శశికళ విడుదలకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2020-11-20T18:01:45+05:30 IST

అక్రమార్జన కేసులో బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదలకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు శశికళకు విధించిన జరిమానా రూ.10.10 కోట్లను బుధవారం బెంగళూరు

శశికళ విడుదలకు రంగం సిద్ధం

చెన్నై : అక్రమార్జన కేసులో బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదలకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు శశికళకు విధించిన జరిమానా రూ.10.10 కోట్లను బుధవారం బెంగళూరు ప్రత్యేకకోర్టులో చెల్లించడంతో ఆమెను ముందస్తుగా విడుదల చేయించేందుకు న్యాయవాది రాజా సెంధూర్‌పాండ్యన్‌ ప్రయత్నాలు ప్రారంభించారు. శశికళను వచ్చే ఏడాది జనవరి 27న విడుదల చేస్తామని ఆర్టీఐ చట్టం ప్రకారం కర్నాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఇదివరకే ప్రకటించారు. అయితే జైలులో శశికళ సత్ప్రవర్తన, ఒకసారి మినహా ఆమె పెరోలును ఎక్కువగా ఉపయోగించకపోవడం, సెలవుదినాలను పరిగణనలోకి తీసుకుంటే 129 రోజులకు ముందే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని న్యాయవాది రాజా సెంధూర్‌పాండ్యన్‌ తెలిపారు. 


శశికళ విడుదలపై ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కర్నాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులేనని ఆయన పేర్కొన్నారు. అక్రమార్జన కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జైలుశిక్షను అనుభవించిన పలువురు విడుదల తేదీకి ముందే విడుదలైన సంఘటనలు ఎన్నో ఉన్నాయని ఆయన చెప్పారు. అంతేకాకుండా రాజా సెంథూర్‌పాండ్యన్‌ గురువారం బెంగళూరులో జైళ్ల శాఖ సూపరింటెండెంట్‌ శేషమూర్తిని కలుసుకుని శశికళ సత్ప్రవర్తన, సెలవుదినాలు, పెరోలును ముప్పావు శాతానికి పైగా వినియోగించకపోవడం తదితర అంశాలతో ఆమెను మరింత ముందుగా విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు కూడా సమర్పించారు. కర్నాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు తన దరఖాస్తుపై తక్షణ చర్యలు తీసుకుని శశికళను మరింతముందుగా విడుదల చేస్తారనే నమ్మకం తనకుందని రాజా సెంధూర్‌పాండ్యన్‌ తెలిపారు.


దారిపొడవునా స్వాగత ఏర్పాట్లు

ఇదిలా ఉండగా బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలు నుంచి శశికళ ముందుగానే విడుదలైతే బెంగళూరు నుంచి చెన్నై వరకు దారిపొడవునా ఆమె అనుచరులు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. జైలు నుంచి విడుదలై చెన్నై చేరుకోగానే, వేలాదిమంది కార్యకర్తలను విమానాశ్రయానికి రప్పించి శశికళకు బ్రహ్మాండమైన రీతిలో స్వాగతం పలకాలని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నాయకులు నిర్ణయించారు. ఆ పార్టీ నేత టీటీవీ దినకరన్‌ కూడా శశికళకు పెద్ద ఎత్తున స్వాగత సత్కార సభలు ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. బెంగళూరు నుంచి చెన్నై వరకు దారి పొడవునా 60 చోట్ల శశికళకు ఘనస్వాగతం పలుకనున్నారు. ప్రతిచోటా సుమారు రెండు వేలమంది కార్యకర్తలతో ఆమెకు స్వాగతం పలకాలని ఎఎంఎంకే జిల్లా శాఖల నాయకులు నిర్ణయించారు. ఏది ఏమైనప్పటికీ శశికళ కర్నాటక జైళ్ల శాఖ అధికారులు ఇదివరకే ప్రకటించినట్లు వచ్చే యేడాది జనవరి 27న విడుదల అవుతారా? లేక ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్‌పాండ్యన్‌ చెబుతున్నట్టు అంతకంటే ముందుగా విడుదలవుతారా? అనే విషయంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. వారంలోగా శశికళ ముందస్తు విడుదలపై కర్నాటక జైళ్ల శాఖ అధికారులు తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.

Updated Date - 2020-11-20T18:01:45+05:30 IST