ఇల్లరికం అల్లుడు... సారంగపాణి!

ABN , First Publish Date - 2021-06-04T05:30:00+05:30 IST

తమిళనాడులోని కుంభకోణం ఆలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది. విశిష్టతలు కలిగిన ఎన్నో ఆలయాలు ఈ నగరంలోనూ, చుట్టుపక్కలా ఉన్నాయి. వాటిలో విలక్షణమైన పురాతన మందిరం సారంగపాణి ఆలయం...

ఇల్లరికం అల్లుడు... సారంగపాణి!

తమిళనాడులోని కుంభకోణం ఆలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది. విశిష్టతలు కలిగిన ఎన్నో ఆలయాలు ఈ నగరంలోనూ, చుట్టుపక్కలా ఉన్నాయి. వాటిలో విలక్షణమైన పురాతన మందిరం సారంగపాణి ఆలయం. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి కథతో ముడిపడి ఉన్న ఈ గుడిలో మహా విష్ణువు ఇల్లరికం అల్లుడుగా కొలువుతీరాడు.


కావేరి నదీ తీరాన ఉన్న పంచరంగ లేదా పంచ రంగనాథ క్షేత్రాల్లో కుంభకోణంలోని సారంగపాణి పెరుమాళ్‌ ఆలయం ఒకటి. వైష్ణవ దివ్య ప్రబంధాల్లో ఈ ఆలయ ప్రాశస్త్య వర్ణన ప్రముఖంగా కనిపిస్తుంది. ఆలయంలో ఉత్థాన శయన భంగిమలో... అంటే పైకి లేస్తున్నట్టు కనిపించే మూలవిరాట్‌తో పాటు శంఖ, చక్ర, ధనుర్ధారి అయిన ఉత్సవ మూర్తికి కూడా సమాన ప్రాధాన్యం ఉంది. అందుకే దీన్ని ‘ఉభయ ప్రధాన క్షేత్రంగా పరిగణిస్తారు. స్థల పురాణం ప్రకారం, త్రిమూర్తులలో ఎవరు గొప్పవారనేది తేల్చే ప్రయత్నంలో వైకుంఠానికి వెళ్ళిన భృగు మహర్షి తనకు తగిన ఆహ్వానం దక్కలేదన్న కోపంతో విష్ణు మూర్తి వక్షస్థలంపై కాలితో తన్నాడు. అయినప్పటికీ మహర్షికి విష్ణువు మర్యాదలు చేయడం స్వామి వక్షస్థలంలో కొలువైన లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగించింది. ఆమె వైకుంఠాన్ని వదిలి, భూలోకంలోని కరవీరపురంలో (నేటి కొల్హాపూర్‌లో) తపస్సుకు ఉపక్రమించింది. ఆమెను వెతుక్కుంటూ భూలోకానికి వచ్చిన మహా విష్ణువు... శ్రీనివాసుడిగా పద్మావతిని వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత పద్మావతితో ఏర్పడిన వివాదంతో మళ్ళీ ఆయన ఒంటరిగా మిగిలాడు. పద్మావతితో తన పెళ్ళిపై మహాలక్ష్మి ఆగ్రహంతో ఉన్నట్టు నారదుడితో తెలుకొని, కుంభకోణానికి వచ్చి, భూగర్భంలో నివాసం ఏర్పరచుకున్నాడు. కాగా, తాను చేసిన అపరాధాన్ని క్షమించాలని భృగు మహర్షి చేసిన ప్రార్థనలను ఆలకించిన మహాలక్ష్మి అతనికి కుమార్తెగా పుట్టడానికి అంగీకరించింది. హేమ మహర్షిగా భృగువు జన్మించగా అతని కూతురుగా ఒక కొలనులోంచీ వెయ్యి కమలాల మధ్య నుంచి లక్ష్మి ఆవిర్భవించింది.



మహర్షి ఆమెకు కోమలవల్లి అనే పేరు పెట్టి, పెంచి పెద్ద చేశాడు. మహర్షి కోరిక ప్రకారం కోమలవల్లిని విష్ణుమూర్తి పెండ్లాడి, ఇల్లరికపు అల్లుడిగా ఉండిపోయాడు. అందుకే ఈ స్వామిని తమిళులు ‘వీట్టోడు మాప్పిళ్ళై’ అని పిలుస్తారు. అంటే ‘ఇల్లరికం అల్లుడు’ అని అర్థం. మహా విష్ణువు విల్లు పేరు సారంగం. 



కోమలవల్లిని వివాహం చేసుకోవడానికి విష్ణువు విల్లు ధరించి, రథంపై వివాహానికి వచ్చాడట! అందుకే ఈ స్వామిని ‘సారంగపాణి పెరుమాళ్‌’ అని పిలుస్తారు. ప్రధాన ఆలయం దిగువన భూగర్భంలో పాతాళ శ్రీనివాసుడు కొలువై ఉంటాడు. 

తొలి పూజ అమ్మకే!

లక్ష్మీదేవి కోమలవల్లిగా అవతరించిన చోటు ఇది. పుట్టిల్లు కాబట్టి స్థానబలం ఆమెదే! అందుకే ఈ ఆలయంలో మొదట అమ్మవారిని దర్శించుకొని, పూజలు చేసిన తరువాతే... ఇల్లరికం అల్లుడైన స్వామివారిని దర్శిస్తారు. 108 వైష్ణవ దివ్య క్షేతాల్లో ఒకటైన ఈ ఆలయంలో... వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం నిర్వహించే సంప్రదాయం లేకపోవడం మరో విశేషం. దాదాపు రెండువేల ఏళ్ళ నాటిదిగా పరిగణిస్తున్న ఈ ఆలయం శిల్పకళాపరంగానూ ఆకర్షిస్తుంది. ఇక్కడ అనేక కట్టడాలు ఏడో శతాబ్దం నాటివని చరిత్రకారుల అంచనా.సుమారు 150 అడుగుల ఎత్తు, 11 అంతస్తులతో సమున్నతంగా కనిపించే ఈ ఆలయ రాజగోపురం... తమిళనాడులోని మూడో అతిపెద్ద రాజగోపురం. చైత్రమాసంలో ఇక్కడ నిర్వహించే రథోత్సవాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు భక్తులు.


Updated Date - 2021-06-04T05:30:00+05:30 IST