకు వచ్చే నాటుసారాకే మొగ్గు చూపు తున్నారు. దీనికి తోడు ఎక్కువ కిక్కునిచ్చేందుకు సారాలో అమ్మోనియా, బ్యాటరీ పౌడర్‌ను అధి కంగా కలుపుతున్నారు. దీంతో సారాకు విపరీతంగా డిమాండు పెరిగింది. ప్రభుత్వ మద్యం ధర ఎక్కువగా ఉండడం, కిక్కు తక్కువగా ఉండడంతో మందుబాబులు నాటు వైపు మళ్లారు. ఇదే అదనుగా గతంలో 10 రూపాయలు ఉన్న సారా ప్యాకెట్‌ను అక్రమార్కులు 40కి పెంచేశారు. అయినప్పటికీ డిమాండు ఏమాత్రం తగ్గలేదు. 


సవాలుగా తీసుకున్నాం 

 సి.జయరామరాజు, ఎస్‌ఈబీ ఏఎస్పీ

నాటుసారా అరికట్టడం సవాలుగా తీసుకున్నాం. ఏమూల ఉన్నా పసిగట్టి పట్టు కుంటున్నాం. వేల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నాం. వాగులు, వంకలు, నదీ ద్వీపాలు అడ్డాగా అక్ర మార్కులు సవాలు చేస్తున్నారు.  



Updated Date - 2021-10-13T05:08:40+05:30 IST