ముగిసిన శరన్నవరాత్రుల ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-10-17T05:07:43+05:30 IST

మండలంలోని జొన్నవాడలో శుక్రవారం శరన్నవరాత్రుల ఉత్సవాలు ముగిశాయి.

ముగిసిన శరన్నవరాత్రుల ఉత్సవాలు
అశ్వవాహనంపై ఊరేగిన కామాక్షితాయి

బుచ్చిరెడ్డిపాళెం,అక్టోబరు16: మండలంలోని జొన్నవాడలో శుక్రవారం  శరన్నవరాత్రుల ఉత్సవాలు ముగిశాయి. విజయదశమి సందర్భంగా  కామాక్షితాయి ఆలయం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో కిటకిటలాడింది.  రాత్రి శమీపూజ, అశ్వవాహనం సేవ, నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఏకాంతసేవతో నవరాత్రోత్సవాలు  ముగిశాయి, ఆలయ చైర్మన్‌ చీమల రమేష్‌బాబు, సభ్యులు, ఈవో ఏవీ. శ్రీనివాసులురెడ్డి ఉత్సవాలను పర్యవేక్షించారు.

ఇందుకూరుపేట : మండలంలోని గంగపట్నం చాముండేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ముగిశాయి. శుక్రవారం ఉదయం అభిషేకాలు, కుంకుమ పూజలు, పూర్ణాహుతి నిర్వహించారు. విజయదశమి విశేష పూజల అనంతరం రాజరాజేశ్వరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి పల్లకి సేవ నిర్వహిం చారు. అలాగే పల్లెపాడు కామాక్షి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారు కూడా  నిజ స్వరూప అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అభిషేకాలు, కుంకుమపూజలు, పూర్ణాహుతి, చండీ యాగం, నిర్వహించారు. రాత్రి పల్లకిసేవ నిర్వహించారు. ఇందుకూరుపేట లక్ష్మీనరసింహస్వామి, కొత్తూరు లలిత మహేశ్వర, ఇందుకూరుపేట ఇందుపూరమ్మ, లేబూరు కుంకాలమ్మ  ఆలయాల్లో కూడా  భక్తులు కూడా విశేషంగా హాజరై అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. 

విడవలూరు  : మండలంలో శుక్రవారం దసరా పండుగను  ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రామతీర్థం, విడవలూరు, ఊటు కూరు, పార్లపల్లి, వావిళ్ల, ముదివర్తి గ్రామాల్లోని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. పోలేరమ్మకి పొంగళ్లు సమర్పించారు. భక్తులకు అన్నదానం చేశారు.



Updated Date - 2021-10-17T05:07:43+05:30 IST