క్రూడ్‌ కయ్యం

ABN , First Publish Date - 2020-03-10T09:57:16+05:30 IST

ముడి చమురు ధర కుప్పకూలింది. కొన్ని గంటల వ్యవధిలోనే సోమవారం అంతర్జాతీయ మార్కెట్‌లో పీపా (బ్యారెల్‌) చమురు ధర 30 శాతం తగ్గి 31 డాలర్లకు చేరింది. 1991 గల్ఫ్‌ యుద్ధం తర్వాత, ముడి చమురు ధర ఒకే రోజు ఇంత భారీగా...

క్రూడ్‌ కయ్యం

  • సౌదీ, రష్యా మధ్య ధరల యుద్ధం
  • ఒకే రోజు 30 శాతం తగ్గిన ధర 8 31 డాలర్లకు చేరిన బ్యారెల్‌

ముడి చమురు ఎగుమతి దేశాల మధ్య చిచ్చు మొదలైంది. ధరల పతనాన్ని అడ్డుకునేందుకు ఉత్పత్తి తగ్గించాలన్న సౌదీ అరేబియా విజ్ఞప్తిని రష్యా తోసిపుచ్చింది. దీంతో తమ చమురు కొనే దేశాలకు సౌదీ అరేబియా భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. దీనికి తోడు ఏప్రిల్‌ నుంచి  రోజువారీ ఉత్పత్తిని మరో 12 లక్షల పీపాల మేర పెంచేస్తామని ప్రకటించింది. దీంతో సోమవారం ముడి చమురు ధర ఒక్కసారిగా గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 30 శాతం పడిపోయింది. 


ముడి చమురు ధర కుప్పకూలింది. కొన్ని గంటల వ్యవధిలోనే సోమవారం అంతర్జాతీయ మార్కెట్‌లో పీపా(బ్యారెల్‌) చమురు ధర 30 శాతం తగ్గి 31 డాలర్లకు చేరింది. 1991 గల్ఫ్‌ యుద్ధం తర్వాత, ముడి చమురు ధర ఒకే రోజు ఇంత భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి. ఉత్పత్తి తగ్గింపుపై రష్యా-సౌదీ అరేబియా మధ్య తలెత్తిన విభేదాలే ఇందుకు కారణం. మార్కెట్‌ వాటా కోసం ఈ దేశాలు రోజువారీ చము రు ఉత్పత్తిని పెంచుకుంటూ పోతే త్వరలో పీపా చమురు 20 డాలర్లకు కూడా దిగొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ ధరల పతనంతో భారత్‌ పెద్దగా ప్రయోజనం పొందే అవకాశం కనిపించడం లేదు. దేశ చమురు అవసరాల్లో 15 రోజులకు మించి నిల్వ చేసే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం. 


ఎందుకంటే ?

కరోనా వైరస్‌ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి రేటు నీరసించింది. దాంతో రోజువారీ ముడి చమురు వినియోగం కూడా 15 లక్షల పీపాల మేర పడిపోయింది. దీంతో గత రెండు నెలల్లో చమురు ధర 57 శాతం తగ్గింది. తగ్గుతున్న ధరలను మళ్లీ పైకి లేపేందుకు రోజువారీ ఉత్పత్తిని కనీసం 10 లక్షల పీపాల మేర తగ్గించాలని సౌదీ సహా పలు ఒపెక్‌ దేశాలు కోరాయి. తన మార్కెట్‌ వాటా ఎక్కడ దెబ్బతింటుందోననే భయంతో రష్యా ఇందుకు ససేమిరా అంది. దీనిపై ఆగ్రహించిన సౌదీ అరేబియా తమ చమురు కొనే దేశాలకు ఒక్కో పీపాపై 8-12 డాలర్ల డిస్కౌంట్‌ ప్రకటించింది. దాంతో సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా ముడి చమురు ధరలు పతనమయ్యాయి. 


మున్ముందు 20 డాలర్లకు?

సౌదీ తన రోజువారీ ఉత్పత్తిని మరో 10-12 లక్షల పీపాలు పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇదే జరిగితే మిగతా ఒపెక్‌ దేశాలు తమ రోజువారీ ఉత్పత్తిని పెంచుతాయి. అప్పుడు సరఫరా డిమాండ్‌ను మించిపోయి చమురు ధర 20 డాలర్లకు దిగొచ్చినా ఆశ్చర్యం లేదు.


భారత్‌కు లాభమే

చమురు ధరల యుద్ధం చాలా వరకు భారత్‌కు కలిసిరానుంది. మన చమురు అవసరాల్లో 84 శా తం దిగుమతులే. గత నెల రోజుల్లోనే పీపా చము రు ధర 20 డాలర్ల వరకు తగ్గింది. దీంతో ఏడాదికి చమురు దిగుమతి బిల్లు కనీసం 3,000 కోట్ల డా లర్ల (సుమారు రూ.2.22 లక్షల కోట్లు) మేర తగ్గుతుందని అంచనా. బ్యారెల్‌ ధర ఒక డాలర్‌ తగ్గినా,  రోజువారీ చమురు దిగుమతి భారం రూ.3,000 కోట్ల వరకు తగ్గుతుంది. డిమాండ్‌ మసకబారి జీడీ పీ వృద్ధి రేటు నీరసించిన నేపథ్యంలో చమురు ధర పతనం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఓదార్పు కానుంది. ముడి చమురు ధరల తగ్గుదల భారత ఆర్థిక వ్యవస్థను ఇంకా ప్రభావితం చేసే అవకాశం ఉంది.


అవేమిటంటే..

  • చమురు దిగుమతి బిల్లు తగ్గి కరెంట్‌ ఖాతా లోటు, ద్రవ్య లోటు తగ్గే అవకాశం
  • తగ్గనున్న రిటైల్‌ ధరల సెగ 
  • ఆర్‌బీఐ కీలకమైన రెపో వడ్డీ రేటు మరింత తగ్గించే అవకాశం
  • విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధర మరింత తగ్గి తే విమానయాన కంపెనీలకు మేలు
  • చమురు ఆదారిత ముడి పదార్ధాలపై ఆధారపడిన ఎరువులు, పెయింట్లు, ప్లాస్టిక్స్‌, పాలిమర్‌ ఆధారిత కంపెనీలకు లబ్ధి
  • ధరలు తగ్గితే ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా వంటి కంపెనీ లాభాలకు గండిపడొచ్చు.

Updated Date - 2020-03-10T09:57:16+05:30 IST