Abn logo
Oct 18 2020 @ 10:46AM

రాంబిల్లి దు:ఖదాయని.. శారదా

శారదా నదికి వరద రావడంతో మునిగిన రజాల గ్రామంలోని పంట పొలాలు(ఫైల్ ఫొటో)Kaakateeya

వరద కారణంగా ఏటా నష్టపోతున్న మండల రైతులు

నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నదిలో 65-70 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం

గట్లకు మూడుచోట్ల గండ్లు

వరద నీరు సముద్రంలో కలిసేందుకు అడ్డుగా మారిన ఎన్‌ఏవోబీ వంతెన, రక్షణ గోడ

13 గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లాకు జీవనాడి అయిన శారదా నది...రాంబిల్లి మండలానికి దుఃఖదాయనిగా మారింది. శారదా నది సముద్రంలో కలిసేచోట వున్న ఈ మండలంలో ఏటా వర్షాకాలంలో పంట పొలాలు నీట మునగడం, రైతులు నష్టపోవడం సర్వసాధారణంగా మారింది. అయితే ఏటా రెండు వేల ఎకరాల్లోనే పంటలు నీట మునుగుతుండగా, ఈ ఏడాది సుమారు ఐదు వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. గతంలో వరద నీరు వచ్చింది వచ్చినట్టుగా సముద్రంలోకి వెళ్లిపోయేది. అయితే కొప్పుగొండుపాలెం వద్ద నేవల్‌ బేస్‌ వంతెన, రక్షణ గోడ నిర్మాణంతో నీటి ప్రవాహ వేగం పూర్తిగా మందగించి, నది గట్లకు గండ్లు పడి వరద నీరు పొలాలను ముంచెత్తున్నది. గతంలో ఎన్నడూ ఇంత ముంపును చూడలేదని పంటలు కోల్పోయిన రైతులు చెబుతున్నారు.


జిల్లాలో శారదా, దాని ఉపనదులైన పెద్దేరు, బొడ్డేరు పరీవాహక ప్రాంతం 13 మండలాలకు విస్తరించి ఉంది. ఈ నదులపై నిర్మించిన మూడు రిజర్వాయర్లు, పలు చెక్‌డ్యామ్‌లు, గ్రోయిన్ల ద్వారా సుమారు 70 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. దీంతో శారదా నదిని రైతుల జీవనాడిగా పిలుస్తుంటారు. శారదా నది కశింకోట మండలంలో రెండుగా (మేజర్‌, మైనర్‌) చీలిపోయి, రాంబిల్లి మండలం వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ మండలం నది చివరన వుండడంతో ఏటా వర్షాకాలంలో వరదలు సంభవించడం, పలు గ్రామాల్లో పంట పొలాలు ముంపునకు గురవ్వడం జరుగుతోంది. అయితే గతంలో ఎంత భారీగా వరద వచ్చినప్పటికీ ఒకటి, రెండు రోజుల్లోనే నీరంతా సముద్రంలోకి  పోయేది. గత ఆదివారం నుంచి రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు వాగులు, గెడ్డలు పొంగాయి. శారదా, పెద్దేరు, బొడ్డేరు నదులపై వున్న రైవాడ, పెద్దేరు, కోనాం రిజర్వాయర్ల నుంచి సుమారు 16 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. వాగులు, గెడ్డలు, చెరువుల నుంచి మరో 50 వేల క్యూసెక్కుల నీరు ఆయా నదుల్లోకి చేరింది.


గత మంగళవారం శారదా నదిలో 65 వేల నుంచి 70 వేల క్యూసెక్కుల మేర వరద నీరు ప్రవహించినట్టు ఇరిగేషన్‌ అధికారుల అంచనా. దీంతో మునగపాక, రాంబిల్లి మండలాలు ముంపునకు గురయ్యాయి. శారదా నది నుంచి నీరు సముద్రంలోకి వెళ్లేటప్పుడు చిట్టచివరనున్న రాంబిల్లి మండలంలో ప్రవాహం నెమ్మదిస్తుంది. అయితే నాలుగు రోజుల క్రితం శారదా నీటి ప్రవాహం వేగంగా సముద్రంలోకి వెళ్లకపోవడంతో నీటి మట్టం పెరిగిపోయి, నది గట్లకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. మరికొన్నిచోట్ల నది గట్ల మీదుగా వరద నీరు పొంగి, పొలాలమీద పడింది. 13 గ్రామాల పరిధిలో సుమారు ఐదు వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. కొప్పుగొండుపాలెం వద్ద నేవీ నిర్మించిన వంతెన, దాని కింద ఏర్పాటు చేసిన రక్షణ గోడ (ఫెన్సింగ్‌) ఇందుకు కారణమని రైతులు వాపోతున్నారు.

Advertisement
Advertisement