సర్పంచ్‌ అయితే ఎవరికి గొప్ప.. ఏమైనా కలెక్టరువా..!?

ABN , First Publish Date - 2021-04-04T17:32:29+05:30 IST

అనుమతి పత్రాలు అడుగుతావా..? సర్పంచ్‌ అయితే ఎవరికి గొప్ప.. ఏమైనా కలెక్టరువా..?

సర్పంచ్‌ అయితే ఎవరికి గొప్ప.. ఏమైనా కలెక్టరువా..!?

  • ఇసుక తరలింపు ప్రయత్నాన్ని అడ్డుకున్న సర్పంచ్‌
  • సర్పంచ్‌ను స్టేషన్‌కు తరలించిన పోలీసులు
  • సీఐ తనపట్ల దురుసుగా ప్రవర్తించాడని సర్పంచ్‌ ఆరోపణ

నల్గొండ/గుండాల : ఇసుక అక్రమ తరలింపునకు ఓ కాంట్రాక్టర్‌ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లి సర్పంచ్‌ను ఓ కాంట్రాక్టర్‌ తన పలుకుబడిని ఉపయోగించి పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టించాడు. గ్రామస్థులు, సర్పంచ్‌ భిక్షమమ్మ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని బండకొత్తపల్లి గ్రామ పరిధిలోని యశ్వంతపూర్‌ వాగునుంచి మల్లన్నసాగర్‌కు ఇసుక తరలించేందుకు తనకు అనుమతులు ఉన్నాయని ఓ కాంట్రాక్టర్‌ వచ్చి ఇసుకను తరలిస్తుండగా గ్రామస్థులు అడ్డుకుని కోర్డుకు వెళ్లారు. ఇసుక తరలించకుండా కోర్టు నుంచి స్టే ఆర్డర్‌ తెచ్చారు. దీంతో కాంట్రాక్టర్‌ వెళ్లిపోయాడు. ఆ తరువాత హైకోర్టు ఈ కేసును 23జులై 2021 వరకు పెండింగ్‌లో పెట్టింది.


ఇదే తరుణంలో తమకు బస్వాపూర్‌ ప్రాజెక్టుకు ఇసుకను తీసుకువెళ్లడానికి అనుమతి ఉందని శనివారం యంత్రాలను దించి పోలీసుల సహకారంతో మరో కాంట్రాక్టర్‌ ప్రవీణ్‌రెడ్డి బాటలు వేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్‌ గోపాల్‌దాసు భిక్షమమ్మ సంఘటనా స్థలానికి చేరుకుని కోర్డులో కేసు పెండింగ్‌ ఉండగా, గ్రామం నుంచి ఇసుక ఎలా తీస్తారు అని ప్రశ్నించారు. అనుమతి పత్రాలు ఉంటే చూపండని కాంట్రాక్టర్‌ను, పోలీసులను నిలదీశారు. తమనే అనుమతి పత్రాలు అడుగుతావా..? సర్పంచ్‌ అయితే ఎవరికి గొప్ప.. ఏమైనా కలెక్టరువా..? పనులకు ఆటంకం కల్పించవద్దంటూ పోలీసులు.. సర్పంచ్‌ను స్టేషన్‌కు తరలించారు. 


ఇసుక తరలింపు అనుమతి పత్రాలు చూపించాలని అడిగినందుకు సీఐ తనను దుర్భాషలాడాడని, స్టేషన్‌కు తీసుకువచ్చి బెదిరించాడని సర్పంచ్‌ ఆరోపించారు. కాంట్రాక్టరు, అధికారులపై మానవహ క్కుల సంఘానికి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సర్పంచ్‌ భిక్షమమ్మ తెలిపారు. ఈ విషయమై సీఐ బాలాజీవరప్రసాదన్‌ను వివరణ కోరగా, ప్రాజెక్టుల కోసం ఇసుక తీసుకువెళ్లేం దుకు కాంట్రాక్టర్‌ అనుమతి తీసుకున్నాడని, అందులో భాగంగా తాము విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ విధులకు ఆటంకం కలిగించినందుకు సర్పంచ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు.

Updated Date - 2021-04-04T17:32:29+05:30 IST