రాజకీయాలకు గుడ్‌బై!

ABN , First Publish Date - 2021-03-04T06:58:42+05:30 IST

‘నాకు ఈ పరిస్థితి కల్పించిన వారిపై పగ తీర్చుకుంటా’ అంటూ నెచ్చెలి జయలలిత సమాధిపై ముమ్మార్లు తట్టి మరీ శపథం చేసిన శశికళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ‘రాజకీయాల నుంచి తప్పుకొంటున్నాను’ అంటూ బుధవారం సాయంత్రం సంచలన ప్రకటన చేశారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు జైలు నుంచి విడుదలైన శశికళ...

రాజకీయాలకు గుడ్‌బై!

శశికళ సంచలన నిర్ణయం

రెండు పేజీల ప్రకటన విడుదల

‘అమ్మ’ పాలన నూరేళ్లూ కొనసాగాలి

డీఎంకే అధికారంలోకి రావొద్దు

పార్టీ శ్రేణులకు శశికళ పిలుపు

స్వాగతించిన బీజేపీ


చెన్నై, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ‘నాకు ఈ పరిస్థితి కల్పించిన వారిపై పగ తీర్చుకుంటా’ అంటూ నెచ్చెలి జయలలిత సమాధిపై ముమ్మార్లు తట్టి మరీ శపథం చేసిన శశికళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ‘రాజకీయాల నుంచి తప్పుకొంటున్నాను’ అంటూ బుధవారం సాయంత్రం సంచలన ప్రకటన చేశారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు జైలు నుంచి విడుదలైన శశికళ... తమిళనాట ఎన్నెన్ని రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తారో... ఎవరిని ముప్పు తిప్పలు పెడతారో అనే ఊహాగానాలు నడుస్తున్న సమయంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘‘తమిళనాట ‘అమ్మ’ స్వర్ణయుగ పాలన నూరేళ్లపాటు కొనసాగాలి. ఇందుకు పార్టీ శ్రేణులంతా ఒక తల్లి బిడ్డల్లా ఐకమత్యంగా పాటుపాడాలి. మన బద్ధశత్రువు, దుష్టశక్తి అయిన డీఎంకే మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే మన ప్రధాన ధ్యేయం కావాలి.


మళ్లీ అమ్మ పాలన వచ్చేందుకు అందరూ పాటుపడాలి’’ అని శశికళ పిలుపునిచ్చారు. జయ ప్రాణాలతో ఉన్నప్పుడు ఆమె ఆశయ సాధన కోసం సోదరిలా ఎలా పాటుపడ్డానో, ఇప్పుడూ అందుకు కట్టుబడి వున్నానని తెలిపారు. తానెప్పుడూ పదవుల కోసం, అధికారం కోసం ఆశపడలేదని స్పష్టం చేశారు. ‘‘చివరిగా మళ్లీ అమ్మ పాలన రావాలని, ఆమె ఆశయాలు నెరవేరాలని ఎల్లప్పుడూ ఆరాధించే పురచ్ఛితలైవి అక్కను వేడుకుంటూ రాజకీయాల నుంచి వైదొలగుతున్నా’’ అని భావోద్వేగ ప్రకటన చేశారు. కాగా శశికళ నిర్ణయం పట్ల ‘అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం’ నేత, ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆమె నిర్ణయం తనకు శోకం మిగిల్చిందన్నారు. అన్నాడీఎంకేను కొంతమంది కబంధ హస్తాల నుంచి విముక్తి చేస్తారని ఆశించానని, కానీ ఆమె నుంచి ఇలాంటి నిర్ణయం వస్తుందని భావించలేదన్నారు. అన్నాడీఎంకే, బీజేపీ మాత్రం శశికళ నిర్ణయాన్ని స్వాగతించాయి. ‘‘శశికళ తన ప్రకటనలో చేసిన ప్రతి అక్షరాన్నీ అన్నా డీఎంకే శ్రేణులు అర్థం చేసుకుని, అనుసరించాలి’’ అని బీజేపీ పిలుపునిచ్చింది. 


ఇంతలోనే ఎందుకీ నిర్ణయం?

అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవించిన శశికళ గతనెలలోనే విడుదలయ్యారు. బెంగళూరు నుంచి అట్టహాసంగా, భారీ ర్యాలీతో చెన్నై చేరుకున్నారు. వాహనాలకు అన్నా డీఎంకే పతాకాలతో హల్‌చల్‌ సృష్టించారు. దినకరన్‌ ఏర్పాటు చేసిన పార్టీకి శశికళే వ్యవస్థాపక అధ్యక్షురాలు. అయినప్పటికీ అన్నాడీఎంకేలో చేరడంపైనే ఆమె ఆసక్తి చూపించారు. చెన్నై చేరుకున్న తన వద్దకు అన్నాడీఎంకే నేతలంతా తరలి వస్తారని భావించారు. కానీ, అలా జరగకపోవడంతో నిరాశకు లోనయ్యారు. ‘ఆమెను పార్టీలో చేర్చుకోండి’ అంటూ బీజేపీ ఢిల్లీ పెద్దలు సూచించినప్పటికీ సీఎం పళనిస్వామి ససేమిరా అన్నారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పరాజయం చెందడం ఖాయమని పలు సర్వేలు చెబుతున్నాయి. 


తాను లేకపోవడం వల్లే పార్టీ ఓడిపోయిందని చెప్పుకొని.. దూరమైన నేతలను చేరదీసి.. క్రమంగా మళ్లీ పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలన్నది ఆమె అభిమతమని.. అందుకే ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని శశికళ సన్నిహితులు చెబుతున్నారు. బీజేపీ అగ్ర నేత అమిత్‌ షాతో ఫోన్లో శశికళ ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇంతలోనే ఏకంగా రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు శశికళ ప్రకటించారు. తాజా పరిణామాలతో దినకరన్‌ పార్టీ ‘అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం’ బలోపేతమవుతుందని విశ్లేషిస్తున్నారు. 

Updated Date - 2021-03-04T06:58:42+05:30 IST