HYD : సరికొత్త వసతి గృహంగా మారనున్న నాటి సరాయి స్థలం..

ABN , First Publish Date - 2021-12-07T16:16:22+05:30 IST

నాటి అతిథి గృహమైన నాంపల్లి సరాయి స్థలం సరికొత్త వసతి గృహంగా మారనుంది.

HYD : సరికొత్త వసతి గృహంగా మారనున్న నాటి సరాయి స్థలం..

  • ట్రాన్సిట్‌ డార్మ్స్‌ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ కసరత్తు
  • రూ.11 కోట్లతో భవనం
  • మహిళా పర్యాటకుల కోసం
  • కొత్త వసతి గృహంలో నిర్ణీత రుసుం చెల్లించాల్సిందే
  • ప్రభుత్వానికి ప్రతిపాదన
  • రేపు స్టాండింగ్‌ కమిటీలో చర్చ

హైదరాబాద్‌ సిటీ : నాటి అతిథి గృహమైన నాంపల్లి సరాయి స్థలం సరికొత్త వసతి గృహంగా మారనుంది. మహిళా పర్యాటకుల బస కోసం భారీ భవనం నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ రంగం సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సేఫ్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా పోలీస్‌ విభాగంతో కలిసి ట్రాన్సిట్‌ డార్మ్స్‌(పర్యాటకుల వసతి గృహం) నిర్మాణం చేపట్టనున్నారు. సెల్లార్‌, గ్రౌండ్‌ ప్లస్‌ ఐదంతస్తుల్లో 187 పడకలు, పరికరాలతో కూడిన కిచెన్‌, రెస్టారెంటగదుల్లో ఫర్నిచర్‌,  మంచాలు, పరుపులు, దుప్పట్లు ఇతర సామగ్రికి రూ.11 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి పంపినట్టు ఉన్నతాధికారొకరు తెలిపారు. రేపు జరగనున్న స్టాండింగ్‌ కమిటీ ప్రథమ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఎజెండాలోని ఆరో అంశంగా నమోదు చేశారు. ఆమోదం కోసం మీటింగ్‌లో సభ్యులు చర్చించనున్నారు. భవనం, సదుపాయాల కల్పనకయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి. హైదరాబాద్‌కు వచ్చే మహిళలు సురక్షితంగా ఉండేందుకు వీలుగా భవనంలో రక్షణకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.


మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ హయాంలో మున్సుబ్‌దార్‌గా పని చేసిన టిప్పుఖాన్‌ 1910లో నాంపల్లి సరాయి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఉర్దూలో సరాయి అంటే అతిథి గృహం. 1919లో నిర్మాణం పూర్తికాగా, అప్పటికే టిప్పుఖాన్‌ మరణించారు. వ్యాపారాలు, వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చే వారి వసతి, భోజన సదుపాయం కోసం నాంపల్లి స్టేషన్‌ ఎదురుగా దీనిని నిర్మించారు. మూడు రోజుల పాటు వసతి, భోజనం ఉచితంగా అందించేవారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు అనంతరం సరాయిని ప్రభుత్వ అతిథి గృహంగా ఉపయోగించుకున్నారు. నిర్వహణ లోపంతో చారిత్రక కట్టడం శిథిలావస్థకు చేరి కూలిపోయింది. శిథిలాలు తొలగించి అదే స్థలంలో ట్రాన్సిట్‌ డార్మ్స్‌ నిర్మాణం చేపట్టనున్నారు. నగరానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకులకు నామమాత్రపు ధరకు వసతి, భోజనం ఉంటుందని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో పని చేసే మహిళలకు వసతి కల్పించేందుకు ఎంత తీసుకోవాలనే దానిపై ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఓ అధికారి చెప్పారు.

Updated Date - 2021-12-07T16:16:22+05:30 IST