రోడ్లు లేని నగరం.. ద లైన్‌

ABN , First Publish Date - 2021-01-12T09:24:32+05:30 IST

నగరమంటే ఎట్టుండాల? విద్యుద్దీప కాంతులతో మెరిసిపోయే భారీ ఆకాశహర్మ్యాలు.. సర్రున దూసుకుపోయే కార్లు.. మెట్రో రైళ్లు.. బీభత్సమైన ట్రాఫిక్‌జామ్‌లు, దాంతో పాటు పొల్యూషన్‌..

రోడ్లు లేని నగరం.. ద లైన్‌

15 లక్షల కోట్లతో సౌదీ అరేబియా అద్భుత నగరం.. ‘నూతన భవిష్యత్తు’


నగరమంటే ఎట్టుండాల? విద్యుద్దీప కాంతులతో మెరిసిపోయే భారీ ఆకాశహర్మ్యాలు.. సర్రున దూసుకుపోయే కార్లు.. మెట్రో రైళ్లు.. బీభత్సమైన ట్రాఫిక్‌జామ్‌లు, దాంతో పాటు పొల్యూషన్‌.. ఇది కదా నగరమంటే! కానీ.. ఈ రొటీన్‌కు భిన్నంగా 170 కిలోమీటర్ల పొడువునా ఓ పే....ద్ద సరళరేఖ గీసినట్టుగా ఉండి, అసలు రోడ్లు, కార్లే లేని నగరాన్ని అక్షరాలా రూ.15 లక్షల కోట్లతో నిర్మించేందుకు సౌదీ అరేబియా సిద్ధమైంది. ఊహించడానికే వింతగా ఉన్న ఈ నగరం పేరు.. ‘ద లైన్‌’. రూ.36 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘నియోమ్‌’ అనే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో ఒక భాగం ఈ నగరం. ఇంట్లోంచి బయటకు వస్తే.. స్కూలు, ఆస్పత్రి, సూపర్‌మార్కెట్‌.. ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకన  లేదా సైకిళ్లపై ఐదు నిమిషాల్లోపు.. గరిష్ఠంగా 20 నిమిషాల్లో వెళ్లొచ్చు. రోడ్లు లేకుండా ఎలా వెళ్లాలి? అంటే.. ఇటలీలోని నగరాల్లో కనిపించే పియాజ్జాల వంటి వాటి ద్వారా వెళ్లొచ్చు. అంటే కూడళ్లలాంటివన్నమాట.


మరి రోడ్లు లేకుండా, వాహనాలు లేకుండా ఇంత పెద్ద నగరానికి అవసరమైన నిత్యావసరాలు గట్రా ఎలా వస్తాయన్న సందేహం మీకు ఉండొచ్చు. రోడ్లుంటాయి. కానీ.. నగరంలో కాదు. నగరం కింద. అంటే భూగర్భంలో. అక్కడా రెండు పొరలుంటాయి. మొదటి పొరను సర్వీస్‌ లేయర్‌ అంటారు. మామూలు సరుకు రవా ణా లారీల వంటివి ఈ లేయర్‌లో ప్రయాణిస్తాయి. దాని కింద ఉండేది స్పైన్‌ లేయర్‌. అంటే.. రవాణాకు వెన్నెముక. ‘ద లైన్‌’లో ఒక చోటు నుంచి మరొక చోటుకు అత్యంత వేగంగా ప్రయాణించడానికి కృత్రి మ మేధ ఆధారిత వేగవంతమైన రవాణా వ్యవస్థ ఆ లేయర్‌లో ఉంటుంది. ఆ రవాణా వ్యవస్థకు 100ు స్వచ్ఛ ఇంధనాలను వినియోగిస్తారు. 2030 నాటికి 3,80,000 ఉద్యోగాలు సృష్టించి, స్థూలజాతీయోత్పత్తికి తన వాటాగా రూ.3.5 లక్షల కోట్లు అందించేటట్టు ఈ నగరాన్ని నిర్మించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. 


ఇంతకీ నియోమ్‌ అంటే ఏంటో తెలుసా?

నూతన భవిష్యత్తు అని అర్థం!!


ఎందుకీ నగరం?

సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ చమురుపై ఆధారపడి ఉంది. కానీ, పెరుగుతున్న భూతాపం, స్వచ్ఛ ఇంధనాలపై పెరుగుతున్న అవగాహన వంటివాటి నేపథ్యంలో భవిష్యత్తులో ఆ ఆదాయం తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఆదాయం కోసం చమురుపై ఆధారపడకుండా ఇలాంటి పర్యాటక ఆకర్షణలవైపు మళ్లడం ఓ కారణం. అలాగే.. సౌర, పవన విద్యుత్తు, హైడ్రోజన్‌ ఆధారిత రవాణా వ్యవస్థవైపునకు మళ్లాలని సౌదీ భావిస్తోంది. అందుకు నాందీ వచనమే ఈ ‘నియోమ్‌’ నగరం.


అందుకే.. ద లైన్‌!

చరిత్రను గమనిస్తే.. ప్రజలను రక్షించుకోవడానికి నగరాలను నిర్మించేవారు. కానీ, పారిశ్రామిక విప్లవం తర్వాత నగరాల్లో ప్రజలకన్నా కార్లు, ఫ్యాక్టరీలు, యంత్రాలకు ప్రాధాన్యం పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైనవిగా పరిగణించే నగరాల్లో ప్రజలు తమ జీవితాల్లో ఎక్కువ భాగం ప్రయాణాల్లోనే గడిపేస్తున్నారు. 2050 నాటికి.. ప్రయాణ సమయాలు రెట్టింపు అవుతాయి. జీవితంలో ఏళ్ల తరబడి ఇలా ప్రయాణాలకు ఎందుకు వృథా చేయాలి? అందుకే సంప్రదాయ నగరమనే భావననే.. భవిష్యత్తు నగరంగా మార్చేయాల్సిన అవసరముంది. అందుకే ‘ద లైన్‌’ నగరాన్ని నిర్మించబోతున్నాం.

మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, సౌదీ యువరాజు

Updated Date - 2021-01-12T09:24:32+05:30 IST