Abn logo
Mar 9 2020 @ 02:21AM

స్త్రీ కేంద్రంగా సత్యవతి కథలు

సత్యవతి మొత్తం కథల్ని వర్గీకరించి రాయాలని చూస్తే, కుదరడంలేదు. అవ్వన్నీ గంపగుత్తంగా ‘స్త్రీ’ కథలు. అంతే. పోనీ తృప్తి కోసం ఇలా రెండు రకాలుగా అనుకోవచ్చు. ‘బదిలీ’లో రజనీ, ‘ఒక వసుంధర’లో వసుంధరలాగా ఎదురు తిరిగి నిలబడే మహిళలు; ‘మెలకువ’లో సుశీల, ‘ఇల్లలకగానే పండగౌనా’లో శారద లాగా ఎదురు తిరగకుండానే ‘నిలబడే’ వుండే మహిళలు. ఏది ఏమైనా నిలబడి వుండాల్సిదే అనేది ప్రతి కథలోని నీతి.


స్త్రీ శరీరంతో సహా మొత్తంగా కేవలం పురుషుని కోసమే అని సమాజం నిర్ధారిస్తుంది; ఈ దుర్మార్గాన్ని బట్టబయలు చేయడమే స్త్రీ వాదం, అంటారు సత్యవతి. ఒప్పుకొని ఏడుస్తూ కూర్చుని ఉన్న పాత్రలని ఎన్నో చూస్తారు. ఎదిరించి జీవితాన్ని సాధించిన ధీరోదాత్తుల పట్టిక కావాలంటే, సత్యవతిని చదవాలి. 


సత్యవతిగారికి ‘ఒక హిజ్రా ఆత్మకథ’కుగానూ ఉత్తమ అనువాదం అంశంలో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. దీనిమూలం, తమిళంలో రేవతి వ్రాసిన ‘వునర్వం వురువముం’ (Feelings of the entire body). తరువాత ఆంగ్లంలో అనువదించిన ప్రతి ఆధారంగా తెలుగు అనువాదం చేశారు. కొన్ని ప్రాంతాల, మనుషుల పేర్లు మినహాయించి ఇది అనువాద రచన అని పాఠకునికి తెలియరానంత చక్కని అనువాదం కావున, దీనికి సాహిత్య అకాడమీ బహుమానం ప్రకటించడం సరైన నిర్ణయం అని స్వాగతించవలసిందే. అనేక రామాయణాలు, సి.కె. జాను అసంపూర్ణ ఆత్మకథ ‘అడవి తల్లి’, ‘ఇస్మత్‌ చుగ్తాయ్‌ కథలు’, వై.బి. సత్య నారాయణ ‘మా నాయన బాలయ్య’ మొదలైనవి వీరి ఇతర అనువాదాలు. ‘రాగభూపాలం’ పేరుతో ఒక వ్యాస సంపుటి కూడా ఉంది.


అనువాదానికి బహుమానం వచ్చింది. అయితే ఏం? మళ్ళీ మళ్ళీ చర్చల్లో వినబడే వారి కథల సంగతి ప్రస్తావన తేవడానికి ఏ సమయమూ అసందర్భం కాదు. ఒకరి వచన రచన గురించి మాట్లాడేటపుడు వారు రాసిన సాహిత్యం మొత్తంలో అన్నింటికన్నా గొప్పదైన వాక్యంతో మొదలు పెట్టడం రివాజు. కాబట్టి ఒక వాక్యంతో మొదలుపెడతాను: ‘‘ప్రతి మగవాడి విజయం వెనుకా ఓ స్త్రీ ఉంటుంది. ప్రతి స్త్రీ తనని తాను మర్చిపోవడం వెనక, తనని తాను పారేసుకోవడం వెనుక ఓ పురుషుడే కాదు, వ్యవస్థ మొత్తం ఉంటుంది.’’ (‘తాయిలం’ కథలోంచి.) నిజానికి సత్యవతిలో అన్నింటి కన్నా మేలిమి వాక్యాన్ని ఎత్తి పట్టుకోవడం అసలు కుదిరేపని కాదు. ఆమె ప్రతికథలో అధమం నాలుగైదు సార్వత్రిక ప్రకటనలు ఉంటాయి. అవ్వన్నీ అందరికీ తెలిసినట్టుగా ఉంటాయి. కానీ ఎక్కువమంది గమనంలో వుంచుకున్నవి కాదు. రోజువారీ జీవితంలో మర్చిపోయినవి. సత్యవతి నాలుగు దశాబ్దాలుగా వాటిని అలసి పోకుండా గుర్తుచేస్తూనే ఉన్నారు. అదే సమయంలో బోధ చేయాలనీ, తనకన్నీ తెలుసుననీకాదు. చాలా అమాయకంగా, ఏదో యాదృచ్ఛికంగా చెప్పినట్టు చెబుతారు. డెబ్భయ్యవ దశకంలో మొదలుపెట్టారు. మొన్న వారంరోజులనాడు, వారిని కలవడానికి వెళితే, ‘‘కొత్త కథ 


రాశాను చూడు. వాయిస్‌ టైపింగ్‌ ఎలా చెయ్యాలో రాదా?! ఇదిగో కూచో. నేర్చుకో. ఈ పుస్తకం గురించి విను’’... అదృష్టం 


కదా, ఇలాంటి సాంగత్యం! ఏడాది కిందట ‘అనేక రామాయణాలు’ అనువాదం. మొన్న రెండు నెలలనాడే ఎవరెస్టు 


శిఖరాన్ని అధిరోహించిన పూర్ణని అనువదించారు. ‘యంగెస్ట్‌ గర్ల్‌’ని ‘చిన్నారి’గా తెనిగించడం ఎంత ముద్దుగా 


అనిపించిందో నాకైతే. నలభై ఏళ్ళ రచనల సొంతదారు, నిరంతర పరిశ్రమల జవ్వని, ఈ చలాకీ అమ్మాయి సత్యవతి 


వయసెంత అని ఆరా అడగాలని చూస్తారు కొందరు. ఆ ప్రయత్నాలు మానుకోండి, కళ్ళు పోతాయి.

సత్యవతి మొత్తం కథల్ని వర్గీకరించి రాయాలని చూస్తే, కుదరడంలేదు. అవ్వన్నీ గంపగుత్తంగా ‘స్త్రీ’ కథలు. అంతే. పోనీ 


తృప్తి కోసం ఇలా రెండు రకాలుగా అనుకోవచ్చు. ‘బదిలీ’లో రజనీ, ‘ఒక వసుంధర’లో వసుంధరలాగా ఎదురుతిరిగి 


నిలబడే మహిళలు; ‘మెలకువ’లో సుశీల, ‘ఇల్లలకగానే పండగౌనా’లో శారద లాగా ఎదురు తిరగకుండానే ‘నిలబడే’ 


వుండే మహిళలు. ఏది ఏమైనా నిలబడి వుండాల్సిందే అనేది ప్రతి కథలోని నీతి.


ఇరవయ్యొవ శతాబ్దపు ద్వితీయార్ధంలో రచయితలు చలం, కుటుంబరావు, రంగనాయకమ్మ, మాలతీ చందూర్‌, చార్లెస్‌ డికెన్స్‌ మొదలైనవారిని చదివి ఉండటం కాలేజీలో చేరడానికి పదోతరగతి ఉత్తీర్ణులు కావడమంత అవసరం. అలాగే ఎవరు ఏది రాసినా, ఈ పైవారి ముద్ర ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. అలాగే, ఎవరేది రాసినా, పైవారి రచనలతో పోల్చి తులనాత్మక పరిశీలన చేయడం సంప్రదాయం. సత్యవతి కూడా వీరందరినీ చదివారు. వీరితోపాటు, ‘‘నువ్వు ఎగరాలనుకుంటే నీ పైనవున్న బరువాటి చెత్తని వదిలించుకోవలసిందే’’ అని బోధించిన ఆఫ్రో అమెరికన్‌ రచయిత్రి టోనీ మారిస్సన్నూ, స్పానిష్‌ రచయిత గాబ్రియెల్‌ మార్క్వెజ్‌ లాంటి మిస్టిక్‌ రచయితను కూడా చదివారు. తరువాత ప్రపంచంలో వస్తున్న ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పరిణామాలను గుర్తించారు. మాయా ఏంజిలో చెప్పినట్టు, కథ అయినా కల అయినా కడుపులో భరించడం గొప్ప వేదన అని, కనెయ్యడమే రచయితకి విముక్తి అనీ నమ్మి, తానెరిగిన కథలన్నీ బయట పెట్టారు. ఈ క్రమంలో ఆమె ఎవరినీ అనుకరించలేదు. తాను ఎలా ఉంటారో, ఎలా మాట్లాడతారో, చుట్టూ ఉన్న మనుషుల్లో ఏమేమి చూశారో అవి రాశారు. తన సొంతభాషలో. వీరి కథలన్నీ పూర్తిగా కుటుంబ కథలు. దాదాపు అన్నీ మధ్యతరగతి కథలు. ఇటీవల రాసిన ‘ఇట్లు మీ స్వర్ణ’, ‘అమ్మ ఒడి’ లాంటివి తప్పించి. మధ్య తరగతి స్త్రీలు ఒక స్థాయిని దాటారు. ఇప్పుడు దిగువ వర్గాల స్త్రీల గురించి మనం మాట్లాడాలి అంటారు సత్యవతి. ఇతర కథల్లో లాగానే వీరి కథల్లోకూడా ఆడా, మగా ఇద్దరూ ఉన్నారు. కూతుళ్ళూ, కొడుకులూ, అత్తలూ, చుట్టాలు, స్నేహితులు, సహ ఉద్యోగులు, ఒక్కరేమిటి అందరూ ఉన్నారు. ఈ అన్ని పాత్రలతో గురజాడ, చలం దగ్గర్నించీ ఇవాల్టిదాకా స్త్రీ కథలు చాలా మంది రాశారు. కానీ, కథాంశాల వైవిధ్యాన్ని లెక్కలోకి తీసుకుని చూస్తే ఆమెతో పోల్చదగినవారు అతి కొద్దిమంది. ఆమె కథలన్నీ మనిషి కేంద్రమే. అదే సమయంలో ప్రతి కథా దేనికదే వేరు.


కథ లక్ష్యం సమకాలీన చరిత్రని నమోదు చెయ్యడం. తరువాతి తరాలకు అందించడం. అయితే చరిత్ర పుస్తకాలే రాసుకోవచ్చు కదా? కానీ, చరిత్ర పుస్తకాలు అందరికీ ఆసక్తి కలిగించకపోవచ్చు. కథ అందర్నీ ఆకర్షిస్తుంది. అందుకనే వున్నదానికి కొంత వూహని అద్ది, వర్తమానకాలాన్ని కథలతో తర్వాత తరాలకు బదిలీ చేస్తారు కథకులు. సత్యవతిని చదివితే, ఇత్తడి బిందెని కాలువ ఒడ్డున ఉన్న ఒండ్రుమట్టితో తోమిన, ఆరేళ్ళకే పిల్ల ఓణీ వేసి వీధిలో ఆడిన కాలాల నుంచి అలా అలా ఇవాల్టి ఆటోమాటిక్‌ వాషింగ్‌ మిషన్‌, సెల్‌ ఫోన్‌, చాటింగ్‌, డేటింగ్‌ కాలానికి టైం ట్రావెల్‌ చేయవచ్చు. వీరి కథల్లో కథాంశాలు అన్నీ, మనకి ఆసక్తి కలిగిస్తాయి. అక్షరాల వెంట పరుగులు తీయిస్తాయి. అలాగని అవి నేల విడిచి సాము చేసే థ్రిల్లర్‌ కథలు కావు. చదివి పక్కనపెట్టిన పది రోజుల తరవాత కూడా మన ఆలోచనని పట్టుకు పీడించే గాథలు. 


సత్యవతి కథల్లో ఆలోచనలో లేదా క్రియలో తిరుగుబాటు చూపించేవారు ఎక్కువ. కొన్ని తిరుగుబాట్లు, నిర్ణయాలూ కొత్త మహిళా తరానికి ప్రతినిధిని అనిపించే నాక్కూడా ఘాతంలా తగిలాయి. ఉదాహరణకి, చుట్టాలూ పక్కాలూ, పొరుగువాళ్ళూ, అంతగా చదువురానివాళ్ళూ, బ్రూట్‌ పరిమళాలూ, మౌత్‌ వాష్లూ తెలీని మామూలు జనం ‘వెళ్ళిపోయిన’ తల్లిని గురించి వేరే పదం వాడతారు. ఈ నేపథ్యంలో దమయంతి కూతురుతో సహా ప్రతి పాత్ర పడిన సంఘర్షణని చూపిస్తూనే, కూతురూ, కొడుకూ, భర్తలో ఆమె ఎడల సానుభూతి, అంగీకారం ధ్వనింపచేస్తారు. ఆ కథ 2012లో కాదు, రెండువేల నలభై తరవాత రావాల్సినది. సత్యవతి అడపాదడపా నేలమీద నడిచే మనుషులని కాక, ఆకాశంలో ఉండే దేవతల్ని తెచ్చి పాత్రలు చేశారా అనిపిస్తుంది!


ఈ కథల్లో విషాదం నుంచి పుట్టిన వెటకారాలుంటాయి. అవి పక పకా నవ్వించవు. అరె ఇది నిజమే కదా అని ఆశ్చర్యపరుస్తాయి. తరచుగా హిందీ పాటల ప్రస్తావన కనబడుతుంది. మధ్యతరగతి కుటుంబాల్లో వినబడే గ్రామర్‌ తప్పులు లేని ఇచ్చకాల ఇంగ్లీష్‌ ఉంటుంది. ‘‘అసలు ఆడపిల్లలాగా ఉండటం అంటే ఏమిటి? ఆడపిల్ల అలా వుండాలని ఎవరు చెప్పారు? ఆడ లక్షణాలు అంటూ ఏమీ ఉండవు’’ అని అక్కడక్కడా సమాజానికి హెచ్చరికలు కూడా ఉంటాయి. 


రచయితలు దార్శనికులుగా ఉండాలి. ముందుగా రాబోయే సమస్యల్ని గుర్తించి, వాటి పరిష్కారాలు కూడా ఇచ్చేసి ఉండాలి. ఆ మధ్య టివీల్లో, పేపర్లలో కొత్త పెళ్లి కూతురి మీద ఆమె భర్త చేసిన లైంగిక దాడి గురించి వార్త వచ్చింది. ఈ ఇతివృత్తం చలం రాశాడు. సత్యవతి కూడా 1978లోనే ‘మాఘ సూర్యకాంతి’ కథలో రాశారు. ఈమె సరైన పరిష్కారం కూడా రాశారు. పరువు భ్రమతో భద్రతలేని బంధనాలకి చిక్కుకుని ప్రాణం మీదికి తెచ్చుకోవడం అవసరం లేదని రాశారు. అలాగే, ఆ మధ్యనంతా అయ్యప్ప గుడి చర్చ నడిచింది. అయ్యప్ప గుడిలోకి ఆడవాళ్ళు వెళ్ళాలా వద్దా? ఆడవాళ్ళు ఇదివరకు వెళ్ళేవాళ్ళు కదా. ఇప్పుడు ఎందుకు వెళ్ళకూడదు? 


‘‘నువ్వు మీ ఆయన్ని అడక్కుండా దీక్ష తీసుకున్నావనుకో, అతను నీ లాగా చూస్తాడా? ఆ సేవలన్నీ చేస్తాడా’’ అని యజమానురాలు ‘పతిభక్తి’ పనిపిల్ల మంగని అడుగుతుంది.


‘‘ఆడాళ్లకెట్టా కుదురుద్దమ్మా,’’ (మొగుడితో పూజావిధుల ఏర్పాట్ల సేవలు చేయించుకోవడం?) మంగ విస్తుపోతుంది.


‘‘అందుకే అయ్యప్పస్వామి ఆడాళ్ళని రావద్దన్నాడు చాలా తెలివిగా’’.

-అసలు సంగతి పదిహేనేళ్ళనాడే సత్యవతి పసిగట్టేశారు. గ్లోబలైజెషన్‌, స్త్రీ విద్య, ఉద్యోగం, చాలా పరిమితంగానైనా ఊళ్ళేలడం మంచికే. కుటుంబ స్థాయి పెరుగుతుంది. మరి స్త్రీ పురుషుల ఆలోచనాస్థాయిలో కూడా సమాంతర ఎదుగుదల వచ్చిందా? వివాహంలో రొమాంటిక్‌ టచ్‌ కన్నా స్థిరత్యం ముఖ్యం కాదూ ఇవాళ్టికీ? దానినే వాస్తవికత అని బుకాయిస్తాం! మంత్ర నగరిలో వినిమయ సంస్కృతి మోళీలో చిక్కుకున్న గీత ఫరవాలేదు మనకి. కుటుంబ సౌకర్యాల కన్నా, సమాజసేవ ముఖ్యం అంటూ మెరుగైన (ఎక్కువ జీతపు) వుద్యోగం వద్దనే ‘ఎచటికి పోతావీరాత్రి’ లాయరమ్మ తెలివి తక్కువకదా! పెట్టుబడిదారీ సమాజలక్షణం, పోటీ, గెలుపు తప్ప మిగిలినవన్నీ మిథ్యగా కనిపిస్తాయి. సత్యవతి స్త్రీవాద రచయిత్రి. స్త్రీ వాదం అంటే ఏమిటి? మొగవాళ్ళని తిడుతూ ఊరకే వాదం పెట్టుకోవడమా? ఆర్థిక, రాజకీయరంగాల్లో స్త్రీలు సమానంగా రావడమా? లేక లైంగిక సంబంధ విషయాల్లో స్వయం నిర్ణయాధికారమా? భూ మ్మీద పురుషునిలాగా, ఇతర జంతువులలాగా స్త్రీలకి ఉండే అవసరాలని యథాతథంగా తీసు కోవడం స్త్రీవాదం. ఆమెకి భోజనం కావాలి. సరిపడా నిద్ర కావాలి. తన శరీర అవసరాలన్నీ వ్యక్తపరచే వెసులుబాటు కావాలి. సత్యవతి అంటారు- స్త్రీ శరీరంతో సహా మొత్తంగా కేవలం పురుషుని కోసమే అని సమాజం నిర్ధారిస్తుంది; ఈ దుర్మార్గాన్ని బట్టబయలు చేయడమే స్త్రీవాదం. ఒప్పుకొని ఏడుస్తూ కూర్చుని ఉన్న పాత్రలని ఎన్నో చూస్తారు. ఎదిరించి జీవితాన్ని సాధించిన ధీరోదాత్తుల పట్టిక కావాలంటే, సత్యవతిని చదవాలి. వీరు రాసిన ‘ఇల్లలకగానే పండగౌనా’ అనే కథ పదవ తరగతి పాఠ్య పుస్తకంలో ఒక పాఠ్యాంశంగా ‘What is My Name’ పేరుతో పిల్లలకి చేరింది. అలాగే, ‘పిల్లాడొస్తాడా’ అనే కథ ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ఆంగ్ల పాఠంగా ‘Will He Come’ అనే పేరుతో ఉంది. అయితే, ఈ ఆంగ్ల బోధకురాలి తెలుగు కథలు, తెలుగు పాఠ్య పుస్తకాలలో ఎందుకని రాలేదో? 

ఎం ఎస్‌ కె. కృష్ణజ్యోతి


Advertisement
Advertisement
Advertisement