Abn logo
Jan 17 2021 @ 12:32PM

భళా.. భవిష్య నగరం !

నగరాలు రోజు రోజుకు విస్తరిస్తున్నాయి. సుఖవంతమైన జీవితం కోసం లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌, గేటెడ్‌ కమ్యూనిటీస్‌, ఆకాశాన్నంటే హై రైజ్‌ బిల్డింగ్స్‌... వాటితో పాటే వాహనాలు, రద్దీ, కాలుష్యం కూడా పెరుగుతోంది. అయితే కార్లు, వీధులు, కర్భన ఉద్గారాలు లేని ఒక మెగా నయా నగరాన్ని నిర్మిస్తే... అది కచ్చితంగా ఫ్యూచరిస్టిక్‌ మెగా సిటీ ‘ది లైన్‌’ అవుతుంది. ‘అర్బన్‌ లివింగ్‌’లో ఒక విప్లవంగా పేర్కొంటున్న ఈ ప్రాజెక్టు విశేషాలు ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఔరా’ అనిపిస్తాయి..


పుణే సమీపంలో నిర్మించిన ప్రణాళిక బద్ధమైన నగరం ‘లవాసా’ గురించి చదివి ఆశ్చర్యపోయాం. దుబాయి సముద్ర తీరంలో అద్భుతంగా నిర్మించిన ‘పామ్‌’ దీవుల విశేషాలు తెలుసుకుని నోరెళ్లబెట్టాం. అలాంటిది ప్రపంచంలోనే ఇప్పటిదాకా ఎవరూ కలలో కూడా ఊహించని ఒక మాయా నగరానికి శ్రీకారం చుట్టారు. ‘ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా 70 లక్షల మంది వాయు కాలుష్యంతో మరణిస్తున్నారు. ఏటా 10 లక్షల మంది యాక్సిడెంట్లలో చనిపోతున్నారు. 90 శాతం మంది కాలుష్యమైన గాలిని పీలుస్తున్నారు. అందుకే సరికొత్త ‘ఫ్యూచరిస్టిక్‌ సిటీ’ నిర్మిస్తున్నాం... అదెలా ఉంటుందంటే 95 శాతం ప్రకృతిని పరిరక్షిస్తుంది’ అంటూ సౌదీ యువరాజు, ‘నియోమ్‌’ ప్రాజెక్ట్‌ చైర్మెన్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ప్రకటించగానే ప్రపంచం దృష్టి ఒక్కసారిగా ‘ది లైన్‌’ నగరంపై పడింది. 500 బిలియన్‌ డాలర్లు... అంటే అక్షరాలా 36 లక్షల కోట్ల రూపాయలను ఈ బృహత్‌ ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తున్నారు. 

‘లైన్‌’ ప్రధానం...

‘నియోమ్‌’ అంటే... గ్రీకు భాషలో నూతన, అరబిక్‌లో భవిష్యత్తు అని అర్థం. ఈ రెండింటి సమ్మిళితంతో ‘నూతన భవిష్యత్తు’ అనే అర్థం వచ్చేలా ప్రాజెక్టుకు ఆ పేరు పెట్టారు. అదేవిధంగా నగరానికి ‘ది లైన్‌’ అనే పేరు పెట్టడానికీ ఓ కారణం ఉంది. వాయువ్య సౌదీ అరేబియాలోని తబుక్‌ ప్రావిన్స్‌లో ఎర్రసముద్రం, టిరాన్‌ జలసంధి, ఈజిప్ట్‌, ఇజ్రాయెల్‌, జోర్డాన్‌ సరిహద్దుల సమీపంలో 170 కిలోమీటర్ల పొడవైన ‘లైన్‌’ చుట్టే ఈ నగరం రూపుదిద్దుకుంటుంది. అంటే మామూలు నగరాల్లోలాగా ఇక్కడ వీధులు ఉండవు. రోడ్డు మీద రద్దీ వల్ల ప్రతీ ప్రయాణికుడు ఏడాదికి 168 గంటల సమయాన్ని కోల్పోతున్నాడట. అందుకే ఈ సరళరేఖను ఆధారంగా చేసుకుని కాలుష్యం లేని మొబిలిటీ ఉంటుంది. ఎక్కడికెళ్లాలన్నా కాలినడక లేదా సైకిల్‌ మీద ఐదు నిమిషాల్లో చేరుకునేలా డిజైన్‌ చేస్తున్నారు. 170 కిలోమీటర్లుండే ‘లైన్‌’ను ఒక చివరి నుంచి మరో చివరికి వెళ్లాలంటే పట్టే సమయం కేవలం 20 నిమిషాలు మాత్రమే. పైగా ఈ నగరంలో 95 శాతం ప్రకృతిని పరిరక్షిస్తున్నారు. దీనివల్ల రద్దీ, వాయు కాలుష్యం వంటివి అస్సలు ఉండవు. సుమారు పదిలక్షల మంది నివాసం ఉండే ‘ది లైన్‌’ నిర్మాణ పనులు మార్చిలో మొదలై పదేళ్లలో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ‘నూతన భవిష్యత్తు’ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి స్థానికులు నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 20 వేల మంది హువాయితీ గిరిజనులు నిర్వాసితులుగా మారుతారని సామాజికవేత్తలు అంటున్నారు. సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ మాత్రం అన్ని సమస్యలు సమసిపోయి, ఈ అద్భుతం త్వరలోనే ఆవిష్కృతమవుతుందని చెబుతున్నారు. ఏది ఎలా ఉన్నా ‘ది లైన్‌’ నగర విశేషాలు రానున్న కాలంలో సైన్స్‌ఫిక్షన్‌ సినిమాను తలపిస్తుందనే చెప్పాలి

జురాసిక్‌ పార్క్‌...

‘జురాసిక్‌ పార్క్‌’ అనేది ఒక అద్భుతమైన కల్పిత ప్రపంచం. ఎన్నో ఏళ్ల క్రితం భూమ్మీద జీవించిన ఈ రాక్షస బల్లులను ‘జురాసిక్‌ పార్క్‌’ సినిమాలో చూసి ఆశ్చర్యపోయాం. అలాంటి ‘యానిమాట్రిక్‌ లిజార్డ్స్‌’ను అనేకం ఈ నగరంలో చూడొచ్చు. అంటే మార్కెట్‌కో, పార్క్‌కో నడుచుకుంటూ వెళ్తుంటే... పక్కనుంచే ఒక యాంత్రిక రాక్షసబల్లి వెళ్తూ కనిపిస్తుంది.

కృత్రిమ చందమామ...

చందమామలో నివాసం కోసం ప్రయత్నాలు జరుగుతున్న వేళ... ‘లైన్‌’ నగరం ఓ అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. కేవలం ఈ నగరానికే పరిమితమయ్యే కృత్రిమ చంద్రుడిని సృష్టిస్తున్నారు. సుమారు పదిలక్షల మంది నివాసం ఉండే ఈ నగరంలో మిలమిలా మెరిసిపోయే చందమామ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అంతేకాదు... చీకట్లో మెరిసే బీచ్‌లు  కూడా ఇక్కడ ఉంటాయట. 

డ్రోన్‌ టాక్సీలు...

ఈ నయా నగరంలో కాలుష్యం ఉండకపోవడానికి ప్రధాన కారణం కార్లు, బస్సులు, ఆటోలు, మోటార్‌ సైకిళ్లు వంటి వాహనాలు ఇక్కడ నిషేధం. ఇంటి నుంచి బయటకు రాగానే డ్రోన్‌ టాక్సీ సర్రున ప్రయాణికుడి ముందుకు దూసుకొస్తుంది. అందులో ఎక్కడికంటే అక్కడికి ప్రోగ్రామింగ్‌ చేసుకుని వెళ్లొచ్చు.

రోబో పనిమనుషులు...

ఎంత కోటీశ్వరులకైనా ఇంట్లో పనిచేసే పనిమనుషులు దొరక్కపోతే రోజువారీ జీవితం స్తంభించిపోతుంది. ఇల్లు ఉడ్చాలన్నా, తుడవాలన్నా, బట్టలు ఉతకాలన్నా అన్నింటికీ పనిమనిషి కావాల్సిందే. మెట్రో నగరాల్లో పనిమనుషుల డిమాండ్‌ గురించి తెలిసిందే. ఇలాంటి పరిస్థితులు ఈ ఫ్యూచరిస్టిక్‌ మెగాసిటీలో ఉండవు. ఎందుకంటే అక్కడ రోబో పనిమనుషులు ఇంటిని చక్కదిద్దుతాయి. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement