Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతుకు జేజేలు

ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా సత్యాగ్రహ దీక్షలు 

వినూత్న రీతిలో నగరంలో భారీ ప్రదర్శన


విజయవాడ సిటీ, నవంబరు 26 : రైతు ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడ ధర్నాచౌక్‌లో రైతు సత్యాగ్రహ దీక్షలు జరిగాయి. తొలుత రైల్వేస్టేషన్‌ నుంచి కళాకారులతో చిత్ర, విచిత్ర వేషధారణలతో, డప్పు, కోలాట బృందాలతో ధర్నాచౌక్‌ వరకు ప్రదర్శన కొనసాగింది. రైతు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షలను ప్రారంభించిన రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ, రైతు ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్మికవర్గం, ప్రజా సంఘాలు ఇచ్చిన తోడ్పాటుతోనే ప్రధాని మోదీ మెడలు వంచగలిగామన్నారు. భవిష్యత్‌లో కూడా రైతాంగ సమస్యలతో పాటు నాలుగు కార్మిక కోడ్‌ల రద్దు, విశాఖ ఉక్కును రక్షించుకునే వరకు ఐక్యంగా పోరాడాలని ఆకాంక్షించారు. ఏపీ కౌలురైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకుని కేంద్రప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య, రైతు సంఘాల నేతలు వై.కేశవరావు, కుర్రా నరేంద్ర, ప్రభాకర్‌రెడ్డి, డి.హరినాథ్‌, దడాల సుబ్బారావు, వి.వెంకటేశ్వర్లు, ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, ఐద్వా కార్యదర్శి డి.రమాదేవి, కాంగ్రెస్‌పార్టీ నేత పి.శ్రీనివాసరావు, కార్మిక సంఘాల నేతలు ఎం.ఎ.గఫూర్‌, ఆర్‌.రవీంద్రనాథ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement