ఈటలతో 22 గ్రామాల సర్పంచ్‌లు

ABN , First Publish Date - 2021-05-08T08:05:18+05:30 IST

మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు మద్దతు ప్రకటించారు.

ఈటలతో 22 గ్రామాల సర్పంచ్‌లు

  • వీణవంకకు చెందిన పలువురు ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు భేటీ
  • ఈటలను కలిసిన టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ  
  • ఓయూ విద్యార్థుల మద్దతు


వీణవంక/కామారెడ్డి/మేడ్చల్‌/ఉప్పల్‌, మే7(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు మద్దతు ప్రకటించారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలో 26 గ్రామాలు ఉండగా.. 22 గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు శుక్రవారం హైదరాబాద్‌ శివారు శామీర్‌పేటలోని ఈటల నివాసంలో ఆయనను కలిసి తమ సంఘీభావాన్ని తెలిపారు. 26 గ్రామాలకు చెందిన పలువురు ఎంపీటీసీలు, ఓ జడ్పీటీసీ, మాజీ సర్పంచ్‌లు, ముఖ్య అనుచరులు, టీఆర్‌ఎ్‌సకు చెందిన ముఖ్య కార్యకర్తలు సుమారు 300 మంది ఈటలను కలిశారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణపై ఈటల వారితో చర్చించినట్లు తెలిసింది. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని, ఎవరెన్ని భయబ్రాంతులకు గురిచేసినా భయపడద్దని వారికి భరోసా ఇచ్చినట్లు సమాచారం. ‘మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా కట్టుబడి ఉంటాం’ అని వారంతా ఈటలతో అన్నట్లు తెలిసింది. మరోవైపు.. టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి గురువారం రాత్రి ఈటలను కలిశారు. మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌ కూడా ఈటలతో భేటీ అయ్యారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్వామిగౌడ్‌ ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థులు ఈటలను కలిసి సంఘీభావాన్ని ప్రకటించారు.


హుజూరాబాద్‌ ఆర్డీవో కూడా బదిలీ

మాజీ మంత్రి ఈటలకు రాష్ట్ర సర్కార్‌ మరో షాక్‌ ఇచ్చింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌ ఆర్డీవోను కూడా బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ జీవో జారీ చేశారు. ఆ స్థానంలో నర్సాపూర్‌ ఆర్డీవోగా పనిచేస్తున్న సి.హెచ్‌. రవీందర్‌రెడ్డికి పోస్టింగ్‌ ఇచ్చింది. ఇప్పటికే హుజూరాబాద్‌ ఏసీపీని బదిలీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. కొంతకాలంగా పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న సి.శ్రీనివాసులుకు హైదరాబాద్‌ జిల్లా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. వెయిటింగ్‌లో ఉన్న బి.శ్రీరాములుకు ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు ఆర్డీవోగా ఎల్‌.రమేశ్‌కు పోస్టింగ్‌ ఇచ్చారు. 

Updated Date - 2021-05-08T08:05:18+05:30 IST