నారు, నాట్లు మునక

ABN , First Publish Date - 2020-08-11T10:45:29+05:30 IST

సార్వా సాగు ఆరంభంలో నారు మడులు నీట మునిగాయి. ఎలాగో తేరుకున్నాయి.

నారు, నాట్లు మునక

రొయ్యకు తెల్లమచ్చ వ్యాధి

రైతులకు తప్పని తిప్పలు


భీమవరం రూరల్‌ / పాలకొల్లు రూరల్‌, ఆగస్టు 10 : సార్వా సాగు ఆరంభంలో నారు మడులు నీట మునిగాయి. ఎలాగో తేరుకున్నాయి. మెట్ట ప్రాంతాల్లో నాట్లు కూడా మునిగినా వర్షాలు ఆగడంతో రైతులు అతి కష్టంమీద పంట రక్షించుకున్నారు. ప్రస్తుం మరోసారి వర్షాలు పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆక్వా రంగం కూడా అతలాకుతలం అవుతోంది. కరోనా ప్రభావంతో ఎగుమతులు లేక చేపలు, రొయ్యల ధరలు పతనం కావడంతో రైతులు నష్టాలు చవిచూశారు. ప్రస్తుతం వర్షాలతో రొయ్యకు తెల్లమచ్చ వ్యాధి సోకడం రైతుపై మరో దెబ్బ పడింది. సుమారు నెల రోజుల నుంచి మేఘాలు, ఎండ, వర్షంతో ఇటు ఆక్వా.. అటూ వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో భారీ వర్షాలు ఏకధాటిగా కురిశాయి. ఈ నెలలో అల్పపీడనంతో వర్షాల కారణంగా వరి, రొయ్య సాగుకు ప్రతికూలంగా మారింది.


మునిగిన వరి రైతు

సార్వా సాగు ఆరంభం నుంచి ఒడిదుడుకులతో సాగుతోంది. ప్రస్తుతం అల్పపీడనంతో కురుస్తున్న వర్షాలకు పల్లపు ప్రాంత చేలకు ముంపు పొంచి ఉంది. గడిచిన రెండు రోజులలో వర్షపాతం తక్కువ నమోదు కావడం కొంత ఊరట. అయినప్పటికి ఇంకా వర్షాలు పడితే ముంపు తప్పదని రైతులు ఆందోళనలో ఉన్నారు. జిల్లాలో 2లక్షల 32 వేల హెక్టార్‌లలో సార్వా సాగు సాగుతుండగా ఇప్పటి వరకు అధికారులు లెక్క ప్రకారం 1లక్ష 50వేలు హెక్టార్‌లలో నాట్లు పడ్డాయి. ఆరంభంలో వర్షాల కారణంగా సార్వా నాట్లు జాప్యమయ్యాయి. ఏకధాటి వర్షాలు నాట్లు వేయడానికి కూలీలు రాకుండా పనికి ఆకంకం కలిగిస్తున్నాయి. ఆదిలో నారుమడులు దెబ్బతినడం వలన భీమవరం, వీరవాసరం, కాళ్ళ, ఆకివీడు, పాలకోడేరు, నరసాపురం మండలాలతో పాటు పలు మండలాలు మరోసారి నారుమడులు వేయడం ఆ నారుమడులు ఈనెలాఖరున నాట్లు పడనున్నాయి. దీంతో సార్వా సాగు వర్షాలు వలన ముందు వెనకగా సాగుతుంది.


రొయ్యకు తెల్ల మచ్చ

వాతావరణం ప్రతికూలం కావడంతో రొయ్యలకు తెల్ల మచ్చ వ్యాఽధి సోకుతోంది. జిల్లాలో 90 వేలు ఎకరాలలో రొయ్య సాగు చేస్తుండగా 60 శాతంపైగా సాగు నెలరోజుల నుంచి మొదలైంది. దీంతో పిల్ల దశలో వాతావరణం అనుకూలత లేకపోవడం, సీడ్‌ నాణ్యత లేకపోవడం రైతులకు ఎదురు దెబ్బ. ప్రస్తుత వాతావరంణంలో రొయ్య వైరస్‌ బారిన పడుతోంది. మరొ ప్రక్క రెండు రోజులుగా వాతావరణం మారడం రొయ్యసాగుకు ప్రతికూలమని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం, తెగుళ్లు, దళారుల చేతివాటంతో రైతులు నష్టాల బారిన పడుతున్నారు.


ఇదే అదునుగా రొయ్యల కంపెనీలు సిండికేటుగా మారి నిర్ధిష్ట ధరల కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాధికారులు మాత్రం ప్రతి కొనుగోలు పర్యవేక్షిస్తున్నామని, తక్కువ ధరకు కొన్నట్లు తెలిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలు చేస్తున్నారు. రొయ్యల చెరువులో వేసేందుక రొయ్యల మేతను, మందులను రైతులు కొంత మంది దళారుల వద్ద అరువు తీసుకోవడం వలన వారు చెప్పిన ధరకే విక్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు మేత ధరలు ఆకాశాన్నంటితే రొయ్య ధర పాతాళానికి పడిపోతోంది. 


ప్రభుత్వమే నాణ్యమైన సీడ్‌ అందించాలి..శీలం సూరిబాబు, రొయ్య రైతు, గోరింటాడ 

రొయ్య రైతుకు ప్రభుత్వమే నాణ్యమైన సీడ్‌ అందిస్తే తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవడంతోపాటు, రొయ్యల రైతులు నష్టాల నుంచి బయట పడే అవకాశం ఉంటుంది. రొయ్యల మేత, మందుల ధరలు నియంత్రించి రైతులకు ఉపశమనం కలిగించాలి. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్న పద్ధతిలో రొయ్యలు కొనుగోలు చేస్తే బాగుంటుంది.


కొనుగోళ్లపై పర్యవేక్షణ..వానపల్లి సత్యనారాయణ, మండల మత్స్యశాఖ అబివృద్ధి అధికారి, పాలకొల్లు

రొయ్య రైతులు నష్టం లేకుండా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ప్రతి రొయ్యల కంపెనీ వద్ద ఒక అధికారిని నియమించి కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నాం. ఎవరైనా తక్కువ ధరకు కొనుగోలు ప్రయత్నం చేస్తే ఏలూరులో కాల్‌ సెంటర్‌కు నేరుగా రైతు ఫిర్యాదు చేయవచ్చు. రైతు భరోసా కేంద్రాల ద్వారా చేపల మేత, మందులు అందజేస్తున్న ప్రభుత్వం త్వరలో రొయ్య మేత, మందులు అందించే యోచనలో ఉంది.

Updated Date - 2020-08-11T10:45:29+05:30 IST