శశికళ వైపు బీజేపీ చూపు?

ABN , First Publish Date - 2021-01-11T12:28:40+05:30 IST

త్వరలో విడుదల కానున్న చిన్నమ్మ శశికళను మచ్చిక చేసుకునేందుకు బీజేపీ సిద్ధమైందా? రజనీ లేని లోటును ఆమెతో పూడ్చాలని కమలదళం భావిస్తోందా? ఇప్పటికీ అన్నాడీఎంకే నేతలపై ఆధిపత్యం ...

శశికళ వైపు బీజేపీ చూపు?

 రజనీ లేకపోవడంతో చిన్నమ్మపై దృష్టి సారించిన కమలదళం

 మరోవైపు ఓపీఎస్‌తోనూ మంతనాలు!

 రాజకీయాల్లో ఉత్కంఠ


చెన్నై: త్వరలో విడుదల కానున్న చిన్నమ్మ శశికళను మచ్చిక చేసుకునేందుకు బీజేపీ సిద్ధమైందా? రజనీ లేని లోటును ఆమెతో పూడ్చాలని కమలదళం భావిస్తోందా? ఇప్పటికీ అన్నాడీఎంకే నేతలపై ఆధిపత్యం వహించగల చిన్నమ్మతో కలిసి సాగుదామని వ్యూహరచన చేసిందా? కనిపిస్తున్న పరిణామాలు, రేగుతున్న అనుమానాలు పరిశీలిస్తుంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. బీజేపీలోని కొంతమంది నేతలు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శశికళ కలిసి సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే శశికళ ‘అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం’ అధ్యక్షురాలిగా బీజేపీతో కలిసి పనిచేస్తారా? లేక ‘మరోలానా’ అన్నదానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ మొత్తం వ్యవహారం అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 


రజనీ లేకపోవడంతో...

ఎలాగైనా రాష్ట్రంలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ ఎత్తులకు పైయెత్తులు వేస్తోంది. తాము అను కున్నది జరగనిపక్షంలో వెంటనే వ్యూహం మారుస్తోం ది. కాగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాలవైపు కన్నెత్తి చూడనని చేసిన ప్రకటనతో బీజేపీ నేతలు నిరుత్సాహపడినట్టే కనిపిస్తున్నారు. రజనీ పార్టీ పెడి తే ఆయన్ని బూచిగా చూపి... అన్నాడీఎంకేను నయా నో భయానో బెదిరించి సగానికి సగం సీట్లు పొంది బిహార్‌ బాణీలో గెలవాలని బీజేపీ వ్యూహరచన చేసినట్టు తెలిసింది. అయితే రజనీ రాజకీయాల్లోకి రానని ప్రకటించడంతో బీజేపీ తొలి పథకం నీరుగారిపోయింది. రజనీ ప్రకటన అన్నాడీఎంకే, డీఎంకే వర్గాలలో సంతోషాన్ని కలిగించగా బీజేపీ మాత్రం నిరుత్సాహపడింది. ఈ పరిస్థితుల్లో శశికళ విడుదల బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం రేపినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో శశికళను తెరపైకి తీసుకొచ్చి తమిళ రాజకీయ చదరంగంలో పావులు కదపడానికి ఆ పార్టీ సిద్ధమవుతోంది. తమిళనాట హిందుత్వ సిద్ధాంతాలతో కాలుమోపడం కష్టమని బీజేపీ ఎప్పుడో గ్రహించింది. తమిళనాట అధికారానికి చేరువ కావాలంటే అధికార అన్నాడీఎంకేపై పట్టుబిగించడం మినహా మరో గత్యంతరం లేదని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా శశికళ ద్వారా అన్నాడీఎంకేపై పైచేయి సాధించాలని ఆ పార్టీ యోచిస్తున్నట్టు కనిపిస్తోంది. 


శశికళ మొగ్గు ఎటువైపు?

రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఆఖరి క్షణంలో తనకు దక్కనీయకుండా అడ్డుపడి అక్రమార్జన కేసులో జైలుకు పంపిన బీజేపీపై శశికళ కత్తికడతారా లేక అవసరార్థం కలసి సాగుతారా అన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అయితే కళ్ల ముందు భయపెడుతున్న కేసులు, తనకున్న కోట్లాది రూపాయల ఆస్తులను కాపాడుకునేందుకు శశికళ బీజేపీ సూచనను కాదనలేరని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఏ విధంగా ఆమె బీజేపీతో కలసి సాగుతారన్నదానిపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి శశికళ ముందున్న మార్గాలు.. ఆర్కేనగర్‌ శాసనసభ్యుడు టీటీవీ దినకరన్‌ నడుపుతున్న అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం పార్టీ అధ్యక్షురాలిగా పదవీ స్వీకరించడం, లేదా తనతో చేయి కలిపేందుకు వచ్చే అన్నాడీఎంకే అసమ్మతి నేతలతో కలిసి పార్టీని ప్రారంభించడం. కానీ రెండో మార్గం ఇప్పటికిప్పుడు అసాధ్యమైనందున మొదటి మార్గాన్నే శశికళ ఎన్నుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 


అన్నాడీఎంకేపై గురి...

అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం అధ్యక్షురాలిగా పదవీ స్వీకారం చేయడానికి ముందు అన్నాడీఎంకేను మళ్లీ తన అధీనంలోకి తెచ్చుకునేందుకు శశికళ ముమ్మర ప్రయత్నాలు సాగించటం తథ్యమని ఆమె గురించి బాగా తెలిసిన నేతలు చెబుతున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత శశికళ తమ పార్టీలో సంక్షోభం సృష్టిస్తుందన్న భయం అన్నాడీఎంకే నేతల్లోనూ లేకపోలేదు. ఇప్పటికే కొందరు మంత్రులు, అసంతృప్త శాసనసభ్యులు శశికళ వర్గంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ అందిన ఇంటెలిజెన్స్‌ సమాచారం పాలకుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. మూడు దశాబ్దాలకు పైగా అన్నాడీఎంకేను తన చెప్పుచేతుల్లో ఉంచుకున్న శశికళ... ప్రస్తుతం ఆ పార్టీని కైవసం చేసుకోకుండా ఊరుకోరని ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ తన అధీనంలో తెచ్చుకునేందుకు ఆమె ఇప్పటికే   వ్యూహం రూపొందించుకుని ఉంటారని ఏఎంఎంకే వర్గాలు చెబుతున్నాయి.  అవసరమైతే బీజేపీ సాయాన్ని కూడా పొందటానికి కూడా వెనుకంజ వేయరని తెలుస్తోంది.


ఏ దిశగా ఎడప్పాడి వర్గం?

శశికళ విడుదల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు సంభవించడం తథ్యమని రాజకీయ పరిశీ లకులు చెబుతున్నారు. బీజేపీ మద్దతుతో శశికళ అన్నాడీఎంకేలో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తే సీఎం ఎడప్పాడి  వర్గీయులు ఏం చేయనున్నారు? అలాంటి గడ్డు పరిస్థితి రాకుండా శశికళను స్వాగ తించి పార్టీలో చేర్చుకుంటారా? లేకుంటే శశికళకు వ్యతిరేకంగా ఎడప్పాడి ధర్మయుద్ధం చేయడానికి సిద్ధమవుతారా? లేకుంటే బీజేపీని వ్యతిరేకించినందు వల్లే పార్టీలో చీలికలు తెచ్చారంటూ ఎడప్పాడి ప్రచా రం చేస్తారా? అన్నది వేచిచూడాల్సి ఉంది. మరోవైపు ఆది నుంచి బీజేపీ అగ్రనేతలతో సన్నిహితంగా వున్న ఉపముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం వైఖరి ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. బీజేపీ శశికళతో చేతులు కలిపితే ఓపీఎస్‌ అందుకు భిన్నంగా నడుచుకోబోరని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి వచ్చిందే బీజేపీ అధిష్ఠానం దయతోనని, అందువల్ల ఆ పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా ఆయన నడచుకోరని అన్నాడీఎంకేలోని ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఇప్పటికే బీజేపీ నేతలు సైతం ఓపీఎస్‌తో మంతనాలు జరిపినట్లు  ప్రచారం జరుగుతోంది. 


ఇంతకీ శశికళ జైలు నుంచి విడుదలవుతారా?

ఈనెల 27వ తేదీన పరప్పణ అగ్రహారం జైలు నుంచి విడుదల కావాల్సిన శశికళకు విముక్తి లభిస్తుందా? లేక ఆమె శిక్ష అనుభవిస్తున్నప్పుడు జైలు నుంచి స్వేచ్ఛగా బయటకు వచ్చి షాపింగ్‌ చేశారంటూ నమోదైన కేసును తిరగదోడి లోపలే ఉంచేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అందువల్ల బీజేపీ సూచనలకు శశికళ విముఖత చూపితే.. ఆమె ఈనెల 27న జైలు నుంచి విడుదల కాకపోవచ్చని, అసెంబ్లీ ఎన్నికల వరకు ఆమె అక్కడే ఉండవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తమ్మీద శశికళ ఆగమన వ్యవహారం అన్నాడీఎంకేలో ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. 

Updated Date - 2021-01-11T12:28:40+05:30 IST