సత్తుపల్లి ప్రత్యేక గుర్తింపు పొందాలి

ABN , First Publish Date - 2020-05-17T10:47:51+05:30 IST

రాష్ట్రంలో సత్తుపల్లి పురపాలకం ప్రత్యేక గుర్తింపు సాధించాలని, ఇందుకు ప్రజలు, పాలకవర్గం కృషి చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

సత్తుపల్లి ప్రత్యేక గుర్తింపు పొందాలి

మునిసిపాలిటీ బడ్జెట్‌ సమావేశంలో కలెక్టర్‌, ఎమ్మెల్యే


సత్తుపల్లి/సత్తుపల్లి రూరల్‌ మే 16: రాష్ట్రంలో సత్తుపల్లి పురపాలకం ప్రత్యేక గుర్తింపు సాధించాలని, ఇందుకు ప్రజలు, పాలకవర్గం కృషి చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన శనివారం నిర్వహించిన బడ్జెట్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆదాయ వ్యయాలను బట్టి 2020-21 వార్షిక సంవత్సర బడ్జెట్‌లో మిగులు రూ.50.22 లక్షలను పాలకవర్గం ఆమోదించింది. డంపింగ్‌యార్డు స్థలం కొనుగోలు చేయాలంటే మునిసిపాలిటీకి డబ్బు లేదని, ఈ నెలాఖరులోగా ఉన్నతాధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే సండ్ర సహకారంతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తన నిధుల నుంచి ప్రతివార్డుకు చెత్తను సేకరించేందుకు ట్రాక్టర్‌, ఆటోలను కేటాయిస్తామని చెప్పారు.


పట్టణ ప్రగతితో కౌన్సిలర్ల భాగస్వామ్యం: సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్యే

పట్టణ ప్రగతిని కౌన్సిలర్ల భాగస్వామ్యంతో విజయవంతం చేశామన్నారు. పట్టణంలో అనేక ఏళ్లుగా ఖాళీగా ఉంటున్న స్థల యజమానులకు నోటీసులు ఇచ్చామని, స్పందించకపోతే మునిసిపాలిటీకి చెందిన స్థలమని బోర్డు ఏర్పాటు చేయాలని పాలకవర్గానికి సూచించామన్నారు. ప్లాస్టిక్‌ రహిత సమాజంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా జ్యూట్‌ బ్యాగులను పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. పారిశ్రామికాభివృద్ధికి సహకరిస్తున్నామని, కేటాయించిన డంపింగ్‌యార్డు స్థలంలో సింగరేణి వారు పూడ్చే పనులను అడ్డుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మొగిలి స్నేహలత, ఆర్డీవో బీ.శివాజీ, తహసీల్దార్‌ కేవీఎంఏ మీనన్‌, మునిసిపల్‌ కమిషనర్‌ కే.సుజాత, చైర్మన్‌ కూసంపూడి మహేష్‌ పాల్గొన్నారు.


ఫుడ్‌పార్క్‌ నిర్మాణంలో ఆలస్యం వద్దు

బుగ్గపాడు ఫుడ్‌పార్క్‌ నిర్మాణం ఆలస్యం వద్దని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. శనివారం మండల పర్యటనకు వచ్చిన ఆయన బుగ్గపాడు ఫుడ్‌పార్క్‌ను సందర్శించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ధాన్యం, మక్కలను రైతులు నిల్వ చేసుకునేందుకు వేర్‌ హౌస్‌లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సందర్భంగా సాగుతున్న నిర్మాణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాల ఆలస్యంలో అధికారులు స్పష్టమైన ఆధారాలు చెప్పకపోవడం, కాంట్రాక్టరు అక్కడ లేకపోవడంతో కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు.


తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, సలహాలు తీసుకోకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సైతం అసహనం వ్యక్తం చేశారు. అంతకముందు బుగ్గపాడులో నూతనంగా నిర్మించిన శ్మశానవాటికను ఆయన ఎమ్మెల్యే, సర్పంచ్‌తో కలసి ప్రారంభించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ మొగిలి స్నేహలత, ఆర్డీవో బీ.శివాజీ, తహసీల్దార్‌ కేవీఎంఏ మీనన్‌, ఆత్మ చైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకరరావు ఉన్నారు.


Updated Date - 2020-05-17T10:47:51+05:30 IST