హజ్ యాత్రపై ముస్లింలకు సౌదీ కీల‌క సూచ‌న‌...

ABN , First Publish Date - 2020-04-01T18:57:41+05:30 IST

ప్ర‌స్తుతం మ‌హమ్మారి క‌రోనావైర‌స్‌(కొవిడ్‌-19) నేప‌థ్యంలో దేశంలో నెల‌కొన్న ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితుల దృష్ట్యా సౌదీ అరేబియా స‌ర్కార్ విదేశాల్లోని ముస్లింల‌కు హజ్ యాత్ర విష‌య‌మై కీల‌క సూచ‌న‌లు చేసింది.

హజ్ యాత్రపై ముస్లింలకు సౌదీ కీల‌క సూచ‌న‌...

రియాధ్‌: ప్ర‌స్తుతం మ‌హమ్మారి క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) నేప‌థ్యంలో దేశంలో నెల‌కొన్న ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితుల దృష్ట్యా సౌదీ అరేబియా స‌ర్కార్ విదేశాల్లోని ముస్లింల‌కు హజ్ యాత్ర విష‌య‌మై కీల‌క సూచ‌న‌లు చేసింది. హజ్ ప్రణాళికలను కొంత‌కాలం పాటు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని ముస్లింలను సౌదీ కోరింది. ఇక ఇస్లాం పవిత్ర నగరాలకు కరోనావైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో సౌదీ అరేబియా గ‌త నెల ప్రారంభంలోనే ఏడాది పొడవునా "ఉమ్రా" తీర్థయాత్రను నిలిపివేసిన విష‌యం తెలిసిందే.


యాత్రికులు మరియు ఉమ్రా వ‌చ్చే వారికి సేవ చేయడానికి సౌదీ పూర్తిగా సిద్ధంగా ఉందని హజ్ మంత్రి మొహమ్మద్ బెంటెన్ అన్నారు. కానీ, క‌రోనా క‌ల్లోలం వ‌ల్ల ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌ వ్యాప్తంగా నెల‌కొన్న విప‌త్క‌ర ప‌రిస్థితుల నేప‌థ్యంలో వివిధ దేశాల్లోని ముస్లిం సోద‌రులు, దేశ పౌరుల ఆరోగ్యం దృష్ట్యా కొంత‌కాలం హజ్ యాత్ర‌ను వాయిదా వేసుకోవ‌డం మంచిద‌న్నారు. ప్ర‌స్తుత ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు చ‌క్క‌బడిన త‌ర్వాత దీని గురించి ఆలోచించ వ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు. 


కాగా, జూలై నెలాఖరున జరగనున్న ఈ ఏడాది హజ్‌తో ముందుకు వెళ్తారా అనేది సౌదీ అధికారులు ఇంకా ప్రకటించలేదు. ఇక గ‌తేడాది వివిధ దేశాల నుంచి 2.5 మిలియన్ల మంది హ‌జ్ యాత్ర‌కు వ‌చ్చిన‌ట్లు సౌదీ అధికారులు పేర్కొన్నారు. అందుకే ఈ యాత్ర సౌదీ రాజ్యానికి ముఖ్య ఆదాయ వ‌న‌రు. అదే స‌మ‌యంలో జ‌న‌స‌మూహాలు ఉన్న చోట క‌రోనా శ‌ర‌వేగంగా విస్త‌రించే అవ‌కాశం ఉన్నందున‌ హ‌జ్ యాత్ర నిర్వ‌హించ‌డం అంతా మంచిది కాద‌ని విశ్లేష‌కుల అభిప్రాయం.


ఇక ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి, నియంత్ర‌ణ‌కు సౌదీ స‌ర్కార్ ఇప్ప‌టికే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంది. మ‌సీదుల మూసివేత‌, జ‌న‌స‌మూహాలపై ఆంక్ష‌లు, ప్రార్థ‌న‌ల‌పై నిషేధం, ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు, అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల ర‌ద్దు, ప్ర‌జా ర‌వాణా నిలిపివేత‌, స్వీయ నిర్బంధం, సామాజిక దూరం వంటివి అమ‌లు చేస్తోంది. ఇదిలాఉంటే సౌదీలో ఇప్ప‌టివ‌ర‌కు 1, 563 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 10 మంది చ‌నిపోయిన‌ట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది. 

Updated Date - 2020-04-01T18:57:41+05:30 IST