సౌదీలో కీలక కార్మిక సంస్కరణలు.. కోటి మంది ప్రవాసులకు మేలు

ABN , First Publish Date - 2021-03-16T15:31:37+05:30 IST

గల్ఫ్ దేశం సౌదీ అరేబియాకు విదేశాల నుంచి ఉపాధి కోసం వెళ్లే కార్మికుల సంఖ్య ప్రతియేటా భారీగా ఉంటుందనే విషయం తెలిసిందే.

సౌదీలో కీలక కార్మిక సంస్కరణలు.. కోటి మంది ప్రవాసులకు మేలు

రియాధ్: గల్ఫ్ దేశం సౌదీ అరేబియాకు విదేశాల నుంచి ఉపాధి కోసం వెళ్లే కార్మికుల సంఖ్య ప్రతియేటా భారీగా ఉంటుందనే విషయం తెలిసిందే. ప్రధానంగా భారత్.. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పొట్టచేతపట్టుకుని సౌదీకి వెళ్తుంటారు. అలాంటి వారందరికీ శుభవార్త. సౌదీ తాజాగా కీలక కార్మిక సంస్కరణలు చేసింది. ఆదివారం నుండి ఈ సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా ఆ దేశంలో పనిచేస్తున్న సుమారు కోటి మంది ప్రవాస కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ కొత్త సంస్కరణల కారణంగా ప్రవాసులు సులువుగా వేరే ఉద్యోగానికి మారవచ్చు. అలాగే యజమాని అనుమతిలేకుండానే కింగ్డమ్‌ను విడిచి స్వదేశానికి రావొచ్చు. అంతేగాక ఈ కొత్త కఫాలా స్పాన్సర్‌షిప్ వ్యవస్థ విదేశీ కార్మికులు తమ ఉద్యోగ ఒప్పందాలను డిజిటల్‌ రూపంలో నమోదు చేసుకోవడం ద్వారా నేరుగా ప్రభుత్వ సర్వీసులకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది.


ఇక తాజాగా సౌదీ చేసిన ఈ కార్మిక సంస్కరణలపై ఆ దేశంలోని ప్రవాసులు ప్రధానంగా భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సౌదీలో ఉంటున్న ఇమ్రోజ్ అబ్దుల్‌ రహ్మాన్ అనే ప్రవాస భారతీయుడు మాట్లాడుతూ.. తాను కింగ్డమ్‌కు వచ్చిన ఐదేళ్లలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఇది ప్రధానమైనదని అన్నారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల క్రితం అతనికి ఉద్యోగ మార్పిడి సమయంలో ఎదురైన సమస్యను గుర్తు చేశారు. పాత యజమాని నుంచి మరోకరి దగ్గర పనిచేసేందుకు వెళ్లాలంటే ఆ ప్రాసెస్ పూర్తి కావడానికి నెలలు పట్టేదని తెలిపారు. తాజాగా చేసిన సంస్కరణల ద్వారా ఆ సమస్య ఉండదని అబ్దుల్‌ రహ్మాన్ ఆనందం వ్యక్తం చేశాడు. సౌదీ అరేబియా తీసుకువచ్చిన ఈ కార్మిక సంస్కరణల వల్ల ఆ దేశ ఉద్యోగ మార్కెట్‌ విదేశీ కార్మికులను మరింత ఆకర్షించడం ఖాయమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

 

Updated Date - 2021-03-16T15:31:37+05:30 IST