ప్రవాసులు, దేశ పౌరులకు Saudi Arabia కీలక సూచన..!

ABN , First Publish Date - 2021-12-19T18:43:51+05:30 IST

కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా వణుకుపుట్టిస్తోంది. ఈ కొత్త వేరియంట్ శరవేగంగా ప్రబలుతోంది.

ప్రవాసులు, దేశ పౌరులకు Saudi Arabia కీలక సూచన..!

రియాద్: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా వణుకుపుట్టిస్తోంది. ఈ కొత్త వేరియంట్ శరవేగంగా ప్రబలుతోంది. ఇప్పటికే 90 దేశాల వరకు వ్యాప్తి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. అటు గల్ఫ్‌లోనూ కొత్త వేరింట్ ఉనికిని చాటింది. దాంతో జీసీసీ(గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కువైత్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఒమన్, ఖతార్.. ఆఫ్రికన్ కంట్రీస్‌పై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా తాజాగా దేశ ప్రజలు, ప్రవాసులకు కీలక సూచన చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలకు పూర్తిగా దూరంగా ఉండాలని కోరింది. ఈ మేరకు సౌదీ పబ్లిక్ హెల్త్ అథారిటీ కీలక ప్రకటన విడుదల చేసింది. 


ప్రధానంగా హైరిస్క్ దేశాలకు ఎట్టిపరిస్థితుల్లో వెళ్లొద్దని ఈ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా వివిధ దేశాల్లో కొత్త వేరియంట్ కేసులు శరవేగంగా పెరుగుతుండడంపై సౌదీ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీకి వచ్చేవారు టీకాలతో సంబంధం లేకుండా కనీసం ఐదు రోజుల పాటు సోషల్ క్వారంటైన్‌లో ఉండాలని కోరింది. అలాగే కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని హెల్త్ అథారిటీ పేర్కొంది. అదే సమయంలో ముఖానికి మాస్కు ధరించడం తప్పనిసరి అని సూచించింది. దీంతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని తెలిపింది. ఇక బూస్టర్ డోసుకు అర్హులైనవారు కూడా తప్పకుండా వేసుకోవాలని హెల్త్ అథారిటీ సూచించింది.

Updated Date - 2021-12-19T18:43:51+05:30 IST