కార్గిల్ వీరుడి పేరిట.. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్!

ABN , First Publish Date - 2020-09-27T14:46:07+05:30 IST

కార్గిల్.. ఈ పేరు చెప్పగానే ప్రతి భారతీయుడి గుండె ఉద్వేగంతో ఊగిపోతుంది. 1999లో దాయాది పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధం కళ్లముందు మెదులుతుంది.

కార్గిల్ వీరుడి పేరిట.. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్!

ధర్మశాల: కార్గిల్.. ఈ పేరు చెప్పగానే ప్రతి భారతీయుడి గుండె ఉద్వేగంతో ఊగిపోతుంది. 1999లో దాయాది పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధం కళ్లముందు మెదులుతుంది. ఈ యుద్ధంలో పాక్‌ను చిత్తుచేసి తిరుగులేని విజయం సాధించినా కూడా.. అప్పటి గాయాలు మాత్రం ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఈ యుద్ధంలో పాక్‌ సేనలకు చిక్కిన భారత ఆర్మీ కెప్టెన్ సౌరభ్ కాలియా తీవ్రమైన హింసలు ఎదుర్కొని దుర్మరణం పాలయ్యారు. ఇన్నేళ్ల తర్వాత ఆయన తండ్రి నరేందర్ కాలియా.. కుమారుడి పేరిట ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించి అతని పేరును చిరస్మరణీయం చేశారు.


ప్రశాంతతకు, ఆధ్యాత్మిక  వాతావరణానికి పెట్టింది పేరైన హిమాలయాల్లో 1999లో తుపాకులు పేలాయి, ఫిరంగులు గర్జించాయి. దీనంతటికీ కారణం అప్పుడు పాకిస్తాన్, భారత్ మధ్య చెలరేగిన కార్గిల్ యుద్ధమే. నియంత్రణ రేఖ వెంబడి పర్వత శిఖరాలపై ఉన్న శిబిరాలను భారత, పాకిస్థాన్ సైనికులు ఏటా శీతాకాలానికి ముందు ఖాళీ చేసేవారు. 14వేల నుంచి 18వేల అడుగుల ఎత్తులో ఉన్న ఆ శిబిరాల్లో శీతాకాలం ఎవరూ ఉండలేరు. మానవ మనుగడకు దుర్లభమైన పరిస్థితులు ఉండటంతో రెండు దేశాల మధ్య ఈమేరకు అవగాహన కుదిరింది. 1999లో శీతాకాలంలో భారత బలగాలు వైదొలగడంతో పాక్ సైనికులు తమ వక్రబుద్ధి బయటపెట్టారు. అక్రమంగా సరిహద్దులు దాటి భారత భూభాగంలో 4-10 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చారు.


భారత భూభాగంలోకి పాక్ సైన్యం అక్రమంగా చొరబడటాన్ని ఓ గొర్రెల కాపరి చూశాడు. వెంటనే వెళ్లి దగ్గరలోని మిలటరీ పోస్టుకు సమాచారం అందించాడు. అది కెప్టెన్ సౌరభ్ కాలియా నేతృత్వంలోని శిబిరం. విషయం తెలియగానే ఐదుగురు జవాన్లతో కలిసి కాలియా గస్తీకి వెళ్లారు. వీరందరినీ పాక్ సైన్యం ప్రాణాలతో పట్టుకుంది. చిత్రహింసలకు గురిచేసింది. కనుగుడ్లను పీకేసింది, ఇనుప రాడ్లను కాల్చి చెవుల్లో పొడిచింది, ముక్కు, పెదాలు కోసేసింది, మర్మాంగాలను కూడా కోసేసింది. 22రోజులపాటు ఈ బృందానికి నరకం చూపించి, చివరకు తుపాకీలతో కాల్చి చంపేసింది. అనంతరం వీరి ఛిద్రమైన మృతదేహాలను భారత్‌కు పంపింది. ఇదే కార్గిల్ యుద్ధానికి నాంది పలికింది.


యుద్ధం ముగిసి ఇన్నేళ్లయినా సౌరభ్ కాలియా పేరును దేశం మర్చిపోలేదు. ఈ విషయాన్నే చెప్పిన సౌరభ్ కాలియా తండ్రి నరేందర్ కాలియా.. కుమారుడి పేరిట పంజాబ్‌లో ఓ ఆస్పత్రి ఏర్పాటు చేశారు. ఇక్కడ చికిత్స చేయించుకున్న పేషెంట్లు తమ కుమారుడిని ఆశీర్వదిస్తారని, తనకు అదొక్కటి చాలని నరేందర్ కాలియా చెప్పారు. కుమారుడిని కోల్పోయి బాధల్లో ఉన్న తమకు దేశం మొత్తం అండగా నిలబడిందని, అందుకే సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో 'కేడీ ఆస్పత్రి'ని ఏర్పాటు చేశామని వివరించారు.


ఈ ఆస్పత్రి నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించిన డాక్టర్ వివేక్ గౌతమ్ మాట్లాడుతూ.. తనకు ఎప్పటి నుంచో ధర్మశాలలో ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలనే కోరిక ఉందన్నారు. అనుకోకుండా నరేందర్ కాలియాను కలిశానని, తన ఆలోచన ఆయనకు నచ్చడంతో ఇద్దరమూ చేతులు కలిపి ఆస్పత్రి నిర్మించామని చెప్పారు. అప్పటికే నరేందర్.. తన కుమారుడి పేరిట స్కూలో, ఆస్పత్రో నిర్మించాలనే యోచనలో ఉన్నారట. దీంతో తన ఆలోచనకు నరేందర్ వెంటనే అంగీకరించినట్లు వివేక్ తెలిపారు.


ధర్మశాలలో చాలామంది మాజీ సైనికాధికారులు ఉన్నారని, అయితే వీరంతా ఎక్కువగా ఢిల్లీ, లూధియానా తదితర ప్రాంతాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారని డాక్టర్ వివేక్ చెప్పారు. వీరందరికీ స్థానికంగానే అత్యుత్తమ చికిత్స అందించాలనే లక్ష్యంతో కేడీ ఆస్పత్రి నిర్మించినట్లు వెల్లడించారు. ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఆయుర్వేద, పంచకర్మ యూనిట్‌ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

Updated Date - 2020-09-27T14:46:07+05:30 IST