కన్న కొడుకు తనను ఎదిరించి మాట్లాడడాన్ని సహించలేక.. క్షణికావేశంలో..

ABN , First Publish Date - 2020-08-13T13:45:23+05:30 IST

కుటుంబంలో ఏర్పడిన ఆస్తి తగాదాలు ఓ నిండు ప్రాణాన్ని..

కన్న కొడుకు తనను ఎదిరించి మాట్లాడడాన్ని సహించలేక.. క్షణికావేశంలో..

కుటుంబంలో చిచ్చురేపిన ఆస్తి వివాదం

కుమారుడిని సుత్తితో కొట్టి చంపిన తండ్రి

ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

కుమార్తెలకు ఆస్తి వాటా విషయమై తండ్రి, కొడుకు మధ్య గొడవే కారణమన్న పోలీసులు


పెందుర్తి(విశాఖపట్నం): కుటుంబంలో ఏర్పడిన ఆస్తి తగాదాలు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. కన్న కొడుకు తనను ఎదిరించి మాట్లాడడాన్ని సహించలేక ఓ తండ్రి.... క్షణికావేశంలో హత్యచేశాడు. చినముషిడివాడ దరి సత్యానగర్‌లో బుధవారం జరిగిన ఈ హత్యకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సత్యానగర్‌లో నివసిస్తున్న కొరపాటి వీర్రాజు((71) నేవీ  మర్చంట్‌ విశ్రాంత ఉద్యోగి. ఇతనికి ముగ్గురు కుమారైలు, ఒక కుమారుడు ఉన్నారు.


కుమారుడు జలరాజు(42) విశాఖ మర్చంట్‌ నేవీలో సీమన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తొమ్మిది నెలల క్రితం ఉద్యోగరీత్యా విధులకు వెళ్లిన జలరాజు ఈ నెల రెండోతేదీన ఇంటికి వచ్చాడు. కాగా తన ముగ్గురు కుమారైలకు కూడా ఆస్తిలో వాటా ఇస్తానని వీర్రాజు చెప్పడంతో దీనిని జలరాజు వ్యతిరేకించాడు. రెండు రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నది. అంతేకాక తాను ఇంట్లో లేని సమయంలో తన తోబుట్టువులకు డబ్బులు ఎందుకు పంపిస్తున్నావంటూ తండ్రిని నిలదీశాడు. దీంతో ఘర్షణ మరింత పెరిగింది.


ఈ క్రమంలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో  జలరాజు ఇంటి సెల్లార్‌లో డోర్‌కర్టెన్ల కోసం కార్పెంటరీ  పని చేస్తున్నాడు. వీర్రాజు సుత్తి పట్టుకుని ఇంటిలో నుంచి వేగంగా వచ్చి, కుమారుడు జలరాజు తలపై వెనుకనుంచి బలంగా మోదాడు. దీంతో తలకు తీవ్రగాయమై కిందపడపోయాడు. అయినా వీర్రాజు ఆగకుండా సుత్తితో మరిన్ని దెబ్బలు కొట్టడంతో జలరాజు కేకలు వేస్తూ కుప్పకూలిపోయాడు. కేకలు విన్న భార్య సెల్లార్‌లోకి వచ్చి, రక్తపు మడుగులో వున్న భర్తను పెందుర్తి సీహెచ్‌సీకి తరలించారు.


అయితే అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. భర్తను తన మామ వీర్రాజు హత్య చేశాడంటూ జలరాజు భార్య ఈశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు వీర్రాజు పోలీసులకు లొంగిపోయాడు. పెందుర్తి ఇన్‌చార్జి సీఐ మళ్ల ఆప్పారావు హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-08-13T13:45:23+05:30 IST