నిర్బంధ సర్వే!

ABN , First Publish Date - 2020-12-02T05:05:25+05:30 IST

రైతుబంధు పథకానికి ప్రభుత్వం సమగ్ర పంట సర్వే పేరిట ముకుతాడు భిగించబోతోందంటున్నారు. యాసంగి పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేసేందు కు రైతులు తాము పండించే పంటల వివరాలను తప్పనిసరిగా ఏఈవోల వద్ద నమోదు చేసుకోవాలన్న నిబంధనను నిర్బంధం చేస్తున్నారు.

నిర్బంధ సర్వే!
సారంగాపూర్‌ మండలం కౌట్ల(బి) పంట వివరాలను నమోదు చేయించుకుంటున్న రైతులు

సమగ్ర పంట సర్వేతో ‘రైతుబంధు’కు లింకు 

సర్కారు కొనుగోళ్ల పేరిట కొత్త ఎత్తుగడ 

వివరాలు నమోదు చేయించుకున్న వారికే పథకం ప్రయోజనాలు 

రంగంలోకి దిగిన ఏఈవోలు 

జిల్లాలో యాసంగి పంట లక్ష్యం 2,36,975 లక్షల ఎకరాలు 

నిర్మల్‌, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): రైతుబంధు పథకానికి ప్రభుత్వం సమగ్ర పంట సర్వే పేరిట ముకుతాడు భిగించబోతోందంటున్నారు. యాసంగి పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేసేందు కు రైతులు తాము పండించే పంటల వివరాలను తప్పనిసరిగా ఏఈవోల వద్ద నమోదు చేసుకోవాలన్న నిబంధనను నిర్బంధం చేస్తున్నారు. తాము జరిపే రైతు సమగ్ర సమాచార సేకరణ సర్వే కేవలం యాసంగి సీజన్‌ పంటల కొనుగోళ్ల కోసమేనంటున్న అధికారులు.. దీని వెనక దాగి ఉన్న అసలు నిజాన్ని వెల్లడించలేకపోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంటలకు సంబం ధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని ఏఈవోలు పకడ్బందీగా సేకరిస్తూ ఎప్పటికప్పుడు ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లో ఏఈవోలు ఈ సమాచార సేకరణ సర్వేను కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు రైతుబంధు పథకాన్ని, పంటలు సాగు చేసిన రైతులతో పాటు సాగు చేయని రైతులు కూడా పొందుతూ వస్తున్నారు. చాలామంది ఎలాంటి పంటలను సాగు చేయకుండానే ఖాళీగా ఉన్న తమ భూములను చూపి తప్పుడు నివేదికలతో రైతుబంధు డబ్బులను పొందుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. దీని కారణంగా వాస్తవంగా పంటలను సాగు చేసే రైతులు పంటలను సాగు చేయని రైతులు ఒకే చోటకు చేరుకుంటున్నారు. అయితే ఏఈవోలు రైతు సమగ్ర సమాచార సేకరణ నివేదికలను ఓవైపు సంబంధిత శాఖకే కాకుండా, పూర్తి వివరాలను సంబంధిత రైతులకు వారి మోబైల్‌కు అందిస్తున్నారు. దీంతో పంటలు సాగు చేసే రైతుల మోబైల్‌ ఫోన్‌లకు మాత్రమే సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా వ్యవసాయాధికారు లు మాత్రం తాము జరుపుతున్న సర్వే రైతుబంధు కోసం కాదని, కేవలం యాసంగి పంటల కొనుగోలుకు మాత్రమేనంటూ స్పష్టం చేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలో ఈ సారి యాసంగి సీజన్‌కు గాను మొత్తం 2,36,975 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే గతంలో ఎన్నడూ చేయని విధంగా సీజన్‌ వారి పంట సాగు వివరాలను అధికారులు సేకరిస్తుండడం పట్ల పలుచోట్ల రైతులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి సర్వే చేపట్టడం వెనక అంతర్యమేంటోనన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయంటున్నారు. అధికారులు మాత్రం మద్దతుధరతో చేపడుతున్న పంటల కొనుగోలు వ్యవహారాల్లో అవకతవకలు జరగకుండా చూసేందుకు ఈ సర్వే చేపడుతున్నామని, సర్వేలో నమోదైన వివరాల ప్రకారం పంటల కొనుగోలు జరుపుతామంటూ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

సమాచార సేకరణ సర్వేలో ఏఈవోలు

ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సమాచార సేకరణ సర్వేలో జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన ఏఈవోలు నిమగ్నమయ్యారు. ప్రత్యేకంగా రూపొందించిన ఫార్మాట్‌ ఆధారంగా ఈ సర్వేను చేపడుతున్నారు. ప్రతీ గ్రామంలో తమ వద్ద ఉన్న వివరాల ఆధారంగా రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి వారి పంట పొలాలను పరిశీలించిన తరువాతనే వివరాలను నమోదు చేస్తున్నారు. కాగా నిర్బంధ సాగు విధానానికి అనుగుణం గా రైతుల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్న అధికారులు వెంటనే ఆ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసి సర్కారుకు పంపుతున్నారు. దీంతో పాటు రైతులు  వెల్లడించిన పంటల వివరాలను అధికారికంగా గుర్తించినట్లు వారి మోబైల్‌ ఫోన్‌లకు వివరాలను మెసేజ్‌ రూపంలో పంపుతున్నారు. అయితే గ్రామాల్లో కొంతమంది రాజకీయంగా పలుకుబడి గల వ్యక్తులు పంటలు సాగు చేయకున్న చేసినట్లుగా ఏఈవోలపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఏఈవోలు మాత్రం క్షేత్రస్థాయిలో పంటల సాగు ను పరిశీలించిన తరువాతనే ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియను చేపడుతున్నారు. 

యాసంగి లక్ష్యం 2.36 లక్షల ఎకరాలు

కాగా ఖరీఫ్‌ పంటల కొనుగోలు ప్రక్రియ మొదలు అవుతున్న నేపథ్యంలోనే అధికారులు యాసంగి పంట ల సాగు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈసారి జిల్లాలో 2,36,975 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో నుంచి ధాన్యం 85,607ఎకరాలు, గోధు మ 1,683 ఎకరాలు, జొన్న 10,186 ఎకరాలు, శనగలు 84,203 ఎకరాలు, వేరుశనగ 7,457 ఎకరాలు, నువ్వు 28,976 ఎకరాలు, కుసుమ 3,545 ఎకరాలు, ఆవాలు 11,155 ఎకరాలతో పాటు దాదాపు వెయ్యి ఎకరాల్లో కూరగాయల పంటల సాగును లక్ష్యంగా నిర్ధారించారు. అయితే వానాకాలం సీజన్‌ లో వ్యవసాయ శాఖ నిర్దేశించిన పంటలను మాత్రమే అధికారులు సర్కారు మద్దతుధరతో కొనుగోలు చేయనున్నట్లు వెల్లడిస్తున్నారు. ఇవి కాకుండా మొక్కజొన్న, మరే ఇతర పంటలను సాగు చేసినా వాటికి మాత్రం ప్రభుత్వం మద్దతుధర చెల్లించదని, అలాగే వీటి కోసం కొనుగోలు కేంద్రాలను సైతం ఏర్పాటు చేయబోమని అధికారులు వెల్లడిస్తున్నారు.

సర్వేపై అన్నదాతల సందేహాలు

వ్యవసాయ శాఖ చేపట్టిన రైతు సమగ్ర సమాచా ర సేకరణ సర్వేపై పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి యాసంగిలో అధికారులు పంటల సర్వేను చేపట్టడం వెనక ఆంతర్యమేంటంటున్నారు. రైతుబంధు పథకం నుంచి సాగు చేయని రైతులను మినహాయించేందుకే ఈ సర్వే చేపడుతున్నారన్న వానదలు మొదలయ్యాయి. యాసంగిలో దాదాపు 2.36 లక్షల ఎకరాల్లో ప్రభుత్వం తాము సూచించిన పంటలను మాత్రమే సాగు చేయాలని నిర్దేశించింది. దీనికి అనుగుణంగా పంటలను సాగు చేయని వారికి సర్కారు పరంగా అందే ఏఒక్క ప్రయోజనాన్ని కూడా అందించలేరంటున్నారు. చాలాచోట్ల ఏఈవోలు నిర్వహిస్తున్న సర్వేపై రైతులు రకరకాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచా రం. ముఖ్యంగా జిల్లాలో దాదాపు చాలామంది రైతులకు ఇప్పటి వరకు డిజిటల్‌ పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు అందలేదు. అధికారులు మాత్రం తాము సర్వే చేపడుతున్న స మయంలో పట్టాదార్‌ పాస్‌ పుస్తకం వివరాలను అడుగుతుండడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. పట్టాదార్‌ పాస్‌ పుస్తకం లేని రైతుల సమాచార పత్రంలో పాస్‌ పుస్తకం నెంబర్‌ను నమోదు చేయకపోతుండ డం గందరగోళానికి దారి తీసే అవకాశాలున్నాయంటున్నారు. మొత్తానికి సమగ్ర పంట సర్వే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆందోళన రైతాంగంలో మొదలైంది.

Updated Date - 2020-12-02T05:05:25+05:30 IST