ససేమిరా

ABN , First Publish Date - 2020-11-26T06:21:39+05:30 IST

‘‘జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాటైన రసాయన, ఔషధ పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ససేమిరా
ప్రజాభిప్రాయ సేకరణ వద్దంటూ నినాదాలు చేస్తున్న సీపీఎం నాయకులు సీహెచ్‌ నరసింగరావు, తదితరులు

రసాయన పరిశ్రమలు..వద్దంటే వద్దు

‘నక్కపల్లి పారిశ్రామిక పార్కు’పై ఏర్పాటుచేసిన ప్రజాభిప్రాయ

సేకరణ సభలో తేల్చిచెప్పిన నిర్వాసిత గ్రామాల ప్రజలు

కాలుష్యంతో ప్రాణాలు తీయొద్దు

ఇప్పటికే హెటిరో కాలుష్యంతో చచ్చిపోతున్నాం

పరిశ్రమ రాకముందు ఒక మాట... తరువాత మరోమాట చెబుతున్నారు

స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి కూడా కల్పించడం లేదని ధ్వజం

తీరంలో పరిశ్రమలతో జీవనోపాధి కోల్పోయాం

మత్స్యకారుల ఆవేదన

భూములకు నష్టపరిహారం చెల్లింపుల్లో పక్షపాతం

డి.పట్టా, సాగు భూములకు పరిహారం ఇవ్వలేదు



విశాఖపట్నం/నక్కపల్లి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి):

‘‘జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాటైన రసాయన, ఔషధ పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పరిశ్రమల్లోని వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదిలేస్తుండడంతో సాగర జలాలు కలుషితమై మత్స్యసంపద నశించిపోతున్నది.

చేపల వేట తగ్గిపోయి మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఎటువంటి రసాయన, ఔషధ పరిశ్రమలను ఏర్పాటు చేయవద్దు’’ 

- ఇదీ నక్కపల్లి మండలంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుపై స్థానికులు వెలిబుచ్చిన అభిప్రాయం

విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో భాగంగా నక్కపల్లి మండలంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు సంబంధించి బుధవారం రాజయ్యపేట వద్ద జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, డీఎల్‌ పురం, వేంపాడు, చందనాడ గ్రామాలకు చెందిన ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఆరోగ్యాన్ని దెబ్బతీసి, ప్రాణాలను హరించే రసాయన పరిశ్రమల ఏర్పాటును మాత్రం అంగీకరించేది లేదని తెగేసి చెప్పేశారు. ఇప్పటికే హెటిరో డ్రగ్స్‌ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, వ్యర్థ జలాలతో ఈ ప్రాంతమంతా కాలుష్యకాసారంగా మారిందని, రోగాలతో చస్తూ బతుకుతున్నామని స్థానికులు వాపోయారు. ఇటువంటి తరుణంలో మరికొన్ని రసాయన పరిశ్రమలను ఏర్పాటుచేయడం తగదన్నారు. ఆయా యాజమాన్యాలు, అధికారులు...పరిశ్రమలను ఏర్పాటుచేసే ముందు, తరువాత చెప్పే మాటలకు పొంతన వుండడం లేదని పలువురు నాయకులు పేర్కొన్నారు. ‘ఏరు దాటే వరకు ఓడ మల్లన్న...ఏరు దాటిన తరువాత బోడి మల్లన్న’ సామెతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రసాయన, ఔషధ, పెట్రో కెమికల్స్‌ కాకుండా, కాలుష్యం వెదజల్లని ఇతర పరిశ్రమలను ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు.  ప్రజాభిప్రాయ సేకరణ చేసే ముందు ఈ ప్రాంతంలో ఏర్పాటుచేసే పరిశ్రమ, దానికి సంబంధించి    ఈఐఏ నివేదిక వెల్లడించాల్సి వుంటుందని, కానీ ఇక్కడ అటువంటి    సంప్రదాయాన్ని ఎందుకు పాటించలేదని పలువురు ప్రశ్నించారు.


నష్ట పరిహారంలో పక్షపాతం

భూసేకరణ చట్టం-2013 ప్రకారం డి.పట్టా భూములకు కూడా నిర్ణీత మొత్తంలో నష్టపరిహారం ఇవ్వాలని, కానీ ఇక్కడ అధికారులు పక్షపాతం చూపుతున్నారని వామపక్షాల నేతలు ఆరోపించారు. ఇళ్లు, చెట్లకు పరిహారం విషయంలో జరిగిన అన్యాయాన్ని పలువురు నిర్వాసితులు...అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. డి.పట్టా, సాగులో వున్న భూములకు కూడా జిరాయితీ భూములతో సమానంగా పరిహారం ఇస్తామని చెప్పిన అధికారులు మాట తప్పారని ఆవేదన వ్యక్తంచేశారు.


తప్పులు తడకగా నివేదిక

పారిశ్రామిక పార్కులో ఏర్పాటయ్యే పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, తదితర అంశాలపై ఎల్‌అండ్‌టీ సంస్థ రూపొందించిన నివేదిక తప్పులు తడకగా వుందని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ఆ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ఉద్యోగాలు రావని, ఇందుకు హెటిరో కంపెనీయే ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాటుచేసిన హెటిరో, డెక్కన్‌ పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, భవిష్యత్తులో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో కూడా ఇదే పరిస్థితి వుంటుందని అన్నారు. సముద్రతీరం మొత్తం బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టేందుకే కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఆగమేఘాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారని ఆక్షేపించారు. వేల మంది సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నారని, రసాయన పరిశ్రమల ఏర్పాటుతో వీరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని రాజయ్యపేట, బోయపాడు, మూలపర్ర, పాటిమీద గ్రామాల మత్స్యకారులు ఆవేదన వెలిబుచ్చారు. తమకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వకపోతే సముద్రంలో మునిగిచావడం తప్ప మరో గత్యంతరం లేదని వాపోయారు. పంటల సాగులో రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడొద్దని, ప్రకృతి వ్యవసాయం చేయమని చెబుతున్న పాలకులు...రసాయన పరిశ్రమల ఏర్పాటును ఎందుకు ప్రోత్సహిస్తున్నారని డీఎల్‌పురం గ్రామానికి చెందిన పలువురు రైతులు ప్రశ్నించారు. 

భారీ బందోబస్తు సుమారు మూడున్నర గంటలపాటు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, బీజేపీ నాయకుడు తోట నగేశ్‌, సీపీఎం నాయకులు సీహెచ్‌ నరసింగరావు, లోకనాథం, అప్పలరాజు, టీడీపీ నాయకులు కొప్పిశెట్టి వెంకటేశ్‌, బుజ్జి, మత్స్యకార నాయకులు, తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తొలుత కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సుభాన్‌ షేక్‌ ప్రజాభిప్రాయ సేకరణ ఉద్దేశాన్ని వివరించారు. అనంతరం ఏపీఐఐసీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ నాగేశ్వరరావు మాట్లాడుతూ, మొత్తం 3,899 ఎకరాల్లో పారిశ్రామిక పార్క్‌ వస్తుందని, రూ.లక్ష కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని, ప్రత్యక్షంగా 30 వేల మందికి, పరోక్షంగా 70 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. పర్యావరణ ప్రభావ నివేదికపై ఎల్‌అండ్‌టీ ప్రతినిధి సుశృత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌ ఎన్‌.మౌర్య, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్‌ సిన్హా ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

  

నష్టపరిహారంపై వాస్తవాల నిర్ధారణకు గ్రామానికో డిప్యూటీ కలెక్టర్‌

- జేసీ వేణుగోపాల్‌రెడ్డి

నక్కపల్లి పారిశ్రామిక పార్కుకు అవసరమైన భూసేకరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్టు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా వెల్లడైందని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. రాజయ్యపేట వద్ద నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, భూములకు పరిహారం అందలేదని పలువురు చెప్పిన దానిపై వాస్తవాలను నిర్ధారించేందుకు గ్రామానికి ఒకరి చొప్పున డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తున్నట్టు తెలిపారు. ఇళ్ల పరిహారం విషయంలో కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. డి.పట్టా భూములకు పరిహారం విషయంలో సరైన ప్యాకేజీ అందలేదని రైతులు చేసిన ఫిర్యాదును పరిశీలించి, వారికి అన్యాయం జరగకుండా చూస్తానని భరోసా ఇచ్చారు. పరిశ్రమలు రావడం ఆవశ్యమని, కాలుష్యం లేకుండా తగు చర్యలు తీసుకుంటామని జేసీ చెప్పారు.

Updated Date - 2020-11-26T06:21:39+05:30 IST