‘సేవ్‌ అలిపిరి రోడ్‌’ ఉద్యమం

ABN , First Publish Date - 2021-06-23T06:40:20+05:30 IST

గరుడవారధిని..

‘సేవ్‌ అలిపిరి రోడ్‌’ ఉద్యమం

గరుడవారధి పొడిగింపుపై సోషల్‌ మీడియాలో నిరసనల వెల్లువ


తిరుపతి: గరుడవారధిని అలిపిరి వరకు పొడిగించాలని టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయంపై తిరుపతివాసులతో పాటు శ్రీవారి భక్తుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోషల్‌ మీడియాలో ‘సేవ్‌ అలిపిరి రోడ్‌’ పేరుతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టోగ్రాంలలో ‘డోంట్‌ స్పాయల్‌ అలిపిరి రోడ్‌ బ్యూటీ, సేవ్‌ కపిలతీర్థం టు అలిపిరి రోడ్డు, సేవ్‌ హరితవనం’ వంటి హ్యాష్‌ ట్యాగ్‌లతో పోస్టులు ప్రత్యక్షం అవుతున్నాయి. తిరుపతి వాసులే కాదు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పాటు తిరుపతి యాత్రకు వచ్చే భక్తులు పెద్ద ఎత్తున  స్పందిస్తున్నారు. ‘మొన్న రాయలవారి కూడలి, నిన్న తెలుగుతల్లి కూడలి, నేడు నంది కూడలి’ అని ఒకరు వ్యాఖ్యానిస్తే, ‘డబ్బు కోసం వాళ్లు గరుడవారధిని తిరుమల వరకు కూడా పొడిగించగలరు’ అని ఇంకొకరు ఆరోపణ విసిరారు.


‘తిరుపతి మొత్తంలో ప్రశాంతతను ఇచ్చే ఏకైక రోడ్డు.. ఎంతటి మానసిక ఒత్తిడినైనా తగ్గించే రోడ్డు’ అంటూ దానిని కాపాడుకోవాలనే పిలుపునిస్తున్నారు. ‘ఇప్పుడే కపిలతీర్థం రోడ్డులోని చెట్లు, పచ్చదనం ఫొటోలు తీసి దాచుకోండి. ఇక ఇవి కనబడవు. ‘ట్రాఫిక్‌ లేని రోడ్డులో ఫ్లై ఓవరా! అనవసర అభివృద్ధి, దివ్యారామం అందాలను దెబ్బతీసే చర్య’ అని ఒకరంటే, ‘అలిపిరి నుంచి కపిలతీర్థం వరకు పదేళ్లలో ఒక్కసారైనా ట్రాఫిక్‌ జాం అయ్యిందా? ఎందుకు ఈ పిచ్చి పని?’ అని మరొకరు ప్రశ్న విసురుతున్నారు. ‘తిరుపతి వాసులారా దయచేసి పోరాడండి. ర్యాలీ చేయండి. ఎలాగైనా ఆ అందమైన రోడ్డును కాపాడండి’ అంటూ, ‘కోర్టులో కేసు వేయండి. పనులు జరగకుండా  ఆపండి’, ‘ఆలస్యం కాలేదు. ఇప్పటికైనా మేల్కొండి. కపిలతీర్థం రోడ్డును కాపాడుకోవాలి’ అంటూ పిలుపులు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి.


‘ఈ రోడ్డుపై బహిరంగంగా పోల్‌ పెట్టండి. ప్రజల అభిప్రాయాలకు విలువనిచ్చి పాలనచేయండి. పాలకురాలా కళ్లు తెరవండి’ అని కూడా సవాల్‌ విసురుతున్నారు. టీటీడీ ఛైర్మన్‌, ఈవో, తిరుపతి ఎమ్మెల్యేని తమ కామెంట్స్‌లో పింగ్‌ చేస్తున్నారు. మొత్తం మీద గరుడవారధి పొడిగింపు అంశంపై సోషల్‌ మీడియా వేదికగా ఒక ఉద్యమమే రాజుకునేలా ఉంది.

Updated Date - 2021-06-23T06:40:20+05:30 IST