జ్వరాలపై సమగ్ర సర్వే

ABN , First Publish Date - 2021-05-18T06:47:55+05:30 IST

జ్వరాలపై ఇంటింటి సర్వేను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అన్నారు. అలా చేయని వలంటీర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జ్వరాలపై సమగ్ర సర్వే
సర్వేలో భాగంగా మహిళతో మాట్లాడుతున్న కలెక్టర్‌

ఇంటింటి సర్వే చేయని వలంటీర్లపై చర్యలు 

కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశం

పెదపట్టపుపాలెం(ఉలవపాడు), మే 17: జ్వరాలపై ఇంటింటి సర్వేను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అన్నారు. అలా చేయని వలంటీర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలంలోని పెదపట్టపుపాలెం సచివాలయాన్ని  సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. సర్వేకు సంబంధించి పెదపట్టపుపాలెం గ్రామంలో వలంటీర్ల మొబైల్‌ యాప్‌లో ఇప్పటివరకు 50 శాతమే నమోదైందని అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఇంటింటి సర్వేలో స్వయంగా ఓ మహిళతో  కలెక్టర్‌ మాట్లాడారు. ఆ మహిళకు వైద్యాధికారి చేత ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయించగా నెగెటివ్‌ వచ్చింది. సదరు మహిళకు కరోనా లక్షణాలు ఉన్నట్లు వలంటీర్‌ యాప్‌లో ఐదురోజుల క్రితం నమోదైంది. పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదైన ఏరియాలను కంటైన్మెంట్‌ జోన్‌లుగా ప్రకటించాలన్నారు. ప్రస్తుతం పెదపట్టపుపాలెంలో 9 పాజిటీవ్‌ కేసులు ఉన్నట్టు కలెక్టర్‌ చెప్పారు. గ్రామస్థులు ఎవరూ ఊరు దాటి పోరాదని కరోనా కట్టడిలో భాగంగా  దురాయి వేసుకున్న విషయం తెలుసుకున్న కలెక్టర్‌ అభినం దించారు. ఇతర గ్రామాలు కూడా పెదపట్టపుపాలెంను ఆదర్శంగా తీసుకోని కరోనా కట్టడికి పాటు పడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కె.సంజీవరావు, ఎంపీడీవో టి.రవికుమార్‌, కరేడు పీహెచ్‌సీ వైద్యుడు కె.శ్రీనివాసరావు, చాకిచర్ల పీహెచ్‌సీ వైద్యురాలు రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

లింగసముద్రం : మండలంలోని పలు గ్రామాలలో ఉన్న వలంటీర్లు, ఆశా వర్కర్లు వారికి కేటాయించిన 50 ఇళ్లలో ఎవరికైనా జ్వరం ఉంటే వెంటనే తెలియజేయాలని తహసీల్దార్‌ ఆర్‌.బ్రహ్మయ్య చెప్పారు. సోమవారం జరిగిన జ్వరాల సర్వేను తహసీల్దార్‌ బ్రహ్మయ్య అన్నె బోయినపల్లి, చినపవని గ్రామ పంచాయతీలలో పరిశీలించారు. జ్వరాల గురించి తెలిసిన వెంటనే ఏఎన్‌ఎంల ద్వారా వారి ఇంటి వద్దనే ర్యాపిడ్‌ కిట్ల ద్వారా కరోనా పరీక్ష చేస్తారని చెప్పారు. ఈ పరీక్షలలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచి మందులు, సరుకులు సరఫరా చేస్తారన్నారు. వలంటీర్లు, ఆశావర్కర్లు తమ విధులు సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు సహకరిస్తే కరోనాను నివారించవచ్చునని తహసీల్దార్‌ పేర్కొన్నారు.

సింగరాయకొండ : కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారు వెంటనే వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని ఎంపీడీవో షేక్‌ జమీవుల్లా సూచిం చారు. స్థానిక గొల్లపాలెంలో నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వేను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. అత్యవసరాల మేరకే ఇంటి నుంచి బయటకు రావాలని, భౌతిక దూరం పాటించాలని, మాస్కును తప్పక ధరించాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఆరోగ్యపర్యవేక్షకుడు సయ్యద్‌ మసూద్‌ అలీ, కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఏఎన్‌ఎంలు భారతి, ఆరిఫా, జాలమ్మ, వలంటీర్‌ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

కరోనా లక్షణాలున్న వారిని గుర్తించాలి: ఎంపీడీవో

కనిగిరి, మే 17: ఫీవర్‌ సర్వేలో భాగంగా సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటినీ సందర్శించి కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలని ఎంపీడీవో మల్లికార్జునరావు సూచించారు.  సోమవారం ఆయన చినఅలవలపాడు, తక్కెళ్లపాడు గ్రామాల్లో జరుగుతున్న సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. కరోనా లక్షణాలు  ఉన్నా అనేక మంది పరీక్షలు చేయించుకోవడానికి భయపడుతున్నారన్నారు. అలాంటి వారికి అవగాహన కల్పించాలన్నారు.  ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి, సచివాలయ, వైద్యసిబ్బంది ఉన్నారు.

పీసీ.పల్లి : ఫీవర్‌ సర్వే  కొనసాగుతోంది. మండలంలో 7438 కుటుంబాలు ఉండగా సోమవారం నాటికి 2289 కుటుంబాల్లోని వ్యక్తుల ఆరోగ్య వివరాలన సేకరించారు. 44 మంది జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వారికి కొవిడ్‌ పరీక్షలు చేయగా 9మందికి పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని అధికారులు తెలిపారు. 

సీఎస్‌పురం : ఫీవర్‌ సర్వేను సక్రమంగా నిర్వహించాలని ఈవోఆర్డీ సుందరరామయ్య సూచించారు. మండలంలోని వివిధ గ్రామాలలో జరుగుతున్న  సర్వేను ఆయన సోమవారం  పరిశీలించారు.

Updated Date - 2021-05-18T06:47:55+05:30 IST